చ‌లిలో వేడి వేడి సూప్‌

Hot hot soup in cold weatherచలికాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. దీంతో చాలా మంది జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి సీజనల్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటప్పుడు ఒంటికి వెచ్చదనాన్ని అందించే సూపులు తాగడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అందులో చిన్నా, పెద్దా అందరూ నచ్చే చిక్కనైన, చక్కనైన సూప్‌లు తాగుతుంటే భలే ఉంటుంది. అందుకే సాధారణంగా ఎక్కువ మంది చలికాలం వెచ్చదనం కోసం టమాటా, కార్న్‌, చికెన్‌ సూప్‌ వంటి రకరకాల సూప్‌లను తయారు చేసుకొని ఆస్వాదిస్తుంటారు. అలాంటి వారికోసం కొన్ని అదిరిపోయే సూప్‌ రెసిపీలు…
క్యారెట్‌ కొబ్బరి సూప్‌
కావాల్సిన పదార్థాలు: క్యారెట్‌ తురుము – మూడు కప్పులు, చిక్కటి కొబ్బరి పాలు – అర కప్పు, అల్లం తరుగు – టేబుల్‌ స్పూన్‌, నెయ్యి – టేబుల్‌ స్పూన్‌, ఉల్లి తరుగు – అర కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర – గుప్పెడు, ఉల్లికాడల తరుగు – గుప్పెడు, మిరియాల పొడి – చెంచా, ఒకటి – బిర్యానీ ఆకు.
తయారీ విధానం: ముందుగా మూడు కప్పుల క్యారెట్‌ తురుముని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. అలాగే సన్నని ఉల్లి, అల్లం తరుగుని రెడీగా ఉంచుకోవాలి. కొత్తిమీర, ఉల్లికాడలను సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడెక్కాక బిర్యానీ ఆకు, ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని అల్లం, ఉల్లి తరుగు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాయనుకున్నాక క్యారెట్‌ తురుము, తగినంత ఉప్పు, మిరియాల పొడి, నాలుగు కప్పుల వరకు నీరు పోసుకొని కలిపి మరిగించుకోవాలి. అన్నీ మంచిగా ఉడికిన తర్వాత గరిటెతో మెత్తగా మాష్‌ చేసుకోవాలి. ఆరేడు నిమిషాల తర్వాత అందులో కొబ్బరి పాలు యాడ్‌ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నని మంటపై మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టౌ ఆఫ్‌ చేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లికాడల తరుగు వేసి సర్వ్‌ చేసుకుంటే చాలు. ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే క్యారెట్‌ కొబ్బరి సూప్‌ రెడీ!
ఉపయోగాలు: నోటికి ఏమి రుచించనప్పుడు ఈ సూప్‌ని తాగితే మంచి రిలీఫ్‌ కలుగుతుంది. క్యారెట్‌, కొబ్బరిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
మునగ సూప్‌
కావాల్సిన పదార్థాలు: మునక్కాడ ముక్కలు-కప్పు, మునగ పువ్వులు -పావుకప్పు, ఉల్లిగడ్డ-ఒకటి, చెంచా వెన్న, చిన్న అల్లం ముక్క, జీలకర్ర- అర టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం: ముందుగా మునక్కాయల్ని ముక్కల్లా కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిగడ్డ సన్నగా కట్‌ చేసుకోవాలి.
ఇప్పుడు స్టౌపై ఒక పాత్ర పెట్టండి. ఇందులో వెన్న వేసి కరిగించండి. ఆపై మునక్కాడ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఒక ఐదు నిమిషాల తర్వాత ఉల్లి ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్క, శుభ్రంగా కడిగిన మునగ పువ్వులు వేసి రెండు నిమిషాలు వేపండి. ఇప్పుడు పాత్రలో సగానికిపైగా నీరు పోసి బాగా మరగనివ్వాలి. సూప్‌ సగమయ్యాక ఓ పాత్రలోకి వడకట్టుకోవాలి. దీనిని సర్వ్‌ చేసుకునే ముందు పైన కాస్త కొత్తిమీర తరుగు, ఉప్పు, పెప్పర్‌ చల్లుకుని వేడివేడిగా తాగితే సరి. అలాగే ఈ సూప్‌లోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకున్నా రుచి ఎంతో బాగుంటుంది.
