అణుశక్తి రంగానికి పునాదులు వేసిన హోమి.జె.బాబా

Homi.J.Baba laid the foundations of nuclear powerఅణుశక్తి రంగంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాల మధ్య తలెత్తుకుని నిలబడేట్లు చేసింది డాక్టర్‌ హోమి జహంగీర్‌ బాబా. ఆయన రూపకల్పన చేసిన పథకాల ఫలితంగానే ఈరోజు దేశంలో పలు అణురియాక్టర్లు విస్తరిం చాయి. పలు పరిశోధనలకు అవకాశం ఏర్పడింది.1948లో ఆటమిక్‌ ఎనర్జీ కమిషన్‌కు మొట్టమొదటి ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ బాబా, దాని సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషిచేశాడు. ఆనాటి ప్రధానులు పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి హయాంలలో భారత ప్రభుత్వానికి శాస్త్రసాంకేతిక రంగాలకు సంబంధించి సలహాదారుగా ఉన్నాడు. దేశంలో ఆటమిక్‌ ఎనర్జీ ప్రోగ్రాంకు పునాదులు వేసి, పెంచిపోషించాడు. డా. హోమి.జె.బాబా ఎంతటి వైజ్ఞానికుడో అంతటి కార్యనిర్వహణాధికారి. అందువల్లనే 1956లో ‘అప్పర’ను ప్రారంభించ గలిగాడు. ముంబాయి ట్రాంబేలో ప్రారంభమైన ఈ ఆణురియాక్టర్‌, ఆసియాలోనే మొట్టమొదటిదిగా అయ్యింది. ఈయన సలహా సంప్రదింపులపైనే, సర్కస్‌, జర్లినా అనే రెండు నూక్లియర్‌ రియాక్టర్లు కూడా ఆ రోజుల్లోనే ప్రారంభమయ్యాయి.
డాక్టర్‌ హోమి జహంగీర్‌ బాబా 1909 అక్టోబర్‌ 30న ముంబాయిలో ఒక సంపన్న పార్సీ కుటుంబంలో జన్మించాడు. బాల్యం బొంబాయిలోనే గడిపాడు. అక్కడే చదువుకున్నాడు. నలభై అయిదేళ్ల తర్వాత అతను అక్కడే బొంబాయిలో ఒక అణుశక్తి కేంద్రాన్ని స్థాపిస్తాడని ఎవరూ ఊహించలేదు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు సైన్స్‌కు సంబంధించిన ఎన్నో పుస్తకాలు చదివేవాడు. క్లాసులోని పాఠాలకు పరిమితమై పోయేవాడు కాదు. కవిత్వమన్నా, చిత్రలేఖనమన్నా, పాశ్చాత్య సంగీతమన్నా ఎంతో ఇష్టపడేవాడు. సజనాత్మకశక్తికి పరిధులుండవు. అడ్డుగోడలుండవు. మనిషిలో ఒక విశాల భావం రూపుదిద్దుక డానికి సహజంగా కళలు ఎంతగానో దోహదపడతాయన్న విషయం ఎన్నోసార్లు రుజువైంది. అందుకే హోమి. జె.బాబాలోని చిత్రకారుడు, సాహిత్యాభిమాని జీవితాంతం సజీవంగానే ఉన్నారు.
అంచెలంచెలుగా ఎదిగి జహంగీర్‌ బాబా బొంబాయిలోని ఎల్ఫిన్‌ స్టోన్‌ కాలేజిలో చేరాడు. ఆ తర్వాత అక్కడి రాయల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో చేరాడు. పట్టా పుచ్చుకుని, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించాడు. అతనికైతే స్వతహాగా భౌతికశాస్త్రమంటే మక్కువ. కానీ, కొడుకు ఇంజనీర్‌ కావాలన్నది డా.బాబా తండ్రి కోరిక. కొడుక్కి తండ్రి కోరిక తీర్చక తప్పలేదు. ఉన్నతవిద్య కోసం కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లాడు హోమి. అక్కడినుంచి 1930లో ఇంజ నీరింగు పట్టా తీసుకున్నాడు. కేవలం తండ్రి కోరిక తీర్చడానికే మాత్రమే- ఇంజనీరయితే- డా.బాబా స్వదేశానికి తిరిగి వచ్చి, ఒక సాధారణ ఇంజనీయర్‌గా స్థిరపడి పోయేవాడు. కానీ, అతనిలోని జ్ఞానపిపాస తీరలేదు. భౌతిక శాస్త్రంపై ఉన్న అభిరుచి తగ్గలేదు. సరికదా- రెండు మూడు రెట్లు ఇనుమడించింది. అందుకే మరో నాలుగేండ్లు అక్కడే ఉండి, ప్రపంచ ప్రసిద్ధులైన శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశాడు 1934లో పి.హెచ్‌.డి పట్టా పొందాడు.
