వర్షాకాలంలో వేడి వేడి పకోడీలు తినాలని అందరికీ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ చేసిన తరువాత… లేదంటే వీకెండ్‌లో సాయంత్రం ఏం తినాలో తోచనప్పుడు మన ముందు పకోడీలు వుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అవి ఏ పకోడీ అయినా మంచి టైమ్ పాస్ అవుతుంది. ఉల్లిపాయ పకోడీ, ఆలు, పాలకూర ఇలా.. చాలా వెరైటీలనే చేస్తుంటారు. అలాంటివే కొన్ని వెరైటీ పకోడీలు నేటి మానవిలో…
పాలక్ పన్నీర్‌తో..
పాలకూర, పన్నీర్ రెండూ ఆరోగ్యకరమైనవి. ఎప్పుడూ చేసే పకోడీల కన్నా కొత్తగా అనిపిస్తాయి. పిల్లలైనా, పెద్దలైనా ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్థాలు: పాలకూర – రెండు కప్పులు, పన్నీర్ – 200 గ్రాములు, శెనగపిండి – అరకప్పు, అల్లం – చిన్న ముక్క, పచ్చిమిర్చి – నాలుగు, జీలకర్ర పొడి – పావు టీ స్పూను, ధనియాల పొడి – పావు టీ స్పూను. గరం మసాలా – పావు టీ స్పూను, నూనె – వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: పాలకూరను శుభ్రంగా కడిగి, నీటిని పూర్తిగా పిండేయాలి. పన్నీర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నెలో శెనగపిండి, అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, సన్నగా తరిగిన పాలకూర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా నీరు పోస్తూ మొత్తం మిశ్రమాన్ని పకోడీల పిండిలా కలుపుకోవాలి. పిండి గట్టిగాగానీ, లేదా మరీ పలుచగా ఉండకూడదు. ఒక బాండీలో నూనె వేడి చేసి, పన్నీర్ ముక్కలను పిండిలో ముంచి వేయించాలి. పకోడీలు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని వేడి వేడిగా టొమాటో సాస్ లేదా చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
దొండకాయతో
ఒకసారి దొండకాయ పకోడి ట్రై చేయండి. కూరగాయలతో చేసినవి కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. వీటిని చేయడం చాలా సులువు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్థాలు: దొండకాయలు – పావు కిలో, శెనగపిండి – ఒక కప్పు, కార్న్ ఫ్లోర్ – ఒక స్పూను, పచ్చి మిర్చి – మూడు, జీలకర్ర – ఒక స్పూను, కొత్తి మీర – ఒక కట్ట, నూనె – వేయించడానికి సరిపడా
తయారీ విధానం: దొండకాయల్ని శుభ్రంగా కడిగి నిలువుగా, సన్నగా కోసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో శెనగపిండి, పచ్చిమిర్చి తరుగు, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కొత్తిమీర తరుగు, జీలకర్ర వేసి బాగా కలపాలి. అందులో అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కాక దొండకాయల మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి. వీటిని సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం పూట వీటిని వేడివేడిగా తింటే టేస్టీగా ఉంటాయి.
రాగి పిండితో…
రాగి పిండితో మనకు తెలియని ఎన్నో రెసిపీలు వున్నారు. రాగిలో పోషకాలు మెండుగా వుంటాయన్న విషయం తెలిసిందే. రాగి అనగానే కేవలం రాగి అంబలి, రాగి సంగటి మాత్రమే కాదు రాగి పకోడీ లాంటి టేస్టీ వంటకాలు కూడా చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు: రాగిపిండి – రెండు కప్పులు, ఉల్లిపాయలు – రెండు పెద్దవి, నూనె – వేయించడానికి, ఉప్పు – రుచికి సరిపడ, బియ్యపు పిండి – అర కప్పు, పల్లీలు – పావు కప్పు, పచ్చిమిర్చి – నాలుగు, అల్లం – చిన్న ముక్క, సోంప్ – ఒక స్పూను, ఇంగువ – పావు టీస్పూను, కొత్తిమిర, కరివేపాకు – రుచికి సరిపడ.
