”మలినమంటనట్టి మానవతావాది
కల్తీలేని శుద్ద కమ్యూనిస్టు
వరగగాడ్యుడయిన కొరటాల మరణము
లేశమైన తీర్చలేని లోటు”
సుప్రసిద్ద సినీ నిర్మాత, దర్శకులు, సహజకవి మల్లెమాల గారు 01 జులై 2006న కొరటాల సత్యనారాయణ గారు చనిపోయిన సమయంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించినప్పుడు ఆశువుగా చెప్పిన పద్యమిది. కొరటాల ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. కమ్యూనిస్టు నాయకుడు, ఉద్యమ రూపకర్త. ప్రజా ప్రతినిది óగానూ సేవలందించిన నేత. భౌతికంగా మనకు దూరమై పద్దెనిమిదేండ్లు గడుస్తున్నా ‘ఏరా బాబూ ఎలా ఉన్నావ్?’అనే ఆయన ఆత్మీయమైన పిలుపు ఇంకా సజీవంగానే ఉంది. కొరటాల వర్థంతి సందర్భంగా నా అనుభవాలు కొన్ని…
గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉండి నక్సల్ చీలికతో కకావికలమైన పార్టీని పునర్మించటంలో పుతుంబాక వెంకటపతి గారితో కల్సి ధీర్ఘకాలంలో ఆ పనిని ఫలవంతం చేశాడు కొరటాల. 1991-97 మధ్యకాలంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటి సభ్యులుగా వుంటూ ఆ తర్వాత పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా కీలక బాధ్యత నిర్వహించారు. 29 సంవత్సరాల వయసులో తెనాలి పార్లమెంటు నియోజకవర్గం నుండి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి కేవలం 1388 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1962లో వేమూరు, 1978లో రేపల్లె నియోజక వర్గాల నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఇక్కడ పాత కామ్రేడ్స్ చెప్పిన ఒక విషయం చెప్పాలి. తెనాలి తాలూకా గ్రామాల్లో మన పార్టీ కంటే కృషికార లోక్‌పార్టీకి విజయావకాశాలు బాగా వున్నాయనే వాతావరణం ఏర్పడటంతో కాంగ్రెసును ఓడించాలనే అభిప్రాయం గల మన పార్టీ శ్రేణులు కొందరు కె.ఎల్.పి. అభ్యర్ధికి ఓటు వేశారట. తీరా లెక్కింపు తర్వాత ఫలితాలు చూస్తే కాంగ్రెసు అభ్యర్ధి కొత్త రఘురామయ్యకు 103126 ఓట్లు రాగా, కొరటాల గారికి 101738 ఓట్లు వచ్చాయి. రంగా గారి కే.ఎల్.పి. అభ్యర్ధి శీరం వెంకట సుబ్బారావుకి కేవలం 54909 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ కారణంగా రఘురామయ్య గెల్చి మూడు దశాబ్దాలు ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేశాడు.
నేను గుంటూరు జె.కె.సి కాలేజిలో 1970లో ఇంటర్మీడియట్‌లో చేరాను. జూనియర్ ఇంటర్ అయిపోయి వేసవి సెలవుల అనంతరం కాలేజికి వెళ్లగానే నన్ను కాలేజి నుండి తొలగిస్తున్నట్లు ఆఫీసుకొచ్చి టీసీ తీసుకోమని నోటీస్ పెట్టారు. దాన్ని వెనక్కు తీసుకొనేట్లు నేను చేసిన ప్రయత్నాలన్నీ పని చేయకపోవటంతో విషయాన్ని కొరటాల గారి దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే ఆయన అప్పటి వేమూరు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే యడ్లపాటి వెంకటరావుతో మాట్లాడి ఆయన్ను పిలిపించి నన్ను తీసుకొని స్వతంత్ర పార్టీ నాయకులు ఆ కళాశాల కమిటి ఛైర్మన్, పార్లమెంట్ మాజీ సభ్యులు అయిన జాగర్లమూడి చంద్రమౌళి గారి దగ్గరకు తీసుకెళ్లారు. విషయం విన్న చంద్రమౌళి గారు ఫోన్‌లో ప్రిన్సిపల్ రోశయ్య గారితో మాట్లాడి మరుసటి రోజు కాలేజికి వెళ్లి జాయిన్ అవమని చెప్పారు. కాలేజి కమిటి అధ్యక్షుడికిచ్చిన మాట ప్రకారం నన్ను చేర్చుకోవటానికి ప్రిన్సిపాల్ నిరాకరించాడు. కమ్యూనిస్టులు నా కాలేజిలో ఉండటానికి వీల్లేదని హుంకరించాడు. గత్యంతరం లేక హిందూ కాలేజిలో చేరి నా చదువు కొనసాగించాను.
