– ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
– హోంగార్డ్ అధికారులతో దర్బార్
నవతెలంగాణ-ఆసిఫాబాద్
పోలీసుల సమస్యలు పరిష్కరించడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని హెడ్ క్వార్టర్‌లో హోంగార్డ్ అధికారులతో దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంలో తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని తెలిపారు. కానిస్టేబుల్‌లతో సమానంగా హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. వివిధ రకాల బందోబస్తులలో వీరి కృషి ఎంతో ఉందన్నారు. సంవత్సరానికి 12 వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసులకు ఇస్తున్న ఆరోగ్య భద్రత పథకం వలె హోంగార్డులకు కూడా ప్రయివేట్ సంస్థతో మాట్లాడి భద్రత పథకం కల్పించాలని అధికారులకు సూచించారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ రాణా ప్రతాప్, ఆర్‌ఐ అడ్మిన్ పెద్దన్న, ఆర్‌ఐ ఎంటీఓ అంజన్న, ఆర్‌ఐ హోంగార్డ్ ఇన్‌చార్జి భరత్ భూషణ్, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.