అమెరికా నుంచి ఇండియాకు వచ్చినప్పుడు కేటీఆర్‌ ఆస్తులెన్ని?

అమెరికా నుంచి ఇండియాకు వచ్చినప్పుడు కేటీఆర్‌ ఆస్తులెన్ని?– ఇప్పుడు మీ సంపద ఎంత..? దీనిపై చర్చకు సిద్ధమా.? : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అమెరికా నుంచి ఇండియకొచ్చినప్పుడు మీ ఆస్తులెన్నీ..? దానిపై చర్చకు సిద్ధం..మీరు చర్చకు సిద్ధమా? సవాల్‌ స్వీకరిస్తావా? అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. మహబూబ్‌ నగర్‌ తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తులెన్ని, ప్రస్తుత ఆస్తులెన్ని? కేటీఆర్‌ లీగల్‌గా ఫైట్‌ చేద్దామా? అని సవాల్‌ విసిరారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టెలిగ్రాఫ్‌ యాక్టు ప్రకారం ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం దేశ ద్రోహం అన్నారు.
మీ ప్రవర్తన వల్ల రాష్ట్ర పరువు పోయిందని విమర్శించారు. కేటీఆర్‌ మీకు పరువుందా? పరువు నష్ట దావా వేసే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని చెప్పారు. కేసీఆర్‌, కేటీఆర్‌ మాటలు రాజరిక దర్బారును తలపిస్తున్నాయని విమర్శించారు. ఆ దర్బార్‌ మాటలు విని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టినా వారికి సిగ్గు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌ రూపంలో ప్రయివేటు సైన్యాన్ని కేసీఆర్‌ పెంచి పోషించారని విమర్శించారు. ఆ సైన్యంతోనే పోన్‌ ట్యాపింగ్‌ చేయించారని ఎద్దేవా చేశారు. ఆ సైన్యమే ఒక్కొక్కటిగా బయట పెడుతున్నా…కేటీఆర్‌ ఇంకా ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు.