– మంత్రి తుమ్మలను కలిసిన కేంద్ర కార్మిక సంఘాల నాయకులు
నవతెలంగాణ- ఖమ్మం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని 106(1)(2) రద్దు చేసి మోటార్ రంగ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీఎంటీడీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోటార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టం మూలంగా లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఒకవేళ డ్రైవర్‌కు శిక్ష పడితే కుటుంబానికి దూరం కావాల్సి వస్తుందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల జరిమానా కట్టే పరిస్థితే ఉంటే డ్రైవర్‌గా ఉండాల్సిన అవసరం లేదన్నారు. డ్రైవర్ల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టంపై పునరాలోచన చేసి రద్దు చేయాలని కోరారు. డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్‌టీయూసీ) జిల్లా అధ్యక్షులు సీహెచ్ విప్లవ్ కుమార్, ఆటో యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా ఉపాధ్యక్షులు రావుల శ్రీను, ఆటో యూనియన్ (ఐఎఫ్‌టీయూ) జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీనివాస్, టీఎంటీడీయూ జిల్లా అధ్యక్షులు పేరుగు బిక్షం, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.