– రాష్ట్ర, జిల్లా స్థాయి పోస్టులపై పలువురి దృష్టి
– సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆశావహులు
– లోక్‌సభ ఎన్నికల తర్వాతే భర్తీకి యోచన
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోవడం.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన కొన్ని రోజులకే నామినేటెడ్ పదవులన్నింటినీ రద్దు చేసింది. వీటి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ పోస్టులను దక్కించుకునేందుకు అనేక మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులు అనేకం ఉండటంతో అందరి దృష్టి వీటిపైనే కేంద్రీకృతమవుతోంది. ఇది వరకు కాంగ్రెస్‌లో అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడిన వారితోపాటు సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్న నాయకులు వీటిపై కన్నేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ చైర్మెన్ పోస్టులను దక్కించుకోవాలని కీలక నాయకులు భావిస్తుండగా.. జిల్లా స్థాయి పోస్టులపై ద్వితీయ శ్రేణి నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా వీటి తర్వాతే నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువు దీరింది. ఆ సమయంలో అసెంబ్లీ టికెట్లు ఆశించి దక్కనివారితో పాటు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సన్నిహితులుగా మెలిగిన వారికి రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేట్ పోస్టులు దక్కాయి. పదేండ్లుగా రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ ఇటీవలి ఎన్నికల్లో మెజార్టీ అసెంబ్లీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో అనేక ఏండ్లుగా కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉంటూ ప్రతిపక్ష పాత్రలో కార్యకర్తలకు తోడుగా నిలిచిన అనేక మంది జిల్లా స్థాయి, ద్వితీయ శ్రేణి నేతలు నామినేటెడ్ పోస్టులను దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇందులో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి దక్కనివారితో పాటు ఏండ్లుగా పార్టీ జెండా మోస్తూ.. క్రియాశీలకంగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. మరికొన్ని చోట్ల సీనియర్ నాయకులుగా ఉండి అసెంబ్లీకి పోటీ చేసేందుకు రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులను దక్కించుకోవాలని భావిస్తున్నారు.
లోక్‌సభ తర్వాతే భర్తీ..!
ప్రభుత్వం రాష్ట్రంలోని నామినేటెడ్ పదవులను రద్దు చేసింది. రాష్ట్రంలో 90కార్పొరేషన్లు ఉండగా వీటిలో కొన్ని మినహా అన్నింటినీ రద్దు చేసింది. ఇక జిల్లా స్థాయిలో ఉండే గ్రంథాలయ చైర్మెన్‌తో పాటు మార్కెట్ కమిటీ పదవులు కూడా కీలకంగా ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు గ్రంథాలయ చైర్మెన్ పదవులు రద్దు కాగా.. 18మార్కెట్ కమిటీల్లో ఇప్పటికే 10కమిటీలను ప్రభుత్వం రద్దు చేసింది. మిగితావి కూడా త్వరలో రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఉమ్మడి జిల్లాకు డెయిరీ, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవులు దక్కిన సందర్భాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అటవీ కార్పొరేషన్ చైర్మెన్ పదవి కూడా జిల్లాకు వచ్చింది. తాజాగా కొందరు కీలక నాయకులు రాష్ట్ర స్థాయి పదవులపై కన్నేయగా.. ద్వితీయ శ్రేణి నేతలు గ్రంథాలయ, మార్కెట్ కమిటీలను దక్కించుకోవడంపై దృష్టిసారిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు ఎమ్మెల్యేలు లేని చోట్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రిని కలుస్తూ ఈ పదవులు కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో నూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. పార్టీ అధిష్టానంతో పాటు ముఖ్య నేతలందరూ వీటిపైనే ప్రధానంగా దృష్టిసారించారు. దీంతో లోక్‌సభ ఎన్నికల తర్వాతే రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని తెలిసింది. ఆశావహులు ఎన్నికలు ముగిసే వరకు ఓపికతో ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.