జహీరుద్దీన్ అలీఖాన్‌కు ఈ పుస్తకం అంకితం ఇచ్చారు. ఎన్ వేణుగోపాల్ ”అత్యవసరం ఈ చరత్ర పఠనం” అంటూ విలువైన చక్కటి ముందుమాట రాయగా, షేక్ యూసుఫ్ బాబా ఆప్త వాక్యం రాశారు.
నవాబు సిరాజుద్దౌలా తొలిసారిగా 1757లో ఆంగ్లేయులపై పోరాటం చేశాడు. 1763లో బెంగాల్‌లోన ఫకీర్లు – సన్యాసులు కలసి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల మీద ధ్వజమెత్తి పోరాడారు. ఆ పోరాటాలు 1800 దాకా సాగేయి. 1724లో దక్కన్ ప్రాంతంలో నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్ జా హైదరాబాద్ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. సీడెడ్ జిల్లాలు నిజాం సర్కార్ ఆధీనంలోకి వచ్చాయి. ఈ ప్రాంతమంతా ఫ్రెంచి వారి ప్రాపకం కోసం 1753లో వారి పరం చేశాడు నాటి నిజాం నవాబు. 1800లో సైనిక సహకార ఒప్పందం కింద నిజాం కడప, కర్నూలు అనంతపురం, బళ్లారి జిల్లాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి ధారాదత్తం చేశాడు. మత మార్పిడులపై వ్యతిరేకించిన కొందరు సైనికులు గులాం సిద్ధిఖి – హుస్సేన్; ఖాదిర్ బేగ్ లాంటి స్వదేశీ సైనిక యోధులు తమ సైనిక పటాలాలతో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా వహబి ఉద్యమానికి ముబారి జుద్దేలా కేంద్ర స్థానమయ్యాడు. కర్నూలు నవాబు రసూల్‌ఖాన్, జుల్ఫికర్ ఆలీ (ఔరంగాబాద్) పోరాడారు. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఆరంభమైంది. దీనికి ముందే నిజాం సంస్థానంలో తెలంగాణ బిడ్డలు ఆయా సందర్భాల్లో పోరాటాలు చేసి స్పందించారు. మౌల్వీలు, ఫకీర్ల పోరాటాలు, స్వదేశీ సైనికులలో తిరుగుబాటు జ్వాలలు ఎగసాయి. 1857లో పఠాన్ తుర్రేబాజ్‌ఖాన్, మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్‌ల సంయుక్త నాయకత్వంలో బ్రిటీష్ రెసిడెన్సీపై దాడి చేశారు.
ఖిలాఫత్ రద్దు – రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా ప్రపంచ ముస్లింలతో పాటు భారతీయ ముస్లింలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆగ్రహవేశాలతో పోరాడారు. 1939లో కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటు, అలంఖుంద్‌మీర్, ముఖ్దూం మోహిద్దీన్, రజ్వీ, హుస్సేని, ఇబ్రహీంల కృషి జైహింద్ నినాద కర్త సఫ్రానీ లాంటి నేతల కృషి, ఎన్నో పోరాట ఘట్టాలు మనం చూసి చదివి ఎంతో స్ఫూర్తి పొందేలా నశీర్ రాశారు. విలువైన పుస్తకం ఇది.
– తంగిరాల చక్రవర్తి, 9393804472