ఆయనది విషం చిమ్మే భాష

– మోడీ వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్‌
– ఈసీతో కాంగ్రెస్‌ బృందం భేటీ
– 16 ఫిర్యాదులందజేత
న్యూఢిల్లీ : రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే మోడీ కొత్త ఎత్తుగడలు అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఆయనది విషం చిమ్మే భాష అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ప్రధాన సమస్యలను ఎదుర్కొంటుంటే మోడీ మాత్రం అంతా బాగానే ఉన్నదని చెబుతున్నారని సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో రాహుల్‌ ఎద్దేవా చేశారు.
కాగా మోడీపై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రధాని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆయన హోదాకు అవి తగవని తెలిపింది. అభిషేక్‌ మనుసింఘ్వీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం ఈసీతో సమావేశమైంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని మోడీకి సూచించాలని కోరింది. ఇదిలావుండగా ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ పార్టీ మరో 16 ఫిర్యాదులు కూడా అందజేసింది. వీటిపై విచారణ జరపాలని, అధికార బీజేపీపై చర్యలు తీసుకోవాలని కోరింది.