సినిమాల్ని చూసి రాజకీయ నాయకులు డైలాగులు కొడ్తరో, రాజకీయ నాయకుల్ని స్టడీ చేసి సినిమాల్లో డైలాగులు రాస్తున్నారో తెలీదు కాని నవంబర్ 30న జరిగే వార్ వన్‌సైడేనని బీఆర్‌ఎస్ బాస్ చెప్తూనే ఉన్నారు. ఓట్ల యుద్ధంలో క్షీర, నీరన్యాయం చెప్పడానికి ఓటర్లందరూ హంస లవ్వాల్సిందే!
మహా భారత యుద్ధంలో పద్మవ్యూహాలు, గరుడ వ్యూహాలు, నాగ వ్యూహాలు పన్నేవారనేది పురాణ గాథ. ఆధునిక కాలంలో విమానాల ద్వారా ‘కార్పెట్ బాంబింగ్’ వచ్చిన తర్వాత ఇరాక్ దగ్గరున్న స్కడ్ మిస్సైల్స్ వేస్ట్ కాలేదా? అమెరికా సద్దాం హుస్సేన్‌ను చంపకుండా ఆపలేకపోయింది కదా!? ఆ సంగతులెలా ఉన్నా, ఇపుడొచ్చింది ఓట్ల యుద్ధం. దీన్లో ప్రధాన పార్టీలు పాలనకు సంబంధించిన అంశాలు కాకుండా ప్రజలపై తాయిలాలు విసరడానికి పోటీ పడితే జనం ఐదేళ్ళకొకసారి విరిసే ‘చంద్రు’ని వెన్నెల కోసం ఎదురు చూసే చకోర పక్షులవరా? ప్రజల్ని, ముఖ్యంగా పేదల్ని కురిసే వాన చినుకులకై నిరీక్షించే ఆల్చిప్పలుగా మిగల్చాలని పాలకుల పద్మవ్యూహం. అభిమన్యులుగా దాన్లో దొరికిపోయి, చనిపోతారో సదరు పద్మం ఉరఫ్ కమలం రేకులు వెనక నుండి కమ్ముకోకుండా ఒక్కో దాన్ని రాలగొట్టుకుంటూ జనం ధనుంజయునిలా ముందుకు సాగుతారని ఆశిద్దాం.
కాని గులాబీ శ్రేణుల వ్యవహారం ఆ విధంగా కనపడటం లేదు. తన సంక్షేమ చర్యలు, అంటే పంచే తాయిలాలు తమని అందలమెక్కిస్తాయని బాస్‌కు విశేషమైన నమ్మకం. ఆ తారక మంత్రం జపిస్తే బొందితో కైలాసానికి పోవడం ఖాయమని ప్రగాఢ విశ్వాసమాయనకి. శిష్య పరమాణువు లకు నిరంతరం నూరిపోసేది కూడా అదే. కానీ, మెదక్ పార్లమెంటు సభ్యుడు దౌల్తాబాద్‌లో ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొంటూ హిందూత్వ పరిరక్షణలో తాను భాగస్వామినౌతానని ప్రవచించారు. గులాబీ చెట్టును లోపలి నుండి చెద పురుగులు డొల్ల చేస్తున్నాయి. పారాహుషార్! పెస్ట్ కంట్రోల్ చర్యలకుప క్రమించకపోతే బీజేపీ గురించి మీరేసే రంకెలకు అర్థమే లేకుండా పోతుంది. ‘హిందూత్వ పరిరక్షణంటే సదరు ఎంపీకి ఏమర్థమైందో గానీ, ఆరెస్సెస్ వారి అర్థమేమంటే దేశంలో కులవ్యవస్థను పునరుజ్జీవింప చేయ డం. అగ్ర కులాధిపత్యానికి తెర తీయడం. దానికి అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం. ఈ విషయాలను అర్థం చేసుకోకుంటే అభిమ న్యుని పాత్ర విజయవంతంగా పోషించే పనిలో బీఆర్‌ఎస్ ఉందనుకోవాల్సి వస్తుంది.
