– డీఆర్‌డీవో అద్భుత విజయం
న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ సరికొత్త అంచనాలను అందుకుంది. ఒకే ఫైరింగ్ యూనిట్ ద్వారా ప్రయోగించిన నాలుగు క్షిపణులు 25 కిలోమీటర్ల పరిధిలో దూసుకొస్తున్న నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో ఢ కొట్టేలా అభివృద్ధి చేసిన నూతన వ్యవస్థ విజయవంతమైనట్లు ఆదివారం వెల్లడించింది. ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి దేశంగా భారత్ అవతరించిందంటూ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో సంబంధిత ప్రజెంటేషన్ వీడియోను పోస్టు చేసింది.”సింగిల్ ఫైరింగ్ యూనిట్‌ని ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా ఏకకాలంలో 25కి.మీ పరిధిలో దూసుకొస్తున్న 4 లక్ష్యాలు ఛేదించే సామర్థ్యాన్ని ప్రదర్శించే తొలి దేశంగా భారత్ అవతరించింది. స్వదేశీయంగా రూపొందించిన ‘ఆకాశ్ వెపన్ సిస్టమ్’ ద్వారా ఈ ప్రయోగం చేపట్టి విజయం సాధించాం” అని డీఆర్‌డీవో పేర్కొంది. డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో అస్త్రశక్తి 2023 విన్యాసాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) నిర్వహించింది. ఈ సందర్భంగా నింగి నుంచి దూసుకొచ్చిన నాలుగు లక్ష్యాలను ఆకాష్ క్షిపణి వ్యవస్థ ఏకకాలంలో ధ్వంసం చేసింది. దీని కోసం ఒకే ఫైరింగ్ యూనిట్‌ను వినియోగించారు. కమాండ్ గైడెన్స్ ద్వారా సుమారు 25 కిలోమీటర్ల పరిధిలోని నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించే సామర్థ్యాన్ని ఆకాష్ క్షిపణి వ్యవస్థ చాటింది.భూతలం నుంచి గగనతలానికి దూసుకెళ్లే ఈ క్షిపణిని షార్ట్ రేంజ్ లక్ష్యాలను ఛేదించేందుకు వాడతారు.