కొంతమందికి పుస్తకాలు చదవడమంటే ఇష్టం. మరికొందరు ఫొటోగ్రఫీపై ఆసక్తి చూపుతుంటారు. ఇంకొందరు కొత్త వంటకాలు ప్రయత్నిస్తూ రిలాక్స్ అవుతుంటారు. నిజానికి విటన్నింటినీ మనం కేవలం అభిరు చులుగా, అలవాట్లుగా భావిస్తుంటాం. ఎప్పుడో బోర్ కొట్టినప్పుడు వీటిపై దృష్టి పెడుతుంటాం. ఇవి కేవలం టైంపాస్ కోసమే అనుకుంటాం. కానీ వీటినే కెరీర్‌గా మలుచుకొని కోట్లు సంపాదిస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. మరి మీకూ అలాంటి హాబీ ఏదైనా ఉంటే దాన్నే మీ ఆదాయ వనరుగా మలుచుకోవచ్చు. అదెలాగో చూద్దాం…
పుస్తకాలు చదవడమంటే కొందరికి ఎంత ఇష్టమంటే ఆ ధ్యాసలో పడిపోయి ఈ లోకాన్నే మర్చిపోతుంటారు. అది నవల కానీ, జీవిత కథ కానీ, ప్రేమ కథ కానీ… మొదలుపెట్టారంటే పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. మరి మీరూ ఇలాంటి పుస్తకాల పురుగైతే ఈ అలవాటును మీ కెరీర్‌గా మార్చుకోవడానికి నేడు ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పుస్తకాలు చదివే వారికి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఏ పదం ఎక్కడ వాడాలి? దాని సరైన స్పెల్లింగ్, వ్యాకరణ నియమాలు, పదాలను చక్కగా కూర్చడం… ఇలా ఎన్నో అంశాలతో పాటు రాయడంలోనూ నిష్ణాతులవుతారు. ఇలాంటి వారు వెబ్‌సైట్స్, బ్లాగ్స్, పబ్లిషింగ్ కంపెనీలకు… ఫ్రూఫ్ రీడర్స్‌గా, కాపీ ఎడిటర్స్‌గా పని చేసే అవకాశం సొంతం చేసుకోవచ్చు. అలాగే పుస్తకాలు చదివి వాటిపై మీ అభిప్రాయాలనూ పంచుకున్నా అది కూడా ఉపాధి మార్గమే అని గుర్తు పెట్టుకోండి. లైబ్రేరియన్‌గా, ట్రాన్స్లేటర్లుగా, ఆడియోబుల్ నెరేటర్ (ఆడియో రూపంలో పుస్తకాలు చదివి వినిపించడం)గా… ఇలా మరెన్నో కెరీర్ ఆప్షన్లు పుస్తక ప్రేమికులకు అందుబాటులో ఉన్నాయి.
మొక్కలంటే ప్రాణమా
కొంతమందికి పచ్చటి ప్రకృతి మధ్య గడపడమంటే ఇష్టముంటుంది. ఇదే అభిరుచిని గార్డెనింగ్‌గా మార్చుకొని తమ ఇంటిని నందనవనంగా మార్చేసుకుంటుంటారు. మరి దాన్ని అక్కడితో ఆపకుండా చక్కటి కెరీర్‌గానూ మలచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరే స్వయంగా ఓ గార్డెనింగ్ సర్వీసెస్‌ను ప్రారంభించి ఇళ్లలో, హౌటళ్లలో, పబ్లిక్ పార్కుల్లో మీ క్రియేటివిటీని ప్రదర్శించవచ్చు. అంత పెట్టుబడి పెట్టలేమంటే ముందు కొన్నాళ్ల పాటు మంచి పేరున్న గార్డెనింగ్ సర్వీసెస్ కంపెనీలో పని చేసి ఆ తర్వాత మీ సొంత స్టార్టప్‌ను ప్రారంభించవచ్చు. అయితే ఈ క్రమంలో నానాటికీ గార్డెనింగ్‌లో వచ్చే మార్పులు, గార్డెనింగ్ ట్రెండ్స్ వంటి వాటిపై అవగాహన పెంచుకోవడం ముఖ్యం.
