ఈ రోజు నేనే కాఫీ పెట్టిస్తానని చెప్పి భర్తే కాఫీ పెట్టివ్వచ్చు. ఇదిగో మీ దినోత్సవ సంబరాన కొత్త చీర తెచ్చానని అపురూపంగా అందివ్వనూవచ్చు. మహిళకు ప్రత్యేక ఉత్సవాలను జరిపి, ఆటలాడించి, పోటీలు నిర్వహించి, బహుమతులు పంచి, స్త్రీ గొప్పతనాన్ని వేనోళ్ల పొగడనూవచ్చు. నింగికెత్తి నినందిచనూవచ్చు. కానీ ఒకరోజు గడిచి పోతుంది. మళ్లీ కథ మామూలే. చాకిరి యథావిధి, సాధింపులూ, హీనపు మాటలూ, సనాతన ధర్మాలూ, సంప్ర దాయ తలపోతలు… ఆడది గీత దాటి చెడిందనే అపవాదులూ గట్రా అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. వేధింపులూ, అత్యాచారాలు, హత్యలు, కుల దురహంకార హత్యలు షరామామూలే. కొన్నేండ్లుగా జరుగుతున్నదిదే. మహిళకు ఉత్సవం చేయాల్సిందే. శతాబ్దకాలంగా ఎదిగిన మహిళల అడుగు లను కొనియాడుతూ ప్రేరణ పొందాల్సిందే. కానీ స్త్రీల పట్ల ఆధునిక పాలకుల ధోరణి మారలేదు. ఆలోచనలు, అభిప్రాయాలూ మారలేదు. మహిళలు పొందిన ప్రగతి ఏదైనా ఉందంటే, అది వారు దశాబ్దాలుగా పోరాడి సాధించు కున్నదే. అసలు మహిళా దినోత్సవ భావననే, శ్రామికులుగా వారి హక్కుల కోసం వాళ్లే చేసిన పోరాటంలోంచే ఉద్భవించింది.
మహిళలు చరిత్రను తిరగరాస్తారాని అపుడెపుడో గురజాడ చెప్పాడు. అందుకేనేమో వాళ్లను చట్టసభల్లోకి అడుగుపెట్టనిస్తలేము. అసలు కలాన్ని, కాగితాలనూ దక్కనివ్వటం లేదు. చూడండి దేశంలో మహిళల అక్షరాస్యత, పురుషులకంటే తక్కువ. మనదేశంలో పరిపాలన రాజ్యాంగం ప్రకారం, దాని ఆధారంగా జరుగుతుందనేది అందరికీ సామాన్యంగా తెలిసే విషయం. కానీ రాజ్యాంగేతర సనాతన ధర్మాలు, సంప్రదాయాలు అనధికారికంగానే అమలవు తుంటాయి. అవి ముఖ్యంగా మహిళలకు సంబంధించినవే ఎక్కువ. తత్ఫలితంగా స్త్రీ పురుషులు సమా నమే నినాదం, ఇప్ప టికీ నినాదమే. నిజమయ్యేది ఎప్పుడో తెలుసు కోవటమే ఈ దినోత్సవం నాడు చేయాల్సిన పని. ”ఎక్కడమ్మా నువ్వు లేనిది? ఏమిటి నువుచేయలేనిది! డాక్టరు వయ్యావు, యాక్టరువయ్యావు, కలెక్టరు వయ్యావు, మినిస్టరు వయ్యావు, సమాజ గమనం నువులేకుంటే గతితప్పి గంగ పాలవుతుంది” అన్నీ అయినా ఆమె పరిస్థితి మాత్రం గతి తప్పుతూనే వుంది. పాట మాత్రం కొనసాగుతూనే ఉంది. అందుకనే ఈ అసమా నతల కొనసాగింపునకు కారణాలను చర్చించుకోవాల్సిన సంద ర్భానికే ఈ దినోత్సవాన్ని ఉపయోగించాలి.
