ఇండ్లు, స్థలాలు ఇవ్వాలి

– ప్రభుత్వ భూములు పంచాలి : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంఘాల ధర్నా
– తెలంగాణ ప్రజాసంఘాల
– ఐక్యపోరాట వేదిక యాత్రకు సంఘీభావం
నవతెలంగాణ- విలేకరులు
పేదలు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం), ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు సంఘీభావంగా సోమవారం తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వందలాది మంది ప్రజలు రావెళ్ల సత్యనారాయణ భవన్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
ఖమ్మం రూరల్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టి తొమిదేండ్లు గడుస్తున్నా ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని, లేని పక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు పాతి పేదలకు ఇండ్ల స్థలాలు పంచుతామని చెప్పారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేద ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మోడీ ఇతర దేశాలకు వెళ్లి భారతదేశంలో పేదలు ఎవరూ లేరని, అందరికీ ఇండ్లు నిర్మించామని మోసపూరితమైన మాటలు, అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇండ్లు, స్థలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న బస్సు యాత్ర సంఘీభావంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ధర్నా చేశారు. తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయం ముందు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందించారు. బాలానగర్‌ మండల కేంద్రంలో పేదలకు ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, ఆసరా పెన్షన్స్‌, ఖాళీ జాగా ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేశారు. హన్వాడ మండల కేంద్రంలో సీఐటీయూ, కేవీపీఎస్‌ ఏఐఏడబ్ల్యూ ఏఐకేఎస్‌ సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.