– ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షలు ఇవ్వాలి
– పేదలకు జాగా ఇవ్వరు.. కార్పొరేట్లకు వేల ఎకరాలా..?
– ఎర్రజెండా పోరాట ఫలితమే ఖమ్మం చుట్టుపక్కల నగర్‌లు
– ధర్నాలో రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని, నాయకులు నున్నా
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పోరాడితేనే ఇండ్లు, స్థలాలు వస్తాయని రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, నాయకులు నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఎర్రజెండాల పోరాట ఫలితంగానే ఖమ్మం చుట్టుపక్కల కొత్త నగర్‌లు ఏర్పాటయ్యాయన్నారు. 2022 నాటికి దేశంలో ఇల్లు లేని పేదలు లేకుండా చేస్తామన్న కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఇల్లు కట్టించింది లేదన్నారు. సీపీఐ(ఎం), ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు రాష్ట్రం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2006లో పెద్ద పోరాటం చేసిన ఫలితంగానే ఇక్కడ ఇండ్ల స్థలాలు వచ్చాయన్నారు. ఇండ్లు లేని వారికి స్థలాలు ఇవ్వాలంటూ ఎనిమిది రోజులపాటు పోరాడిన ఫలితంగానే సర్వే చేసి 6800 మందిని అర్హులుగా నిర్ధారించినట్టు తెలిపారు. ఆందోళనలు, జిల్లా దిగ్బంధం తదితర కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఫలితంగానే వీరిలో కొంతమందికి ఇండ్ల స్థలాలు లభించాయని చెప్పారు.
ఖమ్మంలోని వైయస్సార్ నగర్, కేసీఆర్ నగర్, ఉదరు కుమార్ నగర్, రమణ గుట్ట, వికలాంగుల కాలనీ.. ఇలా ఎన్నో నగర్‌లు ఎర్రజెండాల పోరాట ఫలితంగా ఆవిర్భవించాయని చెప్పారు. కార్పొరేట్లు పదెకరాలు అడిగితే 15 ఎకరాలు ఇస్తున్న ప్రభుత్వాలు.. నిరుపేదలకు 125 గజాల ఇండ్ల స్థలం ఇవ్వడానికి వెనకాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏండ్లలో ఎనిమిది వేల మందికి డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం 2000 మందికి మాత్రమే ఇచ్చిందన్నారు. గృహ లక్ష్మీ పథకం కింద సొంత స్థలం ఉన్న వారికి రూ. ఐదు లక్షల చొప్పున ఇస్తామని రూ.3 లక్షలకు కుదించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దానిని యథావిధిగా రూ.5 లక్షలుకు పెంచాలని, కేంద్ర ప్రభుత్వం మరో రూ.10 లక్షలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్లు, లైట్లు అభివృద్ధిలో భాగం కావచ్చు కానీ ప్రతి మనిషి కనీస అవసరాలు తీర్చితేనే నిజమైన అభివృద్ధి అన్నారు. అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.2వేల పెన్షన్‌ను రూ.3వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 57 సంవత్సరాలు నిండిన వారికి వెంటనే పెన్షన్ ఇవ్వాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దారు శైలజకు ధర్నా వేదిక వద్ద అందజేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండ్ల స్థలాలు : తహసీల్దారు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ఖమ్మం అర్బన్ తహసీల్దారు శైలజ హామీ ఇచ్చారు. ధర్నాస్థలి వద్దకు వచ్చి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం సైట్ క్లోజ్ అయి ఉందని, మీ సేవలో అప్లై చేసుకుంటే సైట్ ఓపెన్ అయ్యాక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల అంశం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నివసిస్తున్న పేదలకు 58 జీవో కింద క్రమబద్ధీకరిస్తూ పట్టాలు జారీ చేశామని తెలిపారు. 2014 జూన్‌లోపు నివసిస్తున్న వారికి మొదట్లో పట్టాలిచ్చామని, 2020 వరకు ఇవ్వాలని దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని పైఅధికారులకు పంపుతామన్నారు.
సీఐటీయూ రాష్ట్ర నాయకులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాది నేని రమేష్, బొంతు రాంబాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వై.విక్రమ్, నాయకులు యర్రా శ్రీనివాస్, నవీన్ రెడ్డి, మేకల సంగయ్య, రమ్య, భూక్యా శ్రీనివాస్, ఎంఏ జబ్బార్, బోడపట్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.