నేడు మహిళా సాధికారతకు, సమాజంలో సమానత సాధనకు రెండు శక్తులు ప్రధానంగా అవరోధం గా ఎదురౌతున్నాయి. ఒకటి కార్పొరేట్ పెట్టుబడి, రెండు హిందూ ఫాసిస్టు శక్తుల పెరుగుదల. మొదటిది మహిళను అసలు మనిషిగానే చూడదు. సరుకుగా మార్చేస్తుంది. వస్తు వినియోగదారుగా తయారు చేస్తుంది. శ్రమ చేసే వారందరినీ సరుకుగానే పరిగణిస్తుంది. ఏ సమానతైనా ఆ పరధి మేరకే. ఇక రెండోది నేడు మనదేశంలో ఎదుర్కొంటున్న సమస్య. రెండూ కలిసి చేస్తున్న దాడికి మహిళలు మరింత గురవుతున్నారు.అందుకే ఇరవైయేండ్ల పోరాటంలోనూ న్యాయం జరగక పడ్డ వేదన బిల్కిస్‌బానో అనుభవిస్తే, వీడు మా మాన ప్రాణాలను దోచుకున్నాడని ధైర్యంగా చెప్పినా కూడా మహిళా రెజ్లర్లకు న్యాయమే అందలేదు. నిర్లజ్జగా నేరస్తులైన పురుషుల వైపే ప్రభుత్వం నిలబడటం కన్నా వేరే రుజువులేమి కావాలి. ఇంట్లో వంట వండి, పిల్లల్ని కనిపెంచటం, భర్తకు సేవ చేయటం స్త్రీల విధులు అని ఢంకా బజాయించి చెబుతున్న నాయకమన్యుల ఏలుబడిలో సమానత గురించి ఉత్సవం చేస్తున్నామనటంలో అర్థమేమి? ఒక ఆడది కావటం, ఆదివాసీ కావటం వల్లనే కదా పార్లమెంటు నూతన భవనంలోకి, రామాలయ ప్రాణ ప్రతిష్టకూ అవకాశమే నిరాకరించింది. స్త్రీని బానిసగా చూసే ఆలోచనాపరుల పరిపాలనా దాడులను ఎలా ఎదుర్కోవాలో చర్చించటమే ఈ దినోత్సవ కర్తవ్యం కావాలి.
శ్రామికుల హక్కుల సాధన పోరాటం నుండే సమానత సాధ నకు మార్గం పడుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛతో పాటుగా ఉద్యమ స్వేచ్ఛ సాధించబడితేనే మహిళా సాధికారత సఫలమవుతుంది. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే విప్లవ విజయాల నుండే మహిళల సమానతకూ అంకురార్పణ జరిగిందనేది తెలుస్తుంది. మన సమా జంలోనూ సాంస్కృతికమైన, సామాజికమైన ఉద్యమ ప్రస్థానంలో సగభాగంగా ఉన్న మహిళలు పాల్గొనడం ద్వారానే ఈ దినోత్సవం ఆశించిన లక్ష్యాలను సాధించగలుగుతాము. నేటి ఆధునిక మహి ళలు సైతం, ఎంత ఆధునిక విద్యను, విజ్ఞానాన్ని ఆర్జించినప్పటికీ ఆచరణలో మాత్రం, సంప్రదాయాల పేరుతో మూఢ విశ్వాసాలకు లోనవడం చూస్తున్నాము. ఒక్క మహిళలే కాదు. యువత కూడా అదే ధోరణిలో ఆలోచిస్తున్నారు. అది మారాల్సిన అవసరం ఉంది.
ఒకవైపు మూఢత్వం, రెండోవైపు కార్పొరేటు కన్సూమరిజం, సాంస్కృతిక తిరోగమన భావాలను, వాస్తవిక విషయాలపై తెరలను కప్పుతున్న మహాశక్తిగా కీర్తిస్తూనే, దేవతను చేసి ప్రతిమలా కూర్చో పెడుతున్నారు తప్ప సమానతా ధర్మాన్ని పాటించడం లేదు. వీటన్నింటినీ గుర్తెరిగి సంఘటిత శక్తిగా చైతన్యయుతంగా కదలడమే మహిళా దినోత్సవానికి సార్థకత.