ఆశలు..అవిరీ…?

– బేగంపేటలో నెలమట్టమైన డబుల్ ఇండ్ల శిలాఫలకం
– బీఆర్ఎస్ నాయకుల తీరుపై నిరుపేదల అసహనం
-ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేయించారని ఆరోపణలు
నవతెలంగాణ – బెజ్జంకి
కల చెదిరిందీ.. కథ మారిందీ కన్నీరే ఇక మిగిలిందీ..  కన్నీరే ఇక మిగిలిందీ.. అని ఆరుద్ర రాసిన పాటకు దర్పణం పడుతొంది బేగంపేట గ్రామంలోని డబుల్ ఇండ్ల నిర్మాణ దుస్థితి. ఆర్హులైన నిరుపేదలకు డబుల్ ఇండ్ల నిర్మాణం చేపట్టి అందిస్తామనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హామితో ఎన్ని ఎండ్లైనా తమ స్వప్నం నెరవేరుతుందని ఎదురుచూసిన బేగంపేట గ్రామంలోని పలువురు నిరుపేదల ఆశలు అవిరయ్యాయి.డబుల్ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శంకుస్థాపన చేసిన శిలాఫలకం నెలమట్టమైంది. దీంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులే ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం డబుల్ ఇండ్ల నిర్మాణాలను అడ్డుకుంటున్నారని గ్రామంలోని పలువురు నిరుపేదలు ఆరోపిస్తున్నారు.పేదలపక్షపాతిగా పేరు సంపాదించుకున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను స్థానిక బీఆర్ఎస్ నాయకులు దప్పుదోవ పట్టిస్తూ ప్రజల్లో అయనకు చెడ్డ పేరు తీసుకువచ్చేలా ప్రణాళిక ప్రకారమే ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన శిలఫలకాన్ని నేలమట్టం చెయించారని.. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై అధికారులు విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
టెండర్ పూర్తయిన..నిర్మాణంలో అలసత్వం..
బేగంపేట గ్రామంలో సుమారు 25 డబుల్ ఇండ్ల నిర్మాణానికి 2018 ఏప్రిల్ 17న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.శంకుస్థాపన చేసిన అనంతరం ఇండ్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిన సంబంధిత గుత్తేదారు అలసత్వం వహించడం వల్ల డబుల్ ఇండ్ల నిర్మాణ దశ అటకెక్కింది.దీంతో గ్రామంలో పలువురు నిరుపేదల స్వప్నం కలగానే మిగిలిపోయింది.ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించి శంకుస్థాపన చేశారనే ఆశతో ఇన్నాళ్లు ఎదురుచాశామని..ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన శిలఫలకం నెలమట్టమవ్వడంతో ఆశలు అడిఆశలయ్యాయని నిరపేదలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
శిలఫలకానికే పరిమితమైన ఇండ్ల నిర్మాణాలు..
మండల కేంద్రంతో పాటు చీలాపూర్,తోటపల్లి,బేగంపేట, కల్లేపల్లి,దాచారం,గుగ్గీల్ల గ్రామాల్లో డబుల్ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.మండల కేంద్రమైన బెజ్జంకి, చీలాపూర్,తోటపల్లి గ్రామాల్లో డబుల్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకందజేశారు.కల్లేపల్లి,బేగంపేట,దాచారం గ్రామాల్లో డబుల్ ఇండ్ల నిర్మాణాలు శిలపలకాలకే పరిమితమైయ్యాయి.గుగ్గీల్లలో డబుల్ ఇండ్ల నిర్మాణ పనులు పిల్లర్ల దశకే పరిమితమైయి ఆర్థాంతరంగా నిలిచిపోయాయి. బేగంపేట,కల్లేపల్లి,దాచారం,గుగ్గీల్ల గ్రామాల్లో డబుల్ ఇండ్ల నిర్మాణాలపై నిలినీడలు కమ్ముకున్నాయని..ఇప్పటికైనా అయా గ్రామాల్లో శిలఫలకాలకే పరిమితమైన ఇండ్ల నిర్మాణాలతో పాటు గుగ్గీల్లలో ఆర్థాంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేసి నిరుపేదల సొంతింటి ఇల్లు స్వప్నాన్ని నెరవేర్చాలని ప్రజాప్రతినిధులను ప్రాదేయపడుతున్నారు.