‘మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు! ఆ జీరబోయిన గొంతులో… జీవమెవరు పోసెదరు! ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో…తుపాకులకు ఎదురు నడిచినా తూటనెవరు దాచెదరో..!’ తను లేనినాటి కోసం తనకుతాను రాసుకని పాడుకున్న పాట ఇది. గద్దర్ పేరుతో సాంస్కృతిక యుద్ధరంగ సైనికుడై పోరాడుతున్న గుమ్మడి విఠల్ ఆగస్టు 6న అనారోగ్యంతో మరణించాడు. 74 ఏండ్ల జీవితంలో యాభై ఏండ్లూ ప్రజాకళాజీవితానికే అంకితమై తెలుగు విప్లవ గీతానికి కొత్త ఒరవడిని, అగ్నిసెగను అద్దిన జనకళా మహానౌక అతడు. ఆయన భౌతికంగా మృతినొందవచ్చుగాక, బతికిన కాలాలలో అతని గాన విద్యుత్ ప్రవాహం ఎందరిలోకో ప్రవహించి ప్రజ్వలిస్తూనే వుంది. అది నిత్య చేతనమై సామూహిక బృందగానమై, సమరశీల కళగా కొనసాగుతూనే వుంటుంది. గద్దర్ అనగానే మనకు గుర్తుకొచ్చే దృశ్యం, గొంగడి భుజాన వేసుకుని, ఎర్రని జెండా పట్టుకుని, కర్రను చేతబట్టి, పంచె కట్టుతో కాళ్లగజ్జెలతో ఒక్క ఉదుటున ఎగిరి పాట నెత్తుకునే ప్రదర్శనే కండ్లల్లో మెరుస్తుంది. ఇది ప్రజాకళకు ఆయనందించిన ఆహార్యం. అతని పాట దృశ్య రూపకం. ఉర్రూతలూగించే మహా ప్రదర్శన. అది నాభిలోంచి నింగిలోకి దూకే నిప్పుల ధార, ప్రజాగుండె ఘోష. సమసమాజం కోసం గర్జించే పర్జన్యశంఖారావం.
సామాన్యుల బాధలను, గాధలను, జనం భాషలో, జానపద లయలో పాటల్ని సృజించి గానం చేసినవాడు గద్దర్. అతను అమరులను గానం చేస్తున్నప్పుడు కన్నీళ్లు గుండెల నిండుతాయి. ఉద్వేగం ఉప్పెనలా ఎగిసి పడుతుంది. త్యాగం ధ్వనించి ప్రేరణనందిస్తుంది. పీడక కులాల, పీడిత వర్గాల జీవన బాణీలను కొత్తగా సృష్టించిన కర్త. దళిత డప్పు శబ్దాలకు అరుణ అగ్నిశ్వాసను అందించిన ప్రజాకళారూపశిల్పి. విప్లవ గేయాలకు నూతన సంప్రదాయాన్ని ఏర్పరచి వందల పాటలకు ప్రాణం పోశాడు. తెలంగాణ పాటకు కొత్త సొబగులద్ది ఉత్తేజ పరిచిన మహా ప్రభావ ప్రవాహం అతనిది. ఆయన ప్రతి అక్షరం, అభినయం, ఆలాపన ప్రజల పక్షం వహిస్తుంది. జన విముక్తికోసం తపిస్తుంది. నినాదమై జ్వలిస్తుంది. కేవలం విప్లవోత్తేజ గీతాలే కాదు, మానవీయ సంబంధాలను ఉదాత్తంగా గానం చేశాడు. ‘సిరిమల్లె చెట్టు కింద లచ్చమమ్మో, లచ్చుమమ్మ, నువు చినబోయి కూచున్న వెందుకమ్మా ఎందుకమ్మా’ అనే పాట ఎంత దయార్థ్రంగా వుంటుంది! ‘మల్లెతీగకు పందిరివోలే మసక చీకటిలో వెన్నెలవోలె నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’ అని అనుబంధాలపై అద్భుతమైన సృజన చేయగలిగింది గద్దర్ మాత్రమే. పల్లెల్లో తన బిడ్డ ఊరెళ్లుతుంటే జర భద్రం బిడ్డా, పైళం కొడుకా అని జాగ్రత్తలు చెప్పడటం సాధారణం. ఆ సామాన్యులు పలికే పదాలను తీసుకుని ‘జర భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న జరా పైళం కొడుకో…ఎక్కేకాడ, దిగేకాడ, తొక్కుడుకాడ, మలుపుకాడ!’ అంటూ పట్టణాలకు వలసవచ్చిన కూలీల బాధలను, పట్నంలో దోపిడీ తీరును కండ్లకు కట్టించడం ఆయనకు వచ్చిన విద్యమాత్రమే. ప్రజలతో మమేకమై తిరిగిన గళమే అలాంటి పాటలు పాడగలుగుతుంది. ‘మా భూమి’ సినిమాలో యాదగిరి రాసిన ‘బండెనక బండికట్టి…’ పాటకు కొత్త గొంతుకనిచ్చి నేటికీ సజీవం చేశాడు. ఆఖరికి తనను చంపటం కోసం తుపాకులెక్కుపెట్టి తూటా పేల్చిన పోలీసుల మీద కూడా పొట్టకూటి కోసం పోలీసన్నా అంటూ పాటలు పాడాడు. చీపురు కట్టమీద, పిల్లిమీద, ఫ్యాను మీద పాటలల్లాడు. దేనిమీద రాసినా పాడినా, ప్రజాకోణాన్ని మరువలేదు. వీడలేదు.
గద్దర్ ఒక వ్యక్తికాదు. అతడే ఒక సైన్యం. ఎంతోమంది ప్రజాకళాకారులకు స్ఫూర్తిగా నిలుస్తాడు. ఎన్నో దళాలను తయారు చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో వేల, లక్షల ప్రదర్శనలిచ్చాడు. ఇతర రాష్ట్రాలలోనూ తిరిగి తన గొంతు వినిపించాడు. గద్దర్ పాటలు ఇతర భాషలలోనూ అనువాదమయ్యాయి. ఎందరికో చైతన్యాన్ని, ప్రేరణను అందించిన ఆయనపాట ఆధిపత్యానికి, రాజ్యానికి, మతతత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును పురికొల్పుతుంది. 1997లో ఆయన మీద హత్యాహత్నం జరిగింది. అప్పుడు కాల్పుల్లో దిగిన తూటా చివరికంటా తన శరీరంలోనే రాజ్య హింసకు గుర్తుగా నిలచే వుంది. అయినా ఎప్పుడూ అదరలేదు బెదరలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విస్తృతంగా తనగళాన్ని ఎత్తి ప్రజలను కదిలించాడు. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా’ అంటూ మార్మోగాడు.ఎక్కడ ప్రజాసమస్యలపై పోరాటం కనపడినా అక్కడ గద్దర్ గళం వినిపించేది. 2016లో ప్రజాసంఘాలు సామాజిక సమానత్వం కోసం మహాజనపాదయాత్ర జరుపుతుంటే పాల్గొని సంఘీభావం తెలిపాడు. ప్రపంచీకరణకు, మతతత్వానికి వ్యతిరేకంగా జరిగిన సాహిత్య కృషికి అండగా నిలిచాడు. అయితే ఈ మధ్యకాలంలో రాజకీయంగా కొంత భిన్నంగా వ్యవహరించడం వలన విమర్శలూ ఎదుర్కొన్నారు. రామానుజ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా పాటతో ప్రచారం చెయ్యడమూ వివాదాన్ని లేపింది. ఎన్ని ఒడిదుడుకులు, అటుఇటుగా అడుగులు పడినా, పాట తొణకలేదు. పోరుగీతం ఆగలేదు. ఇప్పుడు గద్దర్‌ను తలచుకుంటే మనకు అతని పాటే దర్శనమిస్తుంది. తిరుగుబాటు పాటలోనే గద్దర్ మన మనసుల్లో నిలుస్తాడు.”నా దేశంలో, నా ప్రజలు ఎంతకాలం, మనుష్యులుగా గుర్తించబడరో, అంతకాలం, ఈ తిరుగుబాటు గీతం, పాడుతూనే వుంటాను’ నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది” అని చెప్పిన గద్దర్ జీవితం ధన్యం. తెలుగు నేలలో ప్రజా పాటకు కొత్తరూపునిచ్చిన గద్దర్‌కు విప్లవ జోహార్లు!