ఎలా ఉన్నారు..!

How are you..!– త్వరగా కోలుకుని ప్రజాసేవకు రావాలి
– కేసీఆర్‌కు చంద్రబాబు సహా పలువురి పరామర్శ
– భట్టి, చిరంజీవి, ప్రకాశ్‌రాజ్‌, భీమ్‌ ఆర్మీ చీఫ్‌ , ప్రవీణ్‌కుమార్‌ రాక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు పరామర్శించారు. వీలైనంత తొందరగా కోలుకొని ప్రజాసేవకు రావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను సోమవారం చంద్రబాబు కలిశారు. దాదాపు ఇరవై నిమిషాలు అక్కడ గడిపారు. పక్కనే కూర్చుని కేసీఆర్‌తో మాట్లాడారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వద్ద చంద్రబాబుకు యదోశ యాజమాన్యంతోపాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్‌, ఇతరులు స్వాగతం పలికారు. కేసీఆర్‌ దగ్గరే ఉన్న కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌, కూతురు కవితతోనూ చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం ఆస్పత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ ‘ఆయనతో మాట్లాడాలనిపించి వచ్చాను. కోలుకోవడానికి ఆరువారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. చాలా చక్కగా అపరేషన్‌ జరిగింది. త్వరలోనే కేసీఆర్‌ మామూలుగా నడుస్తారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరామర్శించి వెళుతున్న క్రమంలో కేటీఆర్‌, చంద్రబాబును ఆస్పత్రి బయటకు తోడ్కోని వచ్చి సాగనంపారు. అలాగే తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేసీఆర్‌ను కలిసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సర్జరీ విజయవంతమైందని డాక్టర్లు తనకు చెప్పినట్టు భట్టి మీడియాతో అన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు పి.సబితాఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్‌, గంగుల కమలాకర్‌, చామకూర మల్లారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌, బీఎస్పీ నేత ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌, కేసీఆర్‌ను పరామర్శించి, క్షేమసమాచారం తెలుసుకున్నారు. గురువారం రాత్రి ఎర్రవల్లి ఫార్మ్‌హౌజ్‌ బాత్‌రూంలో జారిపడటంతో కేసీఆర్‌ ఎడమ తుంటికి తీవ్రగాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యవోద ఆస్పత్రి డాక్టర్లు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటిమార్పిడికి అపరేషన్‌ చేశారు. ప్రస్తుతం కేసీఆర్‌ గత మూడు రోజులుగా ఆస్పత్రిలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
పరామర్శల వెల్లువ
మాజీ సీఎం కేసీఆర్‌కు రాజకీయ నాయకులు, సినిమా పరిశ్రమ నుంచి సోమవారం పరామర్శల వెల్లువ కొనసాగింది. చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి పరామర్శించారు. కేసీఆర్‌ను ఉత్సాహా పరిచే ప్రయత్నం చేశారు. సినిమా పరిశ్రమ పరిస్థితి గురించి చిరంజీవిని అడగ్గా, బాగుందని ఆయన సమాధానమిచ్చారు. కేటీఆర్‌, కవితతోనూ చిరంజీవి మాట్లాడారు. అలాగే భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌, ఎన్టీవీ చైర్మెన్‌ నరేన్‌చౌదరి సైతం పరామర్శించినవారిలో ఉన్నారు.
కేటీఆర్‌తో మాట్లాడిన గవర్నర్‌
కేసీఆర్‌ ఆరోగ్యం గురించి రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై సౌందరరాజన్‌ కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రొటెంస్పీకర్‌ ప్రమాణం సందర్భంగా కూడా మాజీ మంత్రి హరీశ్‌రావుతో కేసీఆర్‌ ఆరోగ్యపరిస్థితి గురించి అడిగితెలుసుకున్నారు.
రేవంతన్న ..మీతో మాట్లాడాలన్నా..
సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి వెళ్లిపోతున్న క్రమంలో ‘రేవంతన్నా… రేవంతన్నా.. అని ఒక అమ్మాయి గట్టిగానే పిలిచింది. మీతో మాట్లాడాలన్నా ..మీతో మాట్లాడాలన్నా అని రెండుసార్లు అంది. ఆ పిలుపు విన్న సీఎం రేవంత్‌ అమ్మాయి వైపు వచ్చారు. అప్పటికే ఆస్పత్రితోపాటు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఆ ఆమ్మాయిని ఆపేశారు. ఆ అమ్మాయి ఉన్న చోటుకి సీఎం వస్తూ ‘అక్కడే ఉండు..అక్కడే ఉండు..నేనే వస్తా అంటూ..ఏంటీ ప్రాబ్లమ్‌’ అని పలకరించారు. ‘మా తాతయ్యకు ఒక్కరోజే లక్ష రూపాయలు అయిందన్న..కొంచెం చూడండి అని తన గోడును వెళ్లబోసుకుంది. ప్లీజ్‌ హెల్ప్‌ చేయండన్నా..ప్లీజ్‌ అంటూ ఆయన కాళ్లపై పడే ప్రయత్నం చేసింది. అందుకు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుంటూ వెంటనే సీఎం రేవంత్‌ స్పందించి సమస్యను పరిష్కరించాలంటూ తన సిబ్బందిని ఆదేశించారు. అమ్మాయిని సముదాయించి అక్కడి నుంచి వెళ్లిపోయే వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. సీఎం రేవంత్‌ స్పందన, ఆయన ఉదారత పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.