ఫొటోగ్రఫీ ఇష్టమా…
చాలా మంది అమ్మాయిలు ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇలా తమని తాము ఫొటోల్లో బంధించుకోవడం కంటే ఎదుటివారిని, చుట్టూ ఉన్న ప్రకృతిని, వన్యప్రాణుల్ని… తమ కెమెరాతో క్లిక్‌మనిపించడానికి ఆరాటపడేవారు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో మీరూ ఉన్నారా? అయితే ఆ అలవాటునే చక్కటి కెరీర్‌గా మలచుకోవచ్చు. ప్రస్తుతం ఏ అకేషన్ అయినా ఫొటోలు, వీడియోలు తీయించుకోవడం, ప్రత్యేకంగా ఫొటోషూట్ చేయించుకోవడం ఓ ట్రెండ్‌గా మారిపోయింది. క్యాండిడ్ ఫొటోగ్రఫీకీ ఆదరణ పెరిగింది. కాబట్టి దీని ద్వారా బోలెడంత డబ్బూ ఆర్జించవచ్చు. అయితే ఇక్కడ మీరు చేయాల్సిందల్లా అప్డేట్ అయ్యే ఫొటోగ్రఫీ ట్రెండ్స్‌పై పట్టు సాధిం చడమే. ఇక దీంతో పాటు ఫొటో ఎడి టింగ్ సాఫ్ట్వేర్స్, గ్రాఫిక్ సాఫ్ట్వేర్స్, కొత్త గా పుట్టుకొస్తున్న ఏఐ ఫొటో ఎడి టింగ్ టూల్స్‌పై అదనపు నైపుణ్యాలు మెరుగు పరచుకుంటే ఫలితం ఉంటుంది.
వివిధ భాషలు వచ్చా
ఉద్యోగ రీత్యా, మనం ఉండే ప్రాంతంలో ఇమిడిపోవడానికి వివిధ భాషలు నేర్చుకుంటుంటాం. అయితే కొంతమందికి ఇదో అలవాటుగా ఉంటుంది. ఎన్ని భాషలు నేర్చుకున్నా ఇంకా ఇంకా నేర్చుకోవాలనుకుంటుంటారు. కేవలం ప్రాంతీయ, దేశీయ భాషలే కాదు… విదేశీ భాషలపైనా పట్టు సాధించాలనుకుంటారు. ఇలాంటి వారి కోసం ‘ఫారిన్ లాంగ్వేజ్ స్పెషలిస్ట్’, ‘ట్రాన్స్‌లేటర్’… వంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో టూరిస్ట్ గైడ్స్గానూ పని చేయవచ్చు. అదీ కాదంటే మల్టీనేషనల్ కంపెనీల్లోనూ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం ఆ దేశమే వెళ్లాలని లేదు. ఆన్లైన్ ద్వారా కూడా పనిచేయవచ్చు. అలా భాషలతో ఆదాయం పొందవచ్చు.
ప్రయాణాలంటే మక్కువా..?
కొంత మంది విరామం దొరికితే చాలు ఏదో ఒక ప్రదేశానికి వెళ్లిపోతుంటారు. అక్కడి అందమైన ప్రదేశాలను చూస్తూ ప్రపంచాన్నే మర్చిపోతారు. అక్కడితే ఆగిపోకుండా వాటి గురించి బోలెడన్ని విషయాలు తెలుసుకునే దాకా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టరు. ఇక ఇంటికి తిరిగొచ్చాక తాము చూసిన ప్రదేశపు అందాల్ని తమ ఇంట్లో వాళ్లతో, ప్రెండ్స్‌తో పంచుకోవడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఆ విశేషాలు, అక్కడ దిగిన ఫొటోల్ని పోస్ట్ చేస్తుంటారు. మీలో ఉన్న ఈ అభిరుచి ‘ట్రావెల్ అండ్ టూరిజం’ సంస్థల్లో పని చేసే అద్భుతమైన అవకాశాన్ని మీకు అందిస్తుంది. ట్రావెల్ ఏజెంట్‌గా, టూరిజం మేనేజర్‌గా, ట్రావెల్ కన్సల్టెంట్, కౌన్సెలర్‌గా, టూరిస్ట్ గైడ్‌గా పని చేయవచ్చు. కేవలం ప్రైవేటు సంస్థల్లోనే కాదు మీకున్న నైపుణ్యాలతో ప్రభుత్వ టూరిజం శాఖల్లోనూ ఉద్యోగం సంపాదించవచ్చు.
ఇవే కాదు… వీటితో పాటు వంటలు, డ్యాన్సింగ్, సింగింగ్, కళలు మొదలైన అభిరుచులనే తమ కెరీర్‌గా మార్చుకొని రాణిస్తున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. మరోవైపు ఆయా అంశాల్లో ప్రతిభ కనబరుస్తూ డిజిటల్ స్టార్లుగానూ గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను స్ఫూర్తిగా ముందుకు సాగొచ్చు. కెరీర్లో అభివృద్ధి సాధించవచ్చు.