నవతెలంగాణ-భద్రాచలం రూరల్
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్‌లో ఇంటర్, డిగ్రీ, పిజి, విద్యార్థుల హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ వర్కర్లకు 18 నెలలుగా వేతనాలు లేవు, బకాయి వేతనాలు చెల్లించాలని సీఐటియు ఆధ్వర్యంలో పలురూపాల్లో ఆందోళన పోరాటాలు నిర్వహించారు. గత ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు మంత్రులకు అనేకసార్లు వినతి పత్రాలు అందజేశారు. కొత్తగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం పలువురు మంత్రులకు అనేకసార్లు వినతి పత్రాలు అందజేశారు. అయినప్పటికీ అధికారుల్లో గానీ రాష్ట్ర ప్రభుత్వంలో గాని ఎలాంటి చలనం లేదు. అలాగే డైలీ వేజ్ వర్కర్లకు ఏడు నెలల వేతనాలు బకాయి ఉన్నాయి. ఈ బకాయి వేతనాల కోసం 27వ తేదీ నుంచి ఔట్సోర్సింగ్ వర్కర్లు, డైలీ వేజ్ వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ముఖ్యంగా ఔట్సోర్సింగ్ వర్కర్లు సమ్మె చేయడం మూలాన ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులకు వంటలు పూర్తిగా బంద్ అవుతాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు 28వ తేదీ నుండి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల సమయంలో సమ్మె చేయటానికి కార్మికులు సిద్ధపడ్డ ఐటీడీఏ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి గాని వారి సమస్యలపై ఎలాంటి స్పందన లేదని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి పేర్కొన్నారు. బకాయి వేతనాలు చెల్లించాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకి నాలుగు సార్లు వినతి పత్రం అందజేశామని గుర్తు చేశారు. సమ్మె వల్ల తలెత్తే ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ అధికారులే బాధ్యత వహించాలని సీఐటియు పేర్కొన్నది. మార్చి నెలలోనే పదవ తరగతి విద్యార్థులకు సైతం వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల సమయంలో సమ్మె చేయటం ఆశ్రమం పాఠశాలలో సైతం వంటలు పూర్తిగా బంద్ అవుతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని వేతనాలు చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది.