ఏ దేశ భవిష్యత్తు అయినా నిర్దేశించేది తరగతి గది అని ప్రముఖ విద్యావేత్త కొఠారి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రాథమిక పాఠశాలలు మొదటి స్తంభాలు. బాలలందరికీ ప్రాథమిక విద్య సజావుగా సమకూరితే ఆ జాతికి ఆర్థికాభ్యున్నతి చేకూరుతుంది. కానీ మన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉచిత విద్య లభిస్తున్న అందులో నాణ్యత నేతిబీర చందంగా మారింది. విద్యా హక్కు చట్టం -2009 నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడానికి అదేపనిగా పాఠశాలలను విస్తరించుకుంటూ పోయిన మన ప్రభుత్వాలు గుణాత్మక విద్యకు తొలిమెట్టు అయిన ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యతను గాలికి వదిలేసాయి. మౌలిక వసతులు కల్పించకపోవడం తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించకపోవడం వలన పునాది చదువులు నిస్సారమవుతున్నాయి.
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల కింద మొత్తం 30023 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు ఉన్నాయి.అందులో 18 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 2021-22 యు డైస్ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 6392 ప్రాథమిక పాఠశాలలు ఒక ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. గత ఏడేళ్లలో ఒక టీచర్‌ను కూడా నియమించని రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. గత రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యం వహించడం వలన శాశ్వత ప్రాతిపాదికన ఉపాధ్యాయులను నియమించ లేదు. పాఠశాల విద్యలో పునాది అయిన ప్రాథమిక విద్యా వ్యవస్థలో ఒక్క ఉపాధ్యాయుడు అయిదు తరగతులకు సంబంధించి 18 సబ్జెక్టులను బోధించడం అసాధ్యమైన పని. అలాగే 90కు పైగా విద్యార్థులు ఉన్న బడుల్లో 2-3 ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్న పాఠశాలలు 15 శాతం వరకు ఉన్నాయి. ఈ లెక్కన ప్రాథమిక పాఠశాలల్లో గుణాత్మక విద్య అందని ద్రాక్షగా మారింది. మరోవైపు ప్రయివేటు బడులు పల్లెలకు సైతం వాహనాలను సమకూర్చి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తున్నాయి. ఫలితంగా సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య క్రమేపి తగ్గిపోతున్నది. అసలే ఉపాధ్యాయులు లేక అల్లాడుతున్న ప్రాథమిక పాఠశాలలో ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా అంతర్గత హేతుబద్ధీకరణ జరిపి దాదాపుగా 2624 ఉపాధ్యాయ పోస్టులను చూపెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల నుండి నాణ్యమైన బోధన ఎలా ఆశించగలం?
ఇటీవల రాష్ట్రంలో జరిగిన బదిలీలు పదోన్నతుల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న 50808 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల్లో 25036 బదిలీ అయ్యారు కానీ కేవలం బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో 50శాతం మంది మాత్రమే స్థానచలనం పొందినారు. రాష్ట్ర ప్రభుత్వం 2021 లో జారీచేసిన హేతుబద్ధీకరణ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయులు బదిలీ అయిన రిలీవ్ కాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో, మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయులు పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎక్కువ మొత్తంలో ఖాళీలు ఏర్పడుతున్నవి. ఈ పరిస్థితుల్లో ప్రతి జిల్లాలో జిల్లా , మండల కమిటీలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఎస్జీటీ బదిలీల్లో భాగంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులను హేతుబద్దీకరణ చేశారు. కానీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న బడుల్లో మాత్రం సంఖ్యకు తగ్గ ఉపాధ్యాయులను ఇవ్వలేదు. దీంతో ఇటువంటి పాఠశాలలో కూడా విద్యార్థుల సంఖ్య అంతకంతకు తగ్గుతోంది.
రాష్ట్రంలో వారం రోజుల్లో జరగనున్న డీఎస్సీ ద్వారా దాదాపు 11వేల మంది టీచర్లు రానుండటం శుభపరిణామం. అయినా ఇటువంటి ప్రాథమిక బడుల్లో ఇంకా ఎక్కువ మొత్తంలో ఉపాధ్యాయులు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం 2021 ఆగస్టు నెలలో జారీచేసిన జీవో ఎంఎస్ 21హేతుబద్దీకరణ మార్గదర్శకాలను మార్చాలి. 20 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను 20-50 మంది ఉన్న పాఠశాలలకు ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కేటాయిం చాలి. 50 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యా యుని నియమిస్తూ ఒక ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎంను నియమిస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందు తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయు లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తే అన్ని వర్గాల విద్యార్థులకు విద్యను అందించవచ్చు. పునాది బలంగా లేని ఇల్లు మన్నిక ప్రశ్నార్థకం అయినట్లే పాఠశాల విద్యలో పునాది అయిన ప్రాథమిక విద్యను విస్మరిస్తే చదువులు బలహీనపడుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సత్వరమే విధానపరమైన కీలక నిర్ణయాలను ప్రకటించాలి. బాలల బంగారు భవితను ఆవిష్కరించే దిశలో వడివడిగా అడుగులు వేయాలి.
– అంకం నరేష్, 6301650324