రాష్ట్రంలో మత ఘర్షణలు లేకుండా చూడ గలగడం చిన్న విషయ మేమీ కాదు. అందుకు బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని అభి నందించాల్సిందే. అయితే కేవలం పాలనాపరమైన చర్యల ద్వారానే లౌకికవాదం రాష్ట్రంలో పరిఢవిల్లదు. ఆరెస్సెస్‌కు అంటకాగే నేటి దుబ్బాక అభ్యర్థి లాంటి వారు ఎందరున్నారో?! లేకుంటే దుబ్బాక లో ప్రస్తుతం బీజేపీ శాసనసభ్యుడుంటేనేమి, బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తేనేమీ? రాష్ట్రానికి పొంచి ఉన్న ఈ ప్రమాదం గులాబీ దళపతి గుర్తించారో లేదో?
కీలక విషయం రాష్ట్రంలో పేరుకుపోయిన కార్మి కుల, వ్యవసాయ కార్మి కుల, కౌలు రైతుల సమస్యలు. అసలు కౌలు రైతుల్ని గుర్తించనే గుర్తించనని తెగేసి చెప్పిన కేసీఆర్ ‘గుండె ధైర్యం’ గొప్పదే! వారి సంఖ్య తెలంగాణలో16 లక్షలు. 30 శాతం భూమి వారి ఆధ్వర్యంలోనే ఉంది. విదేశా ల్లోని భూ యజమానులు, ఉద్యోగాలు చేసుకునే సార్లకు రైతు బంధు అందుతుండగా కౌలుదారులకివ్వనని భీష్మించుకోవడం ఏ విధంగా సబబో గులాబీ దళపతి చెప్పాలి. సుమారు కోటి మంది కార్మికులకు కనీస వేత నాలు నిర్ణయమే చేయలేకపోతున్నదీ ప్రభుత్వం. గత 15 ఏండ్లలో కనీస వేతనాలు పెరిగుంటే ప్రభుత్వాలు విసిరే ముక్కల కోసం జనం వెంపర్లాడరు కదా! దళితులు, వారి సమస్యలు గుర్తించి దళిత బంధు స్కీం పెట్టడం మంచిదే. కాని అదే సర్వరోగ నివారిణి అయినట్లు చెప్పుకోవడం ఆశ్చర్యమేస్తుంది. రాష్ట్రంలోని 18 లక్షల దళిత కుటుంబాల్లోనూ ఇప్పటివరకు అందింది 30 వేల మందికి. 2023 -24 బడ్జెట్‌లో కేటాయించిన రూ.17,700 కోట్లలోనూ నేటికి ఒక్క పైసా విడుదల కాలేదు. ఈ లెక్కన ఎన్ని ఏండ్లకి 18 లక్షల మందికి అందుతుందో గులాబీ నేతలు ఆలోచించాలి.
గొర్రెలు, బర్రెలు ఇవ్వడం ఓట్లు రాబట్టుకోవడం గతంలో ఇందిరమ్మ కాలంలోనూ జరిగాయి. ‘ఊరికొక కోడి అంటే ఇంటికొక ఈక’ అన్న నర్రా రాఘవరెడ్డి ఫేమస్ డైలాగు ఈ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యం పొందింది. అయినా నేడు కౌలుదార్లను, వ్యవసాయ కూలీలను కూడా కాంగ్రెస్ గుర్తించడం కీలక విషయం. మహిళ లకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇండ్లల్లో పని చేసుకునే మహిళ లకు బాగా ఉపయోగడుతుందనడంలో ఆశ్చర్యం లేదు. హిమాచల్ లో అధికారంలోకొచ్చిన మరుక్షణం సి.పి.ఎస్. ను కాంగ్రెస్ రద్దు చేసింది. రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లలో రద్దు చేశారు. కుల గణన చేప డ్తామని మొన్న హైదరాబాద్‌లో జరిగిన సిడబ్ల్యూసీ నిర్ణయించింది. కొన్ని పాజిటివ్ వర్గ సమస్యలివి. మిగతావి ఆచరణలో చూడాలి. ఏమైనా మా మేనిఫెస్టోను మీరు కాపీ కొట్టారంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఒకర్నొకరు దుమ్మెత్తి పోసుకోవడం కంటే ప్రజలకి ఏ విధంగా మంచి పాలన అందిస్తారో చెప్పుకోవడం సబబుగా ఉంటుంది.