– ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయమందివ్వాలి
– ఆత్మకూర్ టూ సదాశివపేటకు పేదల పాదయాత్ర
– తహాసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా, వినతి
– పట్టాలిచ్చి పొజీషన్ చూపకపోతే ఇండ్లు నిర్మించుకుంటం: జయరాజు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల్ల స్థలాలివ్వాలని, గృహలక్ష్మీ పథకం కింద ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామంలో పేదలకు పట్టాలిచ్చిన భూమిలో పొజిషిన్ చూపి ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరుపేదలు ఆత్మకూర్ నుంచి సదాశివపేట తహసీల్దార్ కార్యాలయం వరకు 15 కిలో మీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ముండుటెండల్ని లెక్కచేయకుండా వృద్ధులు, మహిళలు కాలినడకన తహసీల్‌కు వచ్చి అక్కడ బైటాయించారు. అధికారులు బయటికి రావాలని, పట్టాలిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ నినదించారు. తహసీల్దార్ మనోహర్ చక్రవర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ.. ఆత్మకూర్‌లో 170 సర్వే నెంబర్‌లో ఉన్న ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిలో టీడీపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇండ్ల స్థలాలిచ్చి పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేసి పొజిషన్ చూపలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్ల పాలనలోనైనా పేదలకు పొజిషన్ చూపి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తారని ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అందుకే పేదలంతా ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పాదయాత్ర రూపంలో పోరాటానికి దిగాల్సి వచ్చిందన్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూములున్నా పేదలకు వంద గజాల ఇంటి స్థలం ఇచ్చేందుకు మనసు రావట్లేదన్నారు. మరో పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కంపెనీలు, రాజకీయ నాయకులు మాత్రం ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్నా పట్టింపులేదని ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని, లేని పక్షంలో పేదలతో కలిసి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాదయాత్రలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వి.ప్రవీణ్‌కుమార్, వ్యకాస జిల్లా కార్యదర్శి ఎం.నర్సింహులు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు పెద్దాపురం అశోక్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అనిల్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యాదవరెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు మల్లేశం, శ్రీనివాస్, మహేష్, పోశయ్య, పుష్పమ్మ పాల్గొన్నారు.