– రెండో రోజు హీటెక్కిన ఉభయ సభలు
– ఆరు గ్యారెంటీలపై సర్కారును ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్ యత్నం
– సీఎం రేవంత్ సహా మంత్రుల ఎదురుదాడి
– మండలిలో కార్యకలాపాలను అడ్డుకున్న ప్రతిపక్షం
– అసెంబ్లీ, కౌన్సిల్ నేటికి వాయిదా నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫిబ్రవరిలోనే రాష్ట్రంలో వాతావరణం హీటెక్కుతోంటే.. అంతకుమించి తెలంగాణ శాసనసభ, మండలిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల రెండో రోజైన శుక్రవారం ఉభయ సభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్… అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు, అందులోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటోవాలాలు పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతూ ఆ పార్టీ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఆయన ‘420’ హామీలుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్‌బాబు… పల్లా వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఈ సమయంలో బీఆర్‌ఎస్ సభ్యుడు కేపీ వివేకానంద స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లటం వివాదాస్పదమైంది. మరోవైపు గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానమిస్తూ… బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు.
ఆ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి ఆయన పలుమార్లు సెటైర్లు విసిరారు. కాంగ్రెస్ సభ్యుడు వేముల వీరేశం.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభలో ప్రతిపాదించగా… అధికార పక్ష సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి, బీర్ల ఐలయ్య ఆ తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగించారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులపై వారు ఈ సందర్భంగా వ్యంగాస్త్రాలు సంధించారు.
మండలిలోనూ…
మరోవైపు శాసన మండలిలో బీఆర్‌ఎస్ సభ్యులు చేపట్టిన నిరసనతో సభ రోజంతా హీటెక్కింది. మండలి సభ్యులనుద్దేశించి సీఎం రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని శాంతింపజేసేందుకు మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మెన్ బండ ప్రకాశ్, మంత్రులు జూపల్లి, తుమ్మల, శ్రీధర్‌బాబు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్టు చైర్మెన్ ప్రకటించారు. అటు రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత కూడా కొనసాగిన శాసనసభ కూడా శనివారానికి వాయిదా పడింది. ఈ రకంగా ఉభయ సభలు శుక్రవారం హాట్ హాట్‌గా కొనసాగాయి. వీటికితోడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద… అసెంబ్లీకి వస్తూ ప్రధాన ద్వారం వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగటం చర్చనీయాంశమైంది.