‘స్వగృహ’ వేలం ‘వర్రీ’

'Swagriha' Auction 'Worry'– 17 ఏండ్లుగా పలుమార్లు టెండర్లకు పిలుపు
– ధర భారీగా ఉండటంతో ముందుకు రాని కాంట్రాక్టర్లు
– ఈసారైనా ప్రభుత్వ ప్రయత్నం ఫలించేనా..?
– జిల్లాలో వృధాగా రూ.250 కోట్ల భవనాలు, స్థలాలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు 2007లో అప్పటి ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.కోట్ల విలువచేసే అపార్ట్‌మెంట్‌లను నిర్మించింది. కానీ అవి అప్పటినుంచి వృధాగానే ఉంటున్నాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.వేల కోట్ల విలువ చేసే రాజీవ్‌ స్వగృహ ఇండ్లు, భూములు వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు టెండర్లు పిలిచినా దాఖలుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. రూ.250 కోట్లకు పైగా విలువైన భవనాలు, భూములు వృథాగా ఉండటంతో ప్రభుత్వం వీటిని విక్రయించి సొమ్ము చేసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధాప్రయాసే అవుతోంది.
ఈ సారైనా ముందుకు వచ్చేనా..?
స్వగృహ సముదాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వేలం వేసేందుకు నిర్ణయించినా ధర నిర్ణయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. గతం కన్నా ప్రస్తుత మార్కెట్‌ ధరలు పెరిగిన దృష్ట్యా చదరపు అడుగు ధర రూ.3వేల పైనే ఉండే అవకాశాలు ఉన్నాయి. సుమారు 7,60,104 చదరపు అడుగుల్లో ఇండ్ల సముదాయం విస్తరించి ఉంది. ప్రభుత్వానికి రూ.250 కోట్లకుపైగా ఆదాయం సమకూరనుంది. రెండో దశ నిర్మాణం కోసం కేటాయించిన సుమారు ఏడెకరాల ఖాళీ స్థలాన్ని వేలం వేస్తే అదనంగా రూ. 20-30 కోట్ల ఆదాయం లభిస్తుంది. కానీ టెండర్ల దాఖలు పైనే అనుమానాలు ఉన్నాయి. రాజీవ్‌ స్వగృహ ఇండ్ల సముదాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పలుమార్లు యత్నించినా విఫలమైంది. 2022 మార్చి 24 నాటికి దీన్ని వేలం వేసేందుకు జలజ టౌన్‌షిప్‌ పేరు మార్చి జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. చదరపు గజానికి రూ.1500 నుంచి రూ.2వేలు ధర నిర్ణయించి వేలం నిర్వహించగా ఎవరూ ముందుకు రాలేదు. ఇండ్ల వారీగా కాకుండా బ్లాకుల వారీగా విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ఆ తర్వాత 2023లో మరోసారి విక్రయించేందుకు వేలం నిర్వహించాలనుకుంది. కానీ ఆ నిర్ణయాన్నీ ఉపసంహరించుకుంది.
ధర సగానికి సగం తగ్గిస్తేనే ఆసక్తి..
ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లి పంచాయతీ పరిధిలో 576 రాజీవ్‌ స్వగృహ ఇండ్ల సముదాయంలో భాగంగా 9.23 ఎకరాల సువిశాల ప్రాంగణంలో తొమ్మిది ఫ్లోర్లు, ఎనిమిది బ్లాకులుగా నిర్మాణ పనులు చేపట్టింది. ఎనిమిది బ్లాకుల్లో 288 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, మరో 288 మూడు పడక గదుల ఇండ్ల నిర్మాణం చేపట్టింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం 2009లో పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం దాదాపు రూ.60 కోట్లు వెచ్చించినా ఫలితం లేకుండా పోయింది. సేకరించిన డిపాజిట్లను తిరిగి చెల్లించాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రాజీస్‌ స్వగృహ ఇండ్ల సముదాయాలను సద్వినియోగం చేసుకోలేకపోగా.. రూ.వేలకోట్ల విలువైన ఆస్తులు వృధాగా ఉండటం ప్రభుత్వానికి భారంగా మారింది. రోజురోజుకు నిర్మాణాలు పాతబడటం, వాటి నిర్వహణ కూడా లేకపోవడంతో దెబ్బతింటున్నాయి. కాబట్టి వాటిని ఏదో ఒక రకంగా విక్రయించాలనే ప్రభుత్వ ప్రయత్నం మంచిదే కానీ ధర అధికంగా ఉందనే భావన కాంట్రాక్టర్లలో ఉండటంతో పలుమార్లు వేలానికి పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవనాల్లో చదరపు గజం రూ. 3000 కాకుండా రూ.1500 లోపు ఉంటే వేలం ప్రక్రియ కొంతమందికి ఉపయోగపడే అవకాశం ఉందని స్థానిక రియల్టర్ల అభిప్రాయం.