ఆ తర్వాత 1975లో సీపీఐ(ఎం) నాయకులు పోపూరి రామారావు గారి అమ్మాయి అరుణతో నా వివాహం జరగటంతో కొరటాల గారితో నా పరిచయం మరింత చిక్కబడింది. మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత 1987లో మండలాధ్యక్షుడిని ప్రత్యక్షంగా ఎన్నుకొనే విధంగా ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఎడ్లపాడు మండలాధ్యక్షునిగా మా మామ పోపూరి రామారావు సీపీఐ(ఎం) అభ్యర్ధిగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి బావమరిది కాంగ్రెసు అభ్యర్ధిగా నిలవటంతో ఈ ఎన్నిక రాష్ట్రస్థాయిని ఆకర్షించింది. ఆ ఎన్నికని పర్యవేక్షించటానికి కొరటాల గారు ఎడ్లపాడు వచ్చారు. నేను గుంటూరు నుండి నా మిత్రుని కారు తీసుకొని వెళ్లాను. ఆ కారులో ఎన్నికల రోజు నేనూ, కొరటాల గారు మండలంలోని అన్ని గ్రామాలూ తిరిగాం. బ్యాలెట్ పెట్టెలు బావిలో వేయటంతో చంఘిస్‌ఖాన్ పేట అనే గ్రామంలో మరుసటి రోజు రీ పోలింగ్‌కి దారితీసింది. కొరటాల గారు ఎడ్లపాడులో ఆగిపోయారు. ఆరోజు నేనూ, కొరటాల మరికొంతమంది స్థానిక నాయకులతో కలిసి ఆ గ్రామానికి బయలు దేరాము. కొద్దిదూరం వెళ్లిన తర్వాత అప్పటి సీపీఐ(ఎం) శాసనసభ్యులు పుతుంబాక వెంకటపతి గారికి ఒక విషయం చెప్పాల్సిందిగా నన్ను కారు దిగి వెనక్కి ఎడ్లపాడు వెళ్లి ఫోను చేయమన్నాడు. (ఆ రోజుల్లో సెల్‌ఫోన్లు లేవు) వారు ఆ గ్రామానికి వెళ్లటం కోసం ముందుకు వెళ్లారు. కాని దారి మధ్యలో కాంగ్రెసు గుండాలు కారుని ఆపి దాన్ని ధ్వంసం చేసి కొరటాల గారిని, ఆయనతో వున్న మిగిలిన వ్యక్తుల్ని ఒక ట్రాక్టర్‌పై ఎక్కించుకొని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి సొలస అనే గ్రామంలో ఒక ఇంటిలో నిర్భంధించారు.
ఈ విషయం తెలిసి వేల సంఖ్యలో ప్రజలు బోయపాలెం గ్రామం సెంటర్‌లో పోగయ్యారు. పూర్తి సాయుధ సరంజామాతో వందల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నా ముందుకు పోలేకపోయాం. కారణం కొరటాల గారు వారి ఆధీనంలో వున్నారు. ఈలోగా శాసనసభ్యులు పుతుంబాక గారు ముఖ్యమంత్రి దృష్టికి విషయం తీసుకెళ్లటంతో ఆయన జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించగా గుంటూరు నుండి పోలీసు బలగాలు పెద్దఎత్తున బయలుదేరాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెసు గుండాలు కొరటాల గారిని, ఇతరుల్ని పక్క గ్రామం వరకు తీసుకొచ్చి వదిలేశారు. అంతకుముందు తిమ్మాపురం అనే గ్రామంలో మన పోలింగ్ ఏజెంట్‌ని కొరటాల – స్థానిక కాంగ్రెసు శాసనసభ్యుని సమక్షంలో కాంగ్రెసు వారు పోలింగ్‌బూత్‌లో నుండి గెంటి వేయటంతో కొరటాల గారు ఆ ఎమ్మెల్యేతో గొడవ పడ్డాడు. కిడ్నాప్ సమయంలోనూ తాను నిబ్బరంగా వుండి సహచరులకు ధైర్యం చెప్పిన తీరు వారంతా ఆశ్చర్యంతో చెప్పారు. మల్లెమాల గారన్నట్లు ఆయన మరణం ”లేశమైనా తీర్చలేని లోటు”.
(జులై 1 కొరటాల వర్ధంతి)
– చెరుకూరి సత్యనారాయణ