
– ఓటర్లను ఆకర్షించేయత్నం
– ప్రచారానికి సిద్దవుతున్న బీజేపీ
నవ తెలంగాణ- మల్హర్ రావు:
మంథని నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారంలో ధూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో గ్రామగ్రామాన అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. ఉదయం 10 నుంచే ప్రారంభించి రాత్రి 7 గంటల వరకు కొనసాగిస్తున్నారు. అభ్యర్థులు వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. గతానికి భిన్నంగా ఆత్మీయ సమ్మేళనాలు సామాజిక వర్గాల వారిగా సభలు, సమావేశాలు, గ్రూపు సమావేశాలకు ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. ప్రచార ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటా ప్రచారాలు, బహిరంగ సభలు పెడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిపేస్టో గురించి చెబుతుంటే, కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. అభివృద్ధి బీఆర్ఎస్ తో సాద్యమంటూ స్పష్టం చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మదుకర్ 20 రోజుల క్రితమే ప్రచారంలో మంథని నియోజకవర్గంలో అన్ని మండలాల్లో దూసుకెళుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం విజయభేరి పేరుతో గత నెలలో మంథనిలో ప్రచారం చేపట్టారు. ముఖ్యదితులుగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత బట్టి విక్రమార్క ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జొస్ నింపారు. సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను పక్కా అమలు చేస్తామని, కాంగ్రెస్ ను గెలిపించాలని వారు పేర్కొన్నారు. అదే స్పూర్తితో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ప్రచారంలో దూసుకెళుతున్నారు. బీజేపీ అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డికి ఈనెల 3న టికెట్ కేటాయించారు. ఇతను సైతం ప్రచారం ప్రారంభించడానికి సిద్దమవుతున్నారు.
పూటకో కండువా….అయోమయంలో అభ్యర్థులు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఉన్న ద్వితీయ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కొందరు పూటకో కండువా కప్పుకోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. పొద్దున ఒక కండువా కప్పుకొని సాయంత్రం వరకే మరో కండువా మెడలో వేసుకొంటూ ఉసరవేల్లిలా పూటకో కండువా మార్చడంతో అభ్యర్థులు ఎవరు మనోళ్లు, ఎవరిని నమ్మాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. ఏదిఏమైనా కండువాలు మార్చే చోటా మోటా నాయకులకు ఈ నెల రోజులపాటు మందు, విందులకు కొదువలేదని తెలుస్తుంది.