– గుడిసెవాసులపై నిర్భంధం తగదు: సీఐటీయూ, రైతు సంఘం నేతల డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానం ప్రకారం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు అందించాలనీ, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలిచ్చి, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న వారిని నిర్బంధంతో ఖాళీ చేయించాలి అనుకోవడం అవివేకమనీ, ఆ పని చేయలేరని అన్నారు. పోలీసు నిర్బంధాన్ని ప్రయోగిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గుడిసెవాసులను పరామర్శించడానికి వెళ్లిన బస్సు యాత్ర నాయకులను పోలీసులు నిర్బంధించడం, బస్సు డ్రైవర్‌ని కొట్టడం వంటి చర్యలను నిరసిస్తూ హైదరాబాద్ సుందరయ్య పార్క్ వద్ద తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిని వదిలేసి, నిలువ నీడ కోసం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలపై పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగించడం ఆందోళనకరమన్నారు. జీవో నెంబర్ 58 ప్రకారం ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారందరికీ పట్టాలు ఇస్తామని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, అందుకు భిన్నంగా గుడిసె వాసులను ఖాళీ చేయించడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలిచ్చి ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదున్నర లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ రమ, సహాయ కార్యదర్శి శ్రీకాంత్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, బొప్పని పద్మ, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, సిఐటియు రాష్ట్ర నాయకులు పాలడుగు సుధాకర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రాగిరి ఆంజనేయులు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.