నీల్స్‌బోర్‌, ఫెర్మీ, పౌలి, వంటి వారితో కలిసి పనిచేసిన అనుభవం వధాపోలేదు. ఆ తర్వాత తన తర్వాతి తరం భారతీయ శాస్త్రవేత్తల్ని ప్రభావితం చేయగలిగారు. డాక్టరేట్‌ సాధించిన తరువాత కూడా 1937లో వాల్టర్‌ హెట్లర్‌తో కలిసి జగత్సంబంధమైన సూర్యకిరణాలపై విశేషమైన పరిశోధనలు చేశాడు. వాటివల్ల ఆయనకు అంత ర్జాతీయ పరిశోధనా రంగంలో మంచి గుర్తింపు లభించింది. వీజుూఉచీూ అనే ప్రాథమిక అణువుల్ని కనుగొన్నవాడిగా వైజ్ఞానిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
1940లో హోమి.జె.బాబా స్వదేశం తిరిగివచ్చాడు. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ – భౌతికశాస్త్ర విభాగంలో రీడర్‌గా చేరాడు. తర్వాత ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాడు. అప్పటినుండే ఆయన పథకాలు, కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్వదేశం తిరిగొచ్చిన ఐదేండ్లలోనే టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ 1945లో స్థాపించాడు. దానికి పౌండర్‌ డైరెక్టర్‌ అయ్యాడు. శాస్త్ర వైజ్ఞానిక రంగంలో ఆయన ప్రభావం ఎంతగా ఉండేదంటే, ఆయన ఇచ్చిన ప్లాన్‌కు భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, ఎప్పుడూ అడ్డుచెప్పేవాడు కాదు. వారిద్దరికీ ఒకరి మీద ఒకరికి అచంచలమైన విశ్వాసం ఉండేది. అందుకే గాఢమైన స్నేహితులయ్యారు. అసలు వైజ్ఞానికులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించి, వారి సామర్థ్యాన్ని దేశానికి ఉపయోగించడంలో నెహ్రూను మించిన ప్రధాని మనకు మరొకరు లేరు-అంటే అతిశయోక్తి కాదు. ఆయన దార్శనికుడు కాబట్టే త్వరితగతిన భారత దేశం ప్రపంచస్థాయి పరిశోధనాశాలలు నెలకొల్పుకోగలిగింది. అందువల్ల నూతన సంస్థల రూపకల్పనలో డా. హోమి జె.బాబాకు ప్రభుత్వపరంగా ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాలేదు. డా.బాబాకే కాదు, నాటి శాస్త్రవేత్తలకు ఎవరికీ ఏ ఇబ్బంది కలగలేదు. కారణం దేశ నిర్మాత నెహ్రూ ప్రధానిగా ఉండటం!
డాక్టర్‌ హోమి జె.బాబా దేశంలో అణుశక్తి రంగాన్ని ఎంతగా అబివృద్ధి పరిచాడో, దాన్ని శాంతి పూరితమైన ప్రయోజనాలకు మాత్రమే వాడాలని అంతగా తపన పడ్డాడు. ఆ ఆలోచనకు అంతర్జాతీయంగా ప్రాచుర్యాన్ని సాధిం చాడు. 1955లో జెనీవాలో జరిగిన మొట్టమొదటి ఆటమిక్‌ ఎనర్జీ కమిషన్‌- యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌కు ఛైర్మన్‌ అయ్యాడు. ఆటంబాంబుల్ని అన్నిదేశాలూ బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. వినాశానికి దారితీసే పనులేవీ అణు శక్తితో చేయగూడదనీ- ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఏకాభిప్రాయానికి రావాలనీ- ఆయన పట్టుబట్టాడు. ఒక శక్తిని సృష్టించడం మానవుడి చేతిలో ఉంది. దాన్ని అదుపులో ఉంచుకోగల మనోనిగ్రహం కూడా మనిషికే ఉండాలని వాంఛించాడు డా. హౌమిబాబా. ఆయన దూరదృష్టి గొప్పది!
