పంటల బీమా.. ఆశలు ఆవిరేనా.? 

Crop insurance.. hope?నవతెలంఆగాణ – మల్హర్ రావు
రైతులకు అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లించనున్నట్లు భరోసా కల్పించింది. కానీ వానాకాలం సీజన్ సాగు తుదిదశకు చేరుకున్నప్పటికీ బీమా అమలు తీరుతెన్నులపై మార్గదర్శకాలు విడుదల చేయలేదు. గత కొన్నేళ్లుగా పంటలు చేతికందే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్లతో రైతన్నలు ఆర్థికంగా కుదేలవుతున్నారు.
తుది దశకు నమోదు..
వ్యవసాయ విస్తరణాధికారులు చేపట్టిన పంటల నమోదు ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. నిబంధనల ప్రకారం పంట విత్తన దశ సమయంలోనే బీమా అమలుకు ప్రీమియం చెల్లించాలి. వాణిజ్య పంటల బీమా ప్రీమియం చెల్లించే గడువు ఇప్పటికే ముగియగా.. ఆహార పంటల ప్రీమియం చెల్లింపు గడువు కొద్దిరోజుల్లో ముగియ నుంది. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 95 శాతం ప్రీమియం, రైతులు ఐదు శాతం చెల్లించేవారు. బిఆర్ఎస్  ప్రభుత్వం ఫసల్ బీమా పథకం కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంటోందనే ఉద్దేశంతో 2018 నుంచి బీమాను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో గత కొన్నేళ్లుగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందకుండా పోతోంది. 2023లో మాత్రం వడగళ్ల వానలకు పంటలు నష్టపోయిన  రైతులకు కొంత మేర పరిహా రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద సాయం చేసింది.
రైతుల అసంతృప్తి..
వివిధ పథకాలకు రూ. వందల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం పంటల బీమా అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిం చడంపై రైతుసంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మండలంలో  ముఖ్యంగా మానేరు బ్యాక్ వాటర్ తో మల్లారం,తాడిచెర్ల, కొండంపేట,ఇప్పలపల్లి,కుంభంపల్లి,పివినగర్, రావులపల్లి,వళ్లెంకుంట తదితర గ్రామాల్లో పంట బీమా పథకాలు లేకపోవడంతో రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.