కాంగ్రెస్‌ హయాంలోనే పేదలకు ఇండ్లు

కాంగ్రెస్‌ హయాంలోనే పేదలకు ఇండ్లు– బీఆర్‌ఎస్‌ ఏ ఒక్కరికైనా ఇండ్లు ఇచ్చిందా?
– నేటికీ గ్రామాల్లో కనిపించేవి ఇందిరమ్మ ఇండ్లే
– ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం: ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ
– ఖేడ్‌ నియోజకవర్గంలో ప్రజా పాలన కార్యక్రమాలకు హాజరు
నవతెలంగాణ-నారాయణఖేడ్‌రూరల్‌
కాంగ్రెస్‌ హయాంలోనే నిరుపేదలకు ‘ఇందిరమ్మ ఇండ్లు’ వచ్చాయని.. నేటికీ గ్రామాల్లో ఆ ఇండ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలంలోని హనుమంతరావుపేట్‌, నారాయణఖేడ్‌ మున్సిపాల్టీ, మన్సున్పూర్‌లో మంగళవారం జరిగిన ప్రజా పాలన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, భూములు ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఈ పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ఒక్కరికైనా ఇల్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు. కానీ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని, ఎన్నికల ముందు తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రూ.10లక్షల ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. మున్సిపాల్టీ పరిధిలోకి మన్సున్పూర్‌లో వచ్చిన నాటి నుంచి ఆ గ్రామానికి ఉపాధి హామీ పనులు ఇవ్వటం లేదని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తప్పకుండా ఉపాధి పనులు ఇస్తామని చెప్పారు. మన్సున్పూర్‌లో దళితులకు ఇండ్లు ఇస్తామని, ప్రభుత్వ భూమి ఉంటే అందులో ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎంపీ సురేష్‌ కుమార్‌ సెట్కార్‌ మాట్లాడుతూ.. నారాయణఖేడ్‌లో మంచి వైద్యం అందే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. నూతనంగా జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. తన జన్మభూమి ఇక్కడే అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పార్టీ అని తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే పట్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.. నారాయణఖేడ్‌ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అన్నారు. పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. పేదలకు ఇల్లు, స్థలాలు ఇవ్వాలని, మున్సిపాల్టీలో టాక్స్‌ తగ్గించాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని మంత్రిని కోరారు. అనంతరం మంత్రి ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు శేఖర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఆర్డీఓ వెంకటేష్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ రుబిన నజీబ్‌, ఆనంద్‌ స్వరూప్‌ షెట్కర్‌, శంకర్‌ సెట్‌, నర్సింలు, డీఎస్పీ వెంకట్‌ రెడ్డి, అధికారులు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.