మన దేశంలో తారాపూర్లో మొట్ట మొదటి ఆటమిక్‌ పవర్‌ స్టేషన్‌ నెలకొల్పిందీ, రెండేళ్ల తర్వాత రాజస్థాన్‌లో పోఖ్రాన్‌ ప్లుటో నియం ప్లాంట్‌ నెలకొల్పింది డా. హోమీ బాబా నేతృత్వంలోనే- ఆ విధంగా దేశంలో 1974 మే18న నూక్లియర్‌ డివైస్‌, పని ప్రారంభించింది. ఇంతలో జరగరాని సంఘటన ఒకటి జరిగింది. వైజ్ఞానికరంగం స్థబ్దతలో కూరుకుపోయింది.1966 జనవరి 24న ఒక అంతర్జాతీయ సదస్సుకు వెళ్తూ 56వ యేటా విమాన ప్రమాదంలో డా. బాబా ఫ్రాన్స్‌- మోంట్‌ బ్లాంక్‌ మాసిఫ్‌లో మరణించారు. ఎయిర్‌ ఇండియా విమానం 101 క్రాష్‌ కావడంతో ఆ ప్రమాదం జరిగింది. దేశం ఒక గొప్ప మనిషిని, జాతి రత్నాన్ని కోల్పోయిందని నాటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ప్రకటించారు. అంచెలంచలుగా దేశం వైజ్ఞానికంగా ఎదుగుతున్న దశలో హోమి.జె.బాబాను దేశం కోల్పో వడం అతిపెద్ద విషాదమనీ, ఆలోటును ఎవరూ పూడ్చలేరని, ప్రధానికి వైజ్ఞానిక సలహాదారుగా ఉన్న డా. హోమి బాబా మరణం, వ్యక్తిగతంగా తనకు పెద్దదెబ్బ అనీ-శ్రీమతి ఇందిరా గాంధీ తన సంతాప సందేశంలో ప్రకటించారు. వివిధ రంగాల్లో ఆయన చేస్తూ వచ్చిన కృషిని బేరీజు వేసుకోవడానికి, ఆయన వదిలి వెళ్లిన పనులు పూర్తి చేయడానికి ఎంతో నిపుణత, ఎంతో మనో ధైర్యం అవసరమౌతుంది- అని ఆమె అన్నారు. డా.బాబా మరణానంతరం, ఆయన జ్ఞాప కార్ధం ఆయన నెలకొల్పిన సంస్థలన్నింటికీ ఆయన పేరు పెట్టారు. ట్రాంబేలోని ఆటమిక్‌ ఎనర్జీ ఇనిస్టిట్యూట్‌ బాబా ఆటమిక్‌ రీసెర్చ్‌గా- బాబా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌గా మారింది. ఆయన ఆటమిక్‌ ఎనర్జీ కమిషన్‌కు ఛైర్మన్‌ కావడమే కాదు, ‘పీస్‌ఫుల్‌ యూసెస్‌ ఆఫ్‌ ఆటమిక్‌ పవర్‌ కమిషన్‌’-కు కూడా ఛైర్మన్‌ కావడం విశేషం!
జీవితాంతం బ్రహ్మచారిగా గడిపిన డాక్టర్‌ హోమి జహంగీర్‌ బాబా ఒక స్వాప్నికుడు. ఒక స్ఫురద్రూపి, ఒక మృదుభాషి, ఒక వైజ్ఞానికుడు, ఒక కార్యశీలి, ఒక వక్త, అంతర్భాతీయ అవగాహన గల దేశభక్తుడు! డబ్బుకు, తక్కువ స్థాయి ప్రాచుర్యానికి ఆయన ఎప్పుడూ విలువనివ్వలేదు కేంద్ర ప్రభుత్వం కేబినెట్‌లోకి ఆహ్వానిస్తే, మర్యాదగా తిరస్క రించాడు. ప్రధానమంత్రికి వైజ్ఞానిక శాస్త్ర సలహాదారుగానే ఉంటానన్నాడు. ఎందుకంటే ఆయనేమిటో ఆయనకు తెలుసు. ఆయన విలువ ఆయనకు తెలుసు. ఆయనకు సంతప్తినిచ్చే రంగమేదో ఆయనకు తెలుసు. ఈ దేశానికి తను ఏ రకంగా ఉపయోగపడగలడో, ఏ రకంగా సేవ చేయగలడో ఆరకంగానే చేశాడు. తను ఇమడని రంగంలో పొరపాటున కూడా ప్రవేశించలేదు.
కె.ఎస్‌. కష్ణన్‌, సత్యేంద్రబోస్‌, మేఘానంద్‌ సాహా, బీర్బల్‌ సహాని, విక్రమ్‌ సారాబాయి, ఎస్‌.కె.మిత్ర, మొదలైన భారతీయ శాస్త్రవేత్తల స్థాయికి ఎదిగిన హోమి జహంగీర్‌ బాబాను దేశం ఎప్పుడూ మరువలేదు. ఆయన అంతరంగం లోని చిత్రకారుడు జీవితాంతం సజీవంగా ఉన్నట్టుగానే- ఈ చిత్రకారుడిలోని వైజ్ఞానికుడూ సజీవంగానే ఉన్నాడు. అందుకే మన దేశపటం మీద శక్తివంతమైన అణుశక్తి కేంద్రాల్ని చిత్రించగలిగాడు. ఆడమ్స్‌ ప్రైయిట్‌ (1942) విజేత, రాయల్‌ సొసయిటీకి ఎన్నికైన సభ్యుడు, మన పద్మ భూషణుడు (1954) డాక్టర్‌ హోమి జహంగీర్‌ బాబా. ”ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ న్యూక్లియర్‌ ప్రోగ్రాం”గా గుర్తుంటాడు.
ఈ వ్యాసరచయిత వైజ్ఞానిక సలహాదారుగా, సిద్ధార్థ నిర్వహణలో డాక్టర్‌ హోమి జె బాబా-డాక్టర్‌ విక్రమ్‌ సారాబాయి సైంటిఫిక్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, హైదరాబాదు, ఎ.ఎస్‌.రావు నగర్‌లో 2024 నుండి చురుకుగా పని చేస్తూ ఉంది. మహనీయులైన ఆ మహాశాస్త్రవేత్తల స్ఫూర్తిని యువతరానికి అందిస్తూ ఉంది.
– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
డాక్టర్‌ దేవరాజు మహారాజు