ఎన్ని కళలో కదా! ఎన్నికల జూదమున
భరతాంబ కలలన్ని భగమయ్యేటట్లు!
ఎన్ని కలలో కదా! ఎన్నికల మాటునను
దాగున్న రాకాసి దాహంపు కళ్ళలో!
ఎన్ని కలలో కదా! ఎన్నికల క్రీడలో
బతుకారిపోయినా భారంపు కళ్ళలో!
ఎన్ని కలలో కదా! ఎన్నికల నీడలో
సేదదీరెడి మహా శ్రీమంతు నయనాల!
ఎన్ని కలలో కదా! ఎన్నికల జాడలో
ఉద్యోగ,కార్మికుల ఊహించు కళ్ళలో!
మానిఫెస్టోలతో మాయలూ,మచ్చికలు
హిప్నటైజును చేసి ఇల జూపెదరు దివిని
ఓటర్లనందరను మాటల్తొ కట్టేసి
వాటేసుకుంటారు, ఓటేసుకుంటారు
కులమతాలవారీ కూటముల నేర్పరచి
ఓటు బ్యాంకును చేసి ఓటమిని రానీరు
పంచి పెట్టినదంత పదియింతలై వచ్చు
కళలన్ని చూపించి కలదీర్చుకుంటారు
ఎంతైన దోచొచ్చు! ఎంతైన దాచొచ్చు!
రాజునడిగే రూలు రాజ్యాంగమునె లేదు!
ఓటు వేసేముందు ఓసారి యోచించు
వెలగబెట్టేదెవరొ! వెలుగునిచ్చేదెవరొ!
ఓటరన్నా! నీదు ఓటులోనే యుంది
బంగారు భవిష్యత్తు పరిమళించెడి రీతి…
– డా||అడిగొప్పుల సదయ్య, 9963991125