మూతపడుతున్న చారిత్రక ఇండియా క్లబ్‌

లండన్‌ : బ్రిటన్‌ రాజధాని లండన్‌ నడిబొడ్డున గల చారిత్రక ఇండియా క్లబ్‌ మూతపడుతోంది. క్లబ్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన కృష్ణ మీనన్‌తో సహా జాతీయవాదులకు కేంద్రంగా వున్న, భారత స్వాతంత్య్ర ఉద్యమం తొలినాళ్ళ మూలాలు కలిగిన ఈ క్లబ్‌ను వచ్చే నెల్లో మూసివేయనున్నారు. ఈ క్లబ్‌ను మరింత ఆధునాతనమైన హోటల్‌గా మార్చడానికి ఆ స్థల యజమానులు నిర్ణయించారు. క్లబ్‌ మూసివేతకు నోటీసులిచ్చారు. దాంతో క్లబ్‌ మూసివేయడానికి వ్యతిరేకంగా క్లబ్‌ ప్రొప్రయిటర్లు యాద్గార్‌ మార్కర్‌, ఆయన కుమార్తె ఫిరోజాలు ‘సేవ్‌ ఇండియా క్లబ్‌’ పేరుతో సుదీర్ఘంగా పోరాటం సాగించారు. ఎలాగైనా ఈ క్లబ్‌ను కొనసాగించాలని వారు ప్రయత్నించారు. కానీ ఆ పోరాటంలో వారు ఓడిపోయారు. మూసివేతను ప్రకటించారు. సెప్టెంబరు 17 చివరగా ప్రజలకు అందుబాటులో వుండే రోజని వారు తెలిపారు. 70ఏళ్ళ క్రితం ప్రారంభించిన ఈ ఇండియా క్లబ్‌ భారత ఉపఖండానికి చెందిన మొదటి తరం ఇమ్మిగ్రెంట్లకు ఒక ఇల్లు వంటిదని ఫిరోజా వ్యాఖ్యానించారు. యువకులైన భారతీయులు ఇక్కడ కూర్చుని, తింటూ, రాజకీయాలు చర్చించుకుంటూ, తమ భవితవ్యాల గురించి ప్రణాళికలు వేసుకుంటారనే ఉద్దేశ్యంతోనే మీనన్‌ ఈ క్లబ్‌ను నెలకొల్పారని ఎస్‌ఓఎఎస్‌ (స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌)కి చెందిన పార్వతి రామన్‌ వ్యాఖ్యానించారు.