ఉద్యాన విద్యార్ధుల క్షేత్ర సందర్శన..

– సాగు, యాజమాన్య మెలుకువలు పరిశీలన..
– రైతులతో ముఖాముఖీ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
హైద్రాబాద్,రాజేంద్ర నగర్ లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల లో ఉద్యాన విద్యను అభ్యసిస్తున్న 92 మంది మూడో సంవత్సరం విద్యార్ధులు మూడు రోజుల పాటు అశ్వారావుపేట ప్రాంతంలో క్షేత్ర సందర్శన చేసారు.ఉద్యాన విద్యను అభ్యసించే విద్యార్ధులకు దక్షిణభారత విద్యా,వైజ్ఞానిక యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యాన పరిశోధన కేంద్రాలను సందర్శిస్తూ శుక్రవారం అశ్వారావుపేట చేరుకున్నారు.ఈ సందర్శన ఆదివారంతో ముగిసింది.ఈ  ప్రాంతంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటల,అశ్వారావుపేట ఉద్యాన పరిశోధన కేంద్రంలో రూపొందుతున్న నూతన వంగడాల గురించి,పంటలు పరిశోధనలు పై స్థానిక పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ క్రిష్ణ వివరించారు. మూడు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ఉద్యాన విద్యార్థులు ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో, శతావరి, జామ, మామిడి, అరటి అదే విధంగా వివిధ రకాల కూరగాయల తోటల సాగు,ఉద్యాన పంటల్లో అంతర పంటల సాగును ప్రత్యక్షంగా క్షేత్రాల్లో తిరిగి అధ్యయనం చేసారు. విద్యార్థులు ఈ పంటలు సాగు చేస్తున్న రైతులతో ముఖాముఖీ  మాట్లాడి అనేక వివరాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఉద్యాన పంటలు సాగు చేయడం ద్వారా అధిక ఆదాయం వస్తుందని రైతులు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉద్యాన పరిశోధన స్థానం, అశ్వారావుపేట ను సందర్శించారు.అక్కడ సాగు చేస్తున్న వివిధ పంటలైన మామిడి, జామ, మిరియాలు, జీడి మామిడి, కొబ్బరి, తమలపాకు, కాఫీ మరియు అనేక రకాల కూరగాయల మొక్కలను చూడడం జరిగింది మరియు పరిశోధన స్థానంలో జరుగుతున్న అనేక రకాల పరిశోధన వివరాలను శాస్త్రవేత్త డాక్టర్ విజయ క్రిష్ణ వివరించారు. పరిశోధన స్థానంలో ఉన్న నర్సరీ లో, ఉన్న మొక్కలను పరిశీలించారు. మామిడి, సపోటా, జామ మొదలగు మొక్కలో అంటు కట్టే విధానాలను ప్రత్యక్షంగా వీక్షించారు.అదేవిధంగా ఆయిల్ పామ్ మొక్కల నర్సరీ, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ, కొబ్బరి విత్తనోత్పత్తి స్థానం, వ్యవసాయ కళాశాలలను సందర్శించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక మంది రైతులతో మాట్లాడం జరిగింది వారు సాగు చేస్తున్న ఉద్యాన పంటలను స్వయంగా వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్,టీచింగ్ అసోసియేట్ టి.మమత,ఏ.ఈ.ఓ శ్రీకాంత్ లు పాల్గొన్నారు.