సెట్ లో మాత్రం హిట్ల‌ర్

Hitler in the setతెలుగు చిత్ర పరిశ్రమలో భానుమతి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె. తన నటనతో ప్రేమక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటరు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో తన పేరు లిఖించుకున్నారు. చారడేసి కండ్లతో వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. విజయ కృష్ణ బ్యానర్‌పై పదిహేను చిత్రాలు నిర్మించిన ఘనత ఆమెకే దక్కింది. ఆమే ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల. ఈ రోజు ఆమె వర్థంతి సందర్భంగా ఆమె సినీ ప్రస్థానం నేటి మానవిలో…
విజయనిర్మల సొంతూరు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట. తల్లి శకుంతల. విజయ నిర్మల బాల్యం అత్యధిక భాగం పాతూరులో గడిచింది. రాజావారి కోటలోని విక్టోరియా హాల్లో చిన్నతనంలో నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. తర్వాత కాలంలో ఆమె తల్లిదండ్రులు చెన్నైలో స్థిరపడ్డారు. ఈమె అసలు పేరు నిర్మల. తనకు సినీరంగంలో కథానాయికగా తొలి అవకాశమిచ్చి, మంచి విజయాన్ని అందించిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకున్నారు. అలాగే అప్పటికే నిర్మల పేరుతో మరో నటి ఉండటంతో కూడా తన పేరును మార్చుకున్నారు.
తొలి చిత్రానికే నంది
1950లో తమిళ చిత్రం మచ్చ రేకై, పాండురంగ మహత్యం వంటి చిత్రాలలో బాలనటిగా సినీ రంగంలోకి ప్రవేశించారు. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్నారు. 1964లో మలయాళ చిత్రం భార్గవి నిలయంలో ప్రధాన పాత్రలో నటించి అతి పెద్ద సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఆ తర్వాత విజయ ప్రొడక్షన్స్‌ నిర్మించిన తమిళ చిత్రంలో నటించారు. రంగులరాట్నం చిత్రంలో మొట్టమొదటిసారిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. అందులో అగ్ర కథానాయికగా నటించారు. తొలి చిత్రానికే నంది అవార్డు అందుకున్నారు. తెలుగులో ఆమె రెండవ చిత్రం సాక్షి. ఆ సినిమాలో కృష్ణ హీరో. ఆ సినిమాలో నటిస్తుండగా ఇద్దరి మధ్య పరిచయం పెరిగి వివాహానికి దారి తీసింది. వీరిద్దరూ కలిసి 47 చిత్రాలలో నటించారు.
కుటుంబ విలువలకే ప్రాధాన్యం
మీనా అనే నవల ఆధారంగా తీసిన ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా అరంగ్రేటం చేశారు. దర్శకత్వంలో ఆమె పనితనం చూసి అందరూ ఆమెను పని రాక్షసి అని పిలిచేవారు. విజయనిర్మల తెలుగులో నలభై చిత్రాలకు దర్శకత్వం వహించగా, మలయాళం, తమిళంలో ఒక్కొక్క చిత్రానికి దర్శకత్వం వహించారు. శివాజీ గణేషన్‌కి దర్శకత్వం వహించిన ఘనత ఆమెకే దక్కింది. ఈవిడ సినిమాలు ఎక్కువగా కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చేవిగా ఉండటమే కాక తెలుగుదనం ఉట్టి పడేలా ఉండేవి. విజయనిర్మల కృష్ణ నటించిన సినిమాలు టక్కరి దొంగ, అక్క చెల్లెలు, మంచి కుటుంబం, మళ్లీ పెళ్లి, పగసాగిస్తా, మోసగాళ్లకు మోసగాడు, దేవదాసు, కురు క్షేత్రం, మూడు పువ్వులు ఆరు కాయలు.
ప్రతి సినిమా ఓ ఆణిముత్యం
అల్లూరి సీతా రామరాజు, దేవదాసు, కురుక్షేత్రం సినిమాలలో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. దేవదాసులో ప్రేమించిన వ్యక్తికి దూరమై, ఇంకొకరికి భార్యై, పిల్లలకు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రియుడు మద్యానికి బానిస అయ్యాడని తెలుసుకుని మానసిక క్షోభకు గురైన పార్వతి పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. పట్నవాసం సినిమాలో గీత పాత్రలో చదువు రాని పల్లెటూరి వాడికి చదువు నేర్పించి, తన దగ్గర మేనేజర్‌గా ఉద్యోగం ఇచ్చి అతన్నే ప్రేమించి పెండ్లి చేసుకోవాలి అనున్నప్పుడు ఆమె చుట్టు ఉన్న బంధువులు సమస్యలు సృష్టించినా వాటికి భయపడక ధైర్యంగా నిలబడి వారిని ప్రశ్నించిన తీరు అందరికీ ఆదర్శం. ఇలా ఆమె ప్రతి సినిమా ఓ ఆణిముత్యం. ఎక్కడా అసభ్యత కనిపించేది కాదు. కుటుంబంతో సహా చూడదగ్గ సినిమాలు తీసిన ఘనత ఆమెది. సినీ రంగంలో మాహిళలును ఎంతగానో ప్రోత్సాహించారు. వెండితెరపైనే కాదు బుల్లి తెర ప్రేక్షకులకు కూడా ఆమె దగ్గరయ్యారు. పెళ్లి కానుక అనే ధారావాహికలో నటించి మెప్పించారు.
గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌
లోకల్‌గా షూటింగ్‌లు జరిగేటపుడు ఈమే స్వయంగా అందరికీ వంట చేసి క్యారెజ్‌లు తీసుకెళ్ళేవారంట. అదే ఔట్‌ డోర్‌ షూటింగ్‌లప్పుడు వంట సామగ్రిని తీసుకు వెళ్లేవారంట. అక్కడ కూడా స్వయంగా వంట చేసి అందరికీ పెట్టేవారు. అందుకే అందరూ ఆమెను అన్నపూర్ణమ్మగా భావించేవారు. అలాగే అసిస్టెంట్‌ డైరెక్టర్లు ఈమెను ప్రేమగా అమ్మ అని పిలిచేవారు. అయితే సెట్‌లో మాత్రం హిట్లర్‌గా ఉండేవారు. 200 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించి, ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయ నిర్మల చరిత్ర సృష్టించారు. ఇందుకు గానూ 2002లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ దక్కించుకున్నారు. 2008లో ప్రతిష్టాత్మకమైన రఘు పతి వెంకయ్య అవార్డ్‌ గెలుచుకున్నారు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి తన 73 ఏండ్ల వయసులో అనారోగ్యంతో జూన్‌ 27వ తేదీ కన్నుమూశారు.
దేవదాసులో ప్రేమించిన వ్యక్తికి దూరమై, ఇంకొకరికి భార్యై, పిల్లలకు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రియుడు మద్యానికి బానిస అయ్యాడని తెలుసుకుని మానసిక క్షోభకు గురైన పార్వతి పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయిందనడంలో అతిశయోక్తి లేదు.
ఆమె ప్రతి సినిమా ఓ ఆణిముత్యం. ఎక్కడా అసభ్యత కనిపించేది కాదు. కుటుంబంతో సహా చూడదగ్గ సినిమాలు తీసిన ఘనత ఆమెది. సినీ రంగంలో మాహిళలును ఎంతగానో ప్రోత్సాహిం చారు. వెండితెరపైనే కాదు బుల్లి తెర ప్రేక్షకులను కూడా ఆమె దగ్గరయ్యారు. పెళ్లి కానుక అనే ధారావాహికలో నటించి మెప్పించారు.
– పాలపర్తి సంధ్యారాణి