గాజాపై యుద్ధ పడగనీడ ఇంకెంతకాలం?

How long will the war on Gaza last?శాంతి సమభావం సమిష్టిక్షేమం ఈనాటి యుగధర్మంగా అభివర్ణించాడు మహాకవి శ్రీశ్రీ. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఆధునిక యుగంలో ఈ మానవధర్మాలకు కట్టుబడి ఉండాల్సిందేనని ఆ వాక్య తాత్పర్యం. యుద్ధో న్మాదం ఓ మానసిక అంటువ్యాధి అని, కాపట్యం ఉన్నచోట శాంతి సాధించుట అసాధ్యమని మహా రచయిత టాల్‌స్టారు పేర్కొంటాడు. శాంతి సాధన నుండి పిరికితనంగా తప్పించుకోవడం కూడా యుద్ధోన్మాదం కిందకే వస్తుందని ఆయన తెలుపుతాడు.
ప్రస్తుతం గాజా విషయంలో జరుగుతున్నదదే. ఇజ్రాయిల్‌-హమాస్‌ మధ్య తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సంక్షోభంలో పడటం అందుకు తార్కాణం. ఆదివారం నుండి ఈ ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇంతలోనే తనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు అడ్డం తిరిగాడు. ప్రత్యర్థి హమాస్‌ మరిన్ని రాయితీలు పాందేందుకు ఒప్పందంలోని కొన్ని అంశాలనుండి వెనక్కి తగ్గుతున్నదని ఆరోపణ చేశాడు. కానీ ఏయే అంశాల్లో వెనక్కి తగ్గుతున్నది అంటే మాత్రం సూటిగా స్పష్టంగా ఆయన చెప్పడు. దీంతో మధ్యవర్తిత్వం నెరుపుతున్న ఖాతర్‌తో పాటు మిగిలిన ప్రపంచం అంతా నెత్తి పట్టుకోవాల్సి వచ్చింది.
ఒప్పందం కుదిరిందని ఖాతర్‌తో పాటు అమెరికా ప్రెసిడెంట్‌ జోబైడెన్‌ కూడా ప్రకటించారు. మరి ఇంతలోనే ఈ పిడుగుపాటు ఏమిటి? అసలు గాజా నుండి ఇజ్రాయిల్‌ సైనికదళాలు పూర్తి ఉపసంహరణకు యుద్ధో న్మాది నెతన్యాహు సిద్ధంగా లేడనే విషయం తెలుస్తున్నది. బుధవారం రాత్రి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరందని తెలియగానే పాపం పాలస్తీనియులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. యుద్ధ పడగనీడ వీడబోతున్నదని, తాము కుడా ఇతర ప్రజానీకం మాదిరి సుఖశాంతులతో పనిపాటలతో హాయిగా జీవించవచ్చునని ఆశపడ్డారు. కాని ఆశించినంత సేపు పట్టలేదు. ఆశా బుడగ చిటికలో పేలిపోయింది. ఆశాభంగమైంది.
మరోవైపు గాజా శాంతి ఒప్పందాన్ని భారత్‌, రష్యా, చైనా, బ్రిటన్‌తో సహా పలుదేశాలు స్వాగతించాయి. గాజాకు 123 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు ఐరోపా యూనియన్‌ ప్రకటించింది కూడా. కానీ గాజాపై ఇజ్రాయిల్‌ అమానుష దాడులు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా జరిపిన దాడుల్లో 72మంది మృతిచెందినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిసింది. 2023 అక్టోబరు 7న ‘హమాస్‌’ ఇజ్రాయిల్‌పై దాడి చేయ డంతో 1200 మంది మృతి చెందారు. 251 మంది బంధీలుగా పట్టుకుపోయారు. వీరిలో కొందరు ఇప్పటికే విడుదల కాగా మరికొందరు మరణించారు. ఇంకా 62 మంది సజీవంగా ఉన్నట్టు అంచనా. దాదాపు 15 నెలలుగా సాగు తున్న ఈ యుద్ధదాడిలో 46 వేల మందికి పైగా పాలస్తీనియులు మరణించడం గమనార్హం. వీరిలో సగం మందికి పైగా స్త్రీలు, పిల్లలే ఉన్నారు. లక్షా పదివేలమంది క్షతగాత్రులయ్యారు. ఇజ్రాయిల్‌ సైనికులు 840 మంది మృతి చెందితే, హమాస్‌ మిలిటెంట్లు 17 వేలమంది చనిపోయారనేది సమాచారం. పదివేలకు పైగా రాకెట్‌ దాడులు జరిగాయి. గాజా భూభాగం నేడు తొంబై శాతం ఇజ్రాయిల్‌ ఆక్రమణలో ఉన్నది.
‘ఇజ్రాయిల్‌ – హమాస్‌ మధ్య 96 గంటల పాటు చర్చలు జరిగాయని, సుదీర్ఘమైన కసరత్తు చేయడం ద్వారా ఒప్పందం సాకారం అయింది’ అని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అంటుంటే, ‘నేను అమెరికా అధ్యక్షునిగా పదవి స్వీకరించే నాటికి (జనవరి 20) బంధీలకు స్వేచ్ఛ లభించకపోతే సర్వనాశనం కావడం ఖాయమని హెచ్చరించడం వల్లనే ఒప్పందం కుదిరిందని డొనాల్డ్‌ ట్రంప్‌ అంటున్నాడు. అంటే అమెరికా గుప్పెట్లోనే ఇజ్రాయిల్‌ ఉన్నదనే సంకేతం అర్థమవుతున్నది. అమెరికా, ఇజ్రాయిల్‌ పాలక వర్గాల యుద్ధోన్మోదం ప్రపంచ ప్రజలకు తెలియంది కాదు. ఆ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా అనేక దేశాల్లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నా వారికి చీమకుట్టి నట్టయినా ఉండటం లేదు. ఇంతకన్నా పెనువిషాదం ఏముంటుంది? ప్రస్తుతం కాల్పుల విరమణ లేదు. యుద్ధదాడి జరుగుతూనే ఉన్నది. మానవ హననం, విధ్వంసం సాగుతూనే ఉన్నది. తొలిదశంగా తాత్కాలిక కాల్పుల విరమణ జరిగితేనే, మలిదశలో శాశ్విత శాంతి పథం వైపు అడుగులు పడుతాయి. అప్పటివరకు గాజు ప్రజల ప్రాణాలు యుద్దోన్మాదుల పడగనీడలోనే ఉంటాయి.
– కె.శాంతారావు, 9959745723