– ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : టీఎస్‌ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు వివిధ పత్రికల్లో వార్తలు వచ్చాయనీ, ప్రభుత్వం కార్మికుల ఆశలు వమ్ముకాకుండా జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, బాండ్ల డబ్బులు తదితర సమస్యల పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రికీ, మంత్రివర్గ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి, కన్వీనర్ వీఎస్ రావు, కో కన్వీనర్ కత్తుల యాదయ్య తెలిపారు. ఈ మేరకు తమ డిమాండ్లను వివరిస్తూ సోమవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇవీ డిమాండ్లు…
1. ఆర్టీసీలో వెల్ఫేర్ బోర్డులను రద్దు చేసి, కార్మిక సంఘాలను అనుమతించాలి.
2. హైకోర్టు ఆదేశాల ప్రకారం గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే జరపాలి.
3. ఆర్టీసీ కార్మికులకు రావల్సిన 2017, 2021 వేతన సవరణలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అమలు చేయాలి.
4. డ్రైవర్, కండక్టర్లకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలి.
5. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలి. ఆర్టీసీ అప్పులను ఈక్వీటిగా మార్చాలి. రాష్ట్ర బడ్జెట్‌లో 2 శాతం నిధులు కేటాయించి, వాటిని విడుదల చేయాలి.
6. సంస్థకు రావల్సిన రాయితీల డబ్బులు ఏనెలకు ఆ నెలే ఇవ్వాలి.
7.హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్‌కు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించాలి.
8. కార్మికులపై పనిభారాలు, పని ఒత్తిడి తగ్గించాలి. కొత్త బస్సులు కొనాలి. కొత్త నియామాకాలు చేపట్టాలి.
9. టూరిస్ట్ పర్మిట్ తీసుకుని స్టేజీ క్యారేజ్‌గా తిప్పతున్న అక్రమ రవాణాను అరికట్టాలి. వైట్ నెంబర్ ప్లేట్ కార్ల అక్రమ రవాణాను అరికట్టాలి 11. రెండు డీఏలను అరియర్స్‌తో అమలు చేయాలి. 136 నెలల డిఏ అరియర్స్ చెల్లించాలి.
12. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు, మెడికల్ అన్ ఫిట్ అయిన వారి కుటుంబ సభ్యుల పిల్లలకు రెగ్యులర్ ప్రాతిపాదికన ఉద్యోగాలు ఇవ్వాలి. 13. రిటైర్ అయిన వారికి చెల్లించాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలి.
16 శాతం ఐఆర్‌నే ఫిట్ మెంట్‌గా ఇస్తామనీ, లేదా అదనంగా కొంత కలిపి ఇస్తామంటూ లీకులు ఇవ్వడాన్ని ఆర్టీసీ జేఏసీ ఖండిస్తుందని తెలిపారు. ఇప్పటికే 80 నెలల నుండి నీరీక్షిస్తున్న ఆర్టీసి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు.