హిట్‌ కళ కనిపిస్తోంది : దర్శకుడు వీర శంకర్‌

వెంకట శివ సాయి పిల్మ్స్‌ పతాకంపై మణికొండ రంజిత్‌ సమర్పణలో సత్యరాజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ముత్యాల రామదాసు, నున్నా కుమారి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. రవితేజ నున్నా హీరోగా, నేహ జురెల్‌ హీరోయిన్‌గా నటించారు. ఇటీవల ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన మాడ్లాడుతూ, ”రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి’ అనేది అందరికీ బాగా కనెక్ట్‌ అయ్యే టైటిల్‌. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ కథతో దర్శకుడిగా సత్యరాజ్‌ మొదటి సినిమా చేశాడు. సినిమాలో కమర్షియల్‌ అంశాలు దండిగా ఉన్నాయి. సత్యరాజ్‌కి ఆల్‌ ది బెస్ట్‌. ముత్యాల రామదాసు నేతత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నాను. రోషన్‌ సాలూరి మంచి సంగీతం అందించాడు. అందుకే ఆదిత్య సంస్థ పాటలను విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. హీరో రవితేజ నున్నా ట్రైలర్‌లో బాగా చేశాడు. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తున్నాడు. హీరోయిన్‌ నేహ కూడా ఎటువంటి బెరుకు లేకుండా చాలా బాగా చేసింది. ఈ చిత్రం ఘన విజయం సాధించి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘మంచి మ్యూజిక్‌, ఫైట్స్‌ వంటి కమర్షియల్‌ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధించడం చూస్తున్నాం. ఈ చిత్రంలో కూడా ఆ కళ కనిపిస్తుంది. ఈ చిత్ర నిర్మాణంలో భాగమైన రవితేజ తల్లి కుమారి, రామిశెట్టి వెంకట సుబ్బారావు, కలవకొలను సతీష్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈనెల 9న విడుదలవుతున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను’ అని నిర్మాత ముత్యాల రామదాసు చెప్పారు. కథానాయకుడు రవితేజ నున్నా మాట్లాడుతూ,’నిర్మాత ముత్యాల రామదాసు మా వెనకుండి ఈ సినిమాని విజయవంతంగా పూర్తి చేయించి, ఇక్కడివరకు తీసుకొచ్చారు. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఉండే కమర్షియల్‌ సబ్జెక్టు ఇది. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను’ అని తెలిపారు. ‘మా సినిమా పూర్తయ్యి, విడుదలకు సిద్ధమైందంటే రామదాసు కారణం. ప్రతి ఒక్కరినీ అలరించే సినిమా ఇది’ అని దర్శకుడు సత్యరాజ్‌ చెప్పారు.