అభిప్రాయాలు చెప్పడమే నేరమా? జర్నలిస్టులపై కేసు ఎలా పెడతారు?

Is it a crime to express opinions? How to file a case against journalists?– ఎఫ్‌ఐఆర్‌ను ఎందుకు కొట్టివేయకూడదు?
– ఎడిటర్స్‌ గిల్డ్‌ కేసులో చీఫ్‌ జస్టిస్‌ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : మణిపూర్‌లో హింసకు సంబంధించి పక్షపాతంగా మీడియా కవరేజి జరిగిందన్న అంశంపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఇజిఐ) ఇచ్చిన నివేదిక తప్పు కావచ్చు లేదా నిజం కావచ్చు, కానీ తన అభిప్రాయాలను చెప్పడం భావ ప్రకటనా స్వేచ్ఛ కదా! అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. నలుగురు జర్నలిస్టులపై మణిపూర్‌ పోలీసులు దాఖలు చేసిన కేసులో వారిపై బలవంతంపు చర్యలు తీసుకోకుండా సుప్రీం కోర్టు రెండు వారాల పాటు రక్షణ కల్పించింది. ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన జర్నలిస్టులు నేరానికి పాల్పడ్డారంటూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారని, కానీ అందులో తనకు నేరమనేది కనిపించడం లేదని చీఫ్‌ జస్టిస్‌ వ్యాఖ్యానించారు. అసలు ఆ జర్నలిస్టులు చేసిన నేరమేమిటని ఆయన ప్రశ్నించారు. తమ అభిప్రాయాలను చెప్పడాన్నే నేరంగా ఎలా పరిగణిస్తారు? అని ఫిర్యాదుదారులను ప్రశ్నించారు. తొలుత ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి మార్చాలని సూచించిన కోర్టు, ఆ తర్వాత ఫిర్యాదుదారులు పదే పదే జర్నలిస్టులు మణిపూర్‌లో చేసిన నష్టం గురించి ప్రస్తావిస్తూ వుండడంతో కీలకమైన వ్యాఖ్యలు చేసింది.”మీరు ఈ విషయాన్ని లేవదీశారు కాబట్టి ఒక విషయం ముందు మాకు చెప్పండి, అసలు ఈ నేరాలు ఎలా జరిగాయో చెప్పండి, అఫిడవిట్‌ దాఖలు చేయండి, అన్నీ రికార్డు చేయండి, అసలు ఈ ఫిర్యాదులను, ఎఫ్‌ఐఆర్‌లను ఎందుకు కొట్టివేయరాదో కూడా చెప్పాలి” అంటూ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ కోరారు. మణిపూర్‌లో పక్షపాతంతో కూడిన మీడియా కవరేజీ జరిగిందని పేర్కొంటూ ఆర్మీ ఎడిటర్స్‌ గిల్డ్‌కు లేఖ రాసింది. వెంటనే గిల్డ్‌ తన సీనియర్‌ జర్నలిస్టుల బృందాన్ని పంపి, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో కనుగొ నాల్సందిగా కోరింది. వారు ఒక నివేదికను సమర్పించారు. అది నిజమవచ్చు లేదా తప్పు కూడా కావచ్చు, కానీ అదంతా కూడా భావ ప్రకటనా స్వేచ్చకు సంబంధించినది కదా? మీరు దాన్నెలా తప్పుబడతారని చీఫ్‌ జస్టిస్‌ ప్రశ్నించారు. ఒకవేళ మీడియా వార్తలు తప్పు కావచ్చు, జర్నలిస్టులందరిపై ఐపిసిలోని సెక్షన్‌ 153 కింద అభియోగాలు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. ఆ నివేదిక అంతా ప్రభుత్వ వ్యతిరేక కథనమని మీరు మీ ఫిర్యాదులో పేర్కొంటున్నారు. ఎడిటర్స్‌ గిల్డ్‌ తప్పు చేసిందని మీ భావన, అందుకే ప్రతి పేరాగ్రాఫ్‌లో కూడా తప్పు, తప్పు అని పేర్కొంటూ వస్తున్నారు. ‘ఒక వ్యాసంలో తప్పుడు స్టేట్‌మెంట్‌ చేయడం సెక్షన్‌ 153ఎ కింద నేరం కాదు’ అని చీఫ్‌ జస్టిస్‌ ఫిర్యాదుదారులకు స్పష్టం చేశారు. ఒక దశలో ఫిర్యాదుదారు తరపున న్యాయవాది కృష్ణకుమార్‌ మాట్లాడుతూ, ఎడిటర్స్‌ గిల్డ్‌ తన నివేదికను ఉపసంహరించుకుంటే తన క్లయింట్‌కూడా వారి ఫిర్యాదులను ఉపసంహరించకుంటారని సూచించారు. ఎట్టకేలకు తన ప్రతిస్పందనతో అఫిడవిట్‌ దాఖలు చేయడానికి ఆయన అంగీకరించారు. ఎడిటర్స్‌ గిల్డ్‌ తరపున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ ధావన్‌ మాట్లాడుతూ, తమ నివేదికకు వ్యతిరేకంగా వచ్చిన అభిప్రాయాలను కూడా నివేదికతో పాటే గిల్డ్‌ వెబ్‌ పేజ్‌లో ప్రచురిస్తామని చెప్పారు. రెండు రకాల అభిప్రాయాలు చదివిన తర్వాత ప్రజలు వారి అభిప్రాయాలను ఏర్పరుచుకోవచ్చని అన్నారు.