– ఎన్నికల విధుల్లో కష్టపడ్డ మహిళలు
– బీఎల్‌ఓలుగా డ్యూటీ చేసినా దక్కని రెమ్యూనరేషన్
– పోలింగ్ కేంద్రాల్లో హెల్త్‌క్యాంపుల ఏర్పాటు
– పొద్దస్తం విధుల్లో ఉన్న ఆశాలు, అంగన్వాడీలు, ఆర్పీలు
– రెమ్యూనరేషన్ పెంచాలన్న టీచర్లపై లాఠీఛార్జి
– ఆశాలు, అంగన్వాడీలకూ రెమ్యూనరేషన్ చెల్లించాలి: సీఐటీయూ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగడంలో అంగన్వాడీలు, ఆశాలు, ఆర్పీల పాత్ర ఎంతో కీలకమైంది. ఓటర్ల జాబితాలు, ఓటరు నమోదు, తొలగింపు, తప్పుల సవరణ, ఓటరు స్లిప్స్ పంపిణీ, పోలింగ్ శాతం పెంపునకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాదు, గ్రామ, బూత్ స్థాయిలో ఎన్నికల విధులన్నీ వీళ్లే చూశారు. చివరికి మే 13న పోలింగ్ రోజున కూడా ఆశాలు, అంగన్వాడీలు, ఆర్పీలకు బీఎల్‌ఓ డ్యూటీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఓటర్లకు అవసరమైన వైద్య సహాయం అందించారు. పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మే 13న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని సర్క్యూలర్ జారీ చేసింది. అదే విధంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న వాళ్లందరికీ కూడా వేతనంతో పాటు రెమ్యూనరేషన్, టీఎ, డీఎ చెల్లించారు. అందరి కంటే ఎక్కువ రోజులు కష్టపడిన ఆశాలు, అంగన్వాడీలు, ఆర్పీలకు మాత్రం రెమ్యూనరేషన్ ఇవ్వకుండా వివక్ష చూపారు.
బీఎల్‌ఓ, హెల్త్ క్యాంపు డ్యూటీలు
పార్లమెంట్ ఎన్నికల విధుల్లో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. వారితో పాటు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఆర్పీలకు కూడా ఎన్నికల డ్యూటీ వేశారు. మే 13న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఆశాలు, అంగన్వాడీలు, ఆర్పీలు బీఎల్‌ఓలు, హెల్త్ క్యాంపు డ్యూటీలు చేశారు. పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి ఈవీఎంలను తరలించే వరకు ఎన్నికల విధుల్లోనే ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆశాలు, అంగన్వాడీలు, ఆర్పీలు 6200 మంది వరకు మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన 4097 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో 30 వేల మంది ఆశా వర్కర్లు, 33,843 మంది అంగన్వాడీలు, పది వేల మంది ఆర్పీలు ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన మాదిరిగానే ఆశాలు, అంగన్వాడీ, ఆర్పీలకు కూడా ఎన్నికల రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా చెల్లించలేదు. పని విషయంలో మాత్రం అందరి కంటే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలతోనే ఎక్కువ చేయించారు. ఎన్నికల పనిలో ఎక్కువ రోజులో ఆశాలు, అంగన్వాడీలే ఉన్నారు. అయినా వాళ్లకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ అందలేదు.
రెమ్యూనరేషన్ చెల్లింపులో వివక్ష
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది, అధికారులకు రెమ్యూనరేషన్ చెల్లించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్ని రోజులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారో ఎంత దూరం వెళ్లి డ్యూటీ చేశారో దాన్ని బట్టి టీఎ, డీఎ చెల్లించారు. అందరు ఉద్యోగుల మాదిరే రాష్ట్రంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు కూడా ఎన్నికల డ్యూటీల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రెమ్యూనరేషన్ చెల్లించిన ఎన్నికల సంఘం కింది స్థాయిలో కష్టపడి పనిచేసిన మహిళలైన ఆశాలు, అంగన్వాడీలు, ఆర్పీలకు మాత్రం పైసా చెల్లించలేదు. ఎన్నికల రోజే కాకుండా నోటిఫికేషన్ రాక ముందు నుంచే ఓటర్ల నమోదు, జాబితాలు, చేర్పులు మార్పులకు సంబంధించిన పనులు చేశారు. కోడ్ అమల్లో కూడా వీళ్లే కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల రోజున డ్యూటీ చేసినందుకు కూడా ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో ఆశాలు, అంగన్వాడీలు, ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల పట్ల వివక్ష చూపుతున్నారంటున్నారు. ఎన్నికల సంఘం, ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు వెంటనే రెమ్యూనరేషన్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం కొందరు అంగన్వాడీలు, ఆశాలకు మే 13కు సంబంధించి రూ.600 రెమ్యూరేషన్ చెల్లించారు. ఒకటి రెండు చోట్ల కాకుండా డ్యూటీలో పాల్గొన్న వాళ్లందరికీ రెమ్యూనరేషన్ చెల్లించాలని ఆశా వర్కర్స్, అంగన్వాడీ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి క్రాంతి వల్లూరుకు వినతి పత్రం అందజేశారు.
రెమ్యూనరేషన్ పెంచాలన్నందుకు టీచర్లపై లాఠీలు
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ పెంచాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. మే 13న పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక రెమ్యూనరేషన్ ఇచ్చే విషయంలో టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మే 11న కేంద్ర ఎన్నికల సంఘం పీఓ, ఎపీఓ, ఓపీఓలకు ఒకే విధమైన రెమ్యూనరేషన్ చెల్లించాలని 691 సర్క్యూలర్ జారీ చేసింది. ఇదే విషయాన్ని నారాయణఖేడ్‌లో పలువురు టీచర్లు అడిగినందుకు స్థానిక ఆర్డీఓ పోలీసుల్ని ఉసిగొల్పి లాఠీఛార్జి చేయించారు. పోలీసులు లాఠీఛార్జి చేయడం, ఆర్డీఓ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా టీచర్లు నిరసన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి పద్మజారాణిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆర్డీఓ, సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
డ్యూటీ చేసిన వాళ్లందరికీ రెమ్యూనరేషన్ ఇవ్వాలి: వరలక్ష్మి, తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆశా) యూనియన్ (సీఐటీయూ) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి డ్యూటీ చేసిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలందరికీ రెమ్యూనరేషన్ చెల్లించాలి. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి క్రాంతి వల్లూరుకు వినతి పత్రం అందజేశాం. రెమ్యూనరేషన్ చెల్లించడంతో మహిళల పట్ల వివక్ష చూపుతున్నారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆశాలు, అంగన్వాడీలు, ఆర్పీలకు ఇవ్వాల్సిన డబ్బుల్ని వెంటనే చెల్లించాలి.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం : పరమేశ్వర్, సంగారెడ్డి కలెక్టరేట్ ఎఓ
ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఆర్పీలకు రెమ్యూనరేషన్ చెల్లించాలని కోరుతూ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఈసీ మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకుంటాం.