ప్రజాపాలన గ్రామసభల్లో లబ్ధిదారుల అసహనం
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్
ప్రభుత్వం అందించే పథకాలకు ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకుంటే ఇస్తారూ…? అయ్యా..! అని మండలకేంద్రంలో మేజర్ గ్రామపంచాయితీ ఆవరణలో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో లబ్ధిదారులు అసహనానికి గురై ఓవ్యక్తి నేరుగా దరఖాస్తు ఫారంను అధికారులపై విసిరేశారు. రాష్ట్రప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి క్షేత్రస్థాయిలో సమావేశం, విచారణ జరిగింది. బుధవారం నియోజక వర్గ పరిధిలోని పలుపంచాయతీల పరిధిలో గ్రామ సభలు నిర్వహించగా రసాభాసగా మారాయి. పలుచోట్ల అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన గ్రామసభలో లబ్ధిదారుల పేర్లు లిస్టులో రాకపోవడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసాయిదా జాబితా పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. కొందరూ మహిళలలైతే తాము దిక్కు మొక్కు లేక జీవనం దుర్భరంగా తయారయ్యిందని, ఉన్నోళ్లకే, భూములు, పలుకుబడి, రాజకీయ అండదండలు ఉన్నవారి పేర్లు లిస్టులో వచ్చాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎంపిక పారదర్శకంగా జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని గ్రామసభలో అధికారులను హెచ్చరించారు.