– జైస్వాల్ అర్ధసెంచరీ
– ఇండియా 219/7
– ఇంగ్లండ్‌తో నాల్గోటెస్ట్
రాంచీ : ఓపెనర్ యశస్వి జైస్వాల్(73) అర్ధ సెంచరీకి తోడు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(30నాటౌట్), కుల్దీప్ యాదవ్(17నాటౌట్) అద్భుత పోరాటంతో టీమిండియా రెండోరోజు ఆట నిలిచే సమయానికి 7వికెట్లు నష్టపోయి 219పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 134 పరుగులు వెనకబడి ఉంది. ఇంగ్లండ్ యువ స్పిన్నర్లు షోయబ్ బషీర్ నాలుగు, టామ్ హర్ట్లే రెండు వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించారు. ఓవర్‌నైట్ స్కోర్ 7వికెట్ల నష్టానికి 302పరుగులతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 51పరుగులు జతచేసి చివరి మూడు వికెట్లను కోల్పోయింది. చివరి మూడు వికెట్లను ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేజిక్కించుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్(122 నాటౌట్) అజేయంగా క్రీజ్‌లో నిలిచాడు. జడేజాకు నాలుగు, ఆకాశ్ దీప్‌కు మూడు, సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసిన భారత్‌కు ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ(2)ను ఆండర్సన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత యశస్వీ(73), శుభ్‌మన్ గిల్(38) ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ నిర్మించారు. వీరిద్దరూ 2వ వికెట్‌కు 82పరుగులు జతచేశారు. ఆ తర్వాత బషీర్ సూపర్ డెలివరీతో గిల్‌ను ఔట్ చేశాడు. రజత్ పాటిదార్(17), రవీంద్ర జడేజా(12)లనూ బషీర్ పెవీలియన్‌కు చేర్చడంతో 130పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సెంచరీ దిశగా దూసుకెళ్తున్న జైస్వాల్‌ను బౌల్డ్ చేసిన బషీర్ భారత్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. సర్ఫరాజ్ ఖాన్(14), రవిచంద్రన్ అశ్విన్(1)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. దాంతో టీమిండియా 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ ధృవ్ జురెల్, కుల్దీప్‌లు పట్టుదలగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఎనిమిదో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లు బషీర్‌కు నాలుగు, హార్డ్‌లీకి రెండు, ఆండర్సన్‌కు ఒక వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు…
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ : 353ఆలౌట్
ఇండియా తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి)బషీర్ 73, రోహిత్ (సి)ఫోక్స్ (బి)ఆండర్సన్ 2, శుభ్‌మన్ (ఎల్‌బి)బషీర్ 38, పటీధర్ (ఎల్‌బి)బషీర్ 17, జడేజా (సి)పోప్ (బి)బషీర్ 12, సర్ఫరాజ్ (సి)రూట్ (బి)హార్ట్‌లీ 14, జురెల్ (బ్యాటింగ్) 30, అశ్విన్ (ఎల్‌బి)హార్ట్‌లీ 1, కుల్దీప్ (బ్యాటింగ్) 17, అదనం 15. (73ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 219పరుగులు.
వికెట్ల పతనం: 1/4, 2/86, 3/112, 4/130, 5/161, 6/171, 7/177
బౌలింగ్ : ఆండర్సన్ 12-4-36-1, రాబిన్సన్ 9-0-39-0, బషీర్ 32-4-84-4,హార్ట్‌లీ 19-5-47-2, రూట్ 1-0-1-0.