తయారీ విధానం: రాగి పకోడీని తయారు చేసుకోవడానికి రెండు పెద్ద ఉల్లిపాయలను సన్నగా తరిగి ఒక బౌల్‌లో వేసుకోవాలి. దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కాచిన వేడి నూనె పోసుకోవాలి. తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. రెండు కప్పుల రాగిపిండిని, అరకప్పు బియ్యపు పిండిని కూడా అందులో వేసుకోవాలి. పావు కప్పు పల్లీలను, సన్నగా కట్ చేసుకొన్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అల్లం ముక్కలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బౌల్‌లో కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ సోంప్ వేసుకోవడం వల్ల పకోడీలు మరింత రుచిగా వస్తాయి. పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకొని పకోడీలు వేసేందుకు అనువుగా కలుపుకోవాలి.
ఇప్పుడు కడాయిని స్టవ్‌పైన పెట్టుకొని పకోడీలు వేయించడానికి తగినంత ఆయిల్‌ను పోసుకోవాలి. రాగి పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని కడాయిలోని నూనెలో వేయించాలి. గోల్డెన్ కలర్‌లో వచ్చే వరకూ వేయించుకోవాలి. పకోడీలు మాడిపోకుండా జాగ్రత్తపడాలి.
క్యాబేజీతో
క్యాబేజీలో విటమిన్ ఏ, ఫోలేట్, విటమిన్ బి అధికంగా ఉంటాయి. కాబట్టి దీన్ని తినడం వల్ల జీర్ణ క్రియ సమస్యలురావు. క్యాబేజీ తరచూ తినేవాళ్లులో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు క్యాబేజీని తినడం అలవాటు చేసుకోండి. క్యాబేజీ పకోడీని అప్పుడప్పుడు చేసుకుంటే మంచిది. పిల్లలకి స్నాక్స్ గా ఉపయోగపడుతుంది.
కావలసిన పదార్థాలు: క్యాబేజీ తరుగు – పావు కిలో, పుదీనా – ఒక కట్ట, కరివేపాకులు – గుప్పెడు, అల్లం తరుగు – ఒక స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, వాము – ఒక స్పూను, శెనగపిండి – ఒక కప్పు, నూనె – సరిపడినంత
తయారీ విధానం: క్యాబేజీని సన్నగా తరిగి ఒక గిన్నెలో వేయాలి, పచ్చిమిర్చిని, అల్లం, పుదీనా, కరివేపాకులను కూడా సన్నగా తరిగి క్యాబేజీలో కలపాలి. తర్వాత వాము, శెనగపిండి, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేయవచ్చు. నీరు మరీ ఎక్కువగా వేసేస్తే అవి నూనె పీల్చుకుంటాయి. నీరు చూసి వేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేయాలి. ఆ నూనెలో క్యాబేజీ మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి. అంతే టేస్టీ క్యాబేజీ పకోడీ రెడీ అయినట్టే. సాస్‌లో ముంచుకుని తింటే టేస్టీగా ఉంటాయి.
మొక్కజొన్నతో
స్వీట్ కార్న్ ఇప్పుడు అన్ని సీజన్‌లలో దొరుకుతున్నాయి.. వీటితో ఎన్నో రకాల వెరైటీలను తయారు చేసుకోవచ్చు.. గారెలు, రైస్, ఉడకపెట్టి సలాడ్స్ ఇలా ఎన్నో చేసుకోవచ్చు.. అందులో స్వీట్ కార్న్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో కార్న్ పకోడా కూడా ఒకటి.. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి.
కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ గింజలు – రెండు కప్పులు, బియ్యం పిండి – అర కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, పచ్చిమిర్చి – నాలుగు, తరిగిన కొత్తిమిర – కొద్దిగా, అల్లం – ఒక చిన్న ముక్క, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, నూనె -ఫ్రైకు సరిపడా..
తయారీ విధానం : ముందుగా కండీల నుంచి గింజలను తీసుకోవాలి.. అందులో కప్పున్నర గింజలను మిక్సీలో వేసుకోవాలి. అందులో కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అందులో బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, మిగిలిన అరకప్పు స్వీట్ కార్న్ గింజలు వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని పునుగుల్లా వేసుకోవాలి. ఈ పకోడీలను ఒక నిమి షం పాటు వేయించిన తరువాత గరిటెతో అటూ ఇటూ కదుపుతూ వేయించాలి. మంటను సిమ్‌లో పెట్టి ఎర్రగా క్రీస్పీగా వచ్చేవరకు చెయ్యాలి.. అంతే ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ పకోడీలు రెడీ అయినట్లే.. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.