మునగ సూపుతో ప్రయోజనాలు: మునక్కాడలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని తరచూ తాగడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో వైరస్‌, బ్యాక్టీరియాల బారిన పడకుండా ఈ సూప్‌ తోడ్పడుతుంది.
సాధారణంగా చలికాలంలో జీర్ణప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. ఈ ఇబ్బంది ఎక్కువగా ఉన్నవారు డైలీ మార్నింగ్‌ కప్పు మునగ సూప్‌ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. అలాగే ఇందులోని ఫైబర్‌ ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇంకా మలబద్ధకం సమస్యని నివారిస్తుంది. మునగలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని దృఢంగా మారుస్తాయి. అలాగే మునగలోని పొటాషియం నాడీవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటు అదుపులో ఉంచి గుండెపోటు రాకుండా కాపాడుతుంది. ఈ సూప్‌తో పోషకలేమిని అధిగమించొచ్చని నిపుణులు చెబుతున్నారు.
చికెన్‌ నీంబూ ధనియా షోర్బా
కావాల్సిన పదార్థాలు : చికెన్‌ ముక్కలు- యాభై గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- పావు చెంచా, ధనియాలు- ఒక చెంచా, నిమ్మకాయ-ఒకటి, క్రీమ్‌- రెండు చెంచాలు, బటర్‌ – అర చెంచా, పసుపు- పావు చెంచా, పచ్చి మిర్చి- రెండు, కార్న్‌ఫ్లోర్‌- ఒక చెంచా, ఉప్పు- రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు-కాస్త.
షోర్బా తయారీ విధానం: ముందుగా చికెన్‌ ముక్కలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిలు తీసుకుని పేస్ట్‌ లాగా గ్రైండ్‌ చేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్‌ చేసుకోండి. ఇప్పుడు స్టౌపై పాన్‌ పెట్టండి. ఇందులో బటర్‌ వేసి కరిగించండి. ఆపై చికెన్‌ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఐదు నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, ధనియాలు, పచ్చిమిర్చి పేస్ట్‌ వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత మూడు పెద్ద కప్పుల నీరు పోయండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చికెన్‌ షోర్బా మరిగించుకోండి. చికెన్‌ ముక్కలు ఉడికిన తర్వాత.. రుచికి సరిపడా ఉప్పు, కార్న్‌ఫ్లోర్‌, క్రీమ్‌ వేసి మిక్స్‌ చేయాలి. ఐదు నిమిషాల తర్వాత నిమ్మరసం, కాస్త కొత్తిమీర తరుగు చల్లండి. ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్‌ చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన చికెన్‌ నీంబూ ధనియా షోర్బా మీ ముందుంటుంది.
జింజర్‌ గార్లిక్‌ సూప్‌
కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు – పది, అల్లం – అంగుళం ముక్క, నెయ్యి – అర టీ స్పూను, క్యారెట్‌ – కొద్దిగా, నీరు – ఒకటిన్నర గ్లాసు, మిరియాలు – అర టీ స్పూన్‌, కార్న్‌ఫ్లోర్‌ – టేబుల్‌ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – కొద్దిగా.
తయారీ విధానం: ముందుగా వెల్లుల్లి, అల్లం పొట్టు తీసి పక్కన పెట్టాలి. అనంతరం వీటిని రోట్లో వేసి మెత్తగా దంచుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే రోట్లో మిరియాలు వేసి కచ్చాపచ్చాగా దంచి మరో గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే క్యారెట్‌ను శుభ్రంగా కడిగా సన్నగా కట్‌ చేసి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌, నీళ్లు పోసి బాగా కలిపి పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసి గిన్నె పెట్టి నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత స్టవ్‌ను సిమ్‌లో పెట్టి దంచిన అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్‌ చేసిన క్యారెట్‌ ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి తురుము, క్యారెట్‌ ముక్కలు వేగిన తర్వాత నీళ్లు పోసి కలిపి ఓ 5 నిమిషాలు మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు దంచిన మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత ముందే కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమాన్ని వేసి మరో ఐదు నిమిషాలు మరిగించుకుని కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ ఆఫ్‌ చేసి సర్వ్‌ చేసుకుంటే చాలు. అంతే ఎంతో టేస్టీగా ఉండి, ఆరోగ్యానికి మేలు చేసే జింజర్‌ గార్లిక్‌ సూప్‌ రెడీ. దీన్ని తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.