గృహ రుణాల దిగ్గజ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం

ముంబయి : గృహ రుణాల దిగ్గజ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి జులై 1 నుంచి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో విలీనం కానుంది. ఈ విషయాన్ని మంగళవారం హెచ్‌డిఎఫ్‌సి ఛైర్మన్‌ దీపక్‌ పరేక్‌ వెల్లడించారు. వీటి విలీనానికి జూన్‌ 30న ఇరు సంస్థల బోర్డులు సమావేశం కానున్నా యని తెలిపారు. కాగా.. జులై 13న స్టాక్‌ మార్కెట్‌లో డీలిస్టింగ్‌ కానున్నా యని హెచ్‌డిఎఫ్‌సి వైస్‌ ఛైర్మెన్‌, సిఇఒ కెకె మిస్త్రీ వెల్లడించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో హెచ్‌డిఎఫ్‌సి విలీనానికి గతేడాది ఏప్రిల్‌ 4న సూత్రప్రాయ ఆమోదం లభించింది. అనంతరం ఈ విలీనానికి సెబీ, సిసిఐ, ఆర్‌బిఐ తదితర రెగ్యూలేటరీ సంస్థలు అంగీకారం తెలిపాయి. విలీన విలువ 40 బిలియన్‌ డాలర్లతో భారత కార్పొరేట్‌ చరిత్రలోనే రికార్డ్‌గా నమోదయ్యింది. విలీన అనంతరం ఇరు సంస్థల ఆస్తుల విలువ రూ.18 లక్షల కోట్లకు చేరనుంది. విలీనం అనంతరం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో హెచ్‌డిఎఫ్‌సికి 41 శాతం వాటా ఉంటుంది.