ఇంటి ముందు కూరగాయల బండి వద్ద టమాటాలు కొని లోనికి వస్తున్న శిరీషకు భర్త భాస్కర్ బైక్ స్టార్ట్ చేస్తూ కనబడతాడు. ‘ఏవండీ షాప్ నుంచి మధ్యాహ్నం భోజనానికి వచ్చేప్పుడు కాటుక కొనుక్కురండి. ఇంట్లో కాటుక నిండుకుంది’ అంది. ‘ఆ….. ఏంటి’ అని భాస్కర్ అర్థం కానట్టుగా మరొకసారి అడిగేసరికి ‘పెట్టుకుందామంటే కళ్ళ కాటుక అయిపోయింది. మరచిపోకుండా తీసుకురండి’ అంది. ‘అలాగే ఇంకా…’ అని భాస్కర్ అడిగేసరికి ‘మూరెడు మల్లెపూలు, జానెడు జాకెట్టు ముక్క కూడా’ అని సాంప్రదాయ స్త్రీత్వం ఉట్టిపడేలా పలికింది.
శిరీష కు 28 సంవత్సరాలు. భాస్కర్ కు 30 సంవత్సరాలు. ఇద్దరికీ పెళ్లయి ఏడేండ్లు. ఇద్దరివి మధ్యతరగతి సాంప్రదాయ కుటుంబాలు. వీళ్లిద్దరమ్మాయిలు పక్క కాలనీలోని ప్రైవేట్ స్కూల్లో నర్సరీ, యూకేజీ చదువుతున్నారు. శిరీష టీవీ చూస్తుంటే నీ కాటుక కన్నులు చూడకపోతే నిదురే రాధమ్మ……. అనే పాట వస్తుంటే తన్మయత్వానికి లోనై నా భర్త కూడా మా పెళ్లయిన కొత్తలో ఈ పాట పాడి నన్ను కవ్వించేవాడు అని గుర్తు చేసుకుంది. అవును ఈ పాటలు మాటలు చెబుతూనే నా కళ్ళలోకి చూస్తూనే నన్ను మాయ చేశాడు. లోలోన సిగ్గుపడుతూ ఇద్దరు అమ్మాయిల తల్లిని చేశాడు అని మధ్యాహ్నపు వంట చేసుకుంటూ అద్దంలో చూసుకుని నేను ఎంత చదివినా చాటంత వుండే నా కళ్ళు పెళ్లయ్యాక ఇలా నిస్తేజంగా అయ్యాయి. ఆ భగవంతుడు కూడా ముగ్గురు ఆడపడుచులు వచ్చి పోయే ఇంటికి నన్ను కోడల్ని చేశాడు. బహుశా….. ఆ దేవునికి కూడా నన్ను చూస్తే కన్ను కుట్టిందేమో. ఆయన దొరసాని మాత్రమే కళ్ళనిండా కాటుకతో మెరిసిపోవాలని అనుకున్నాడేమో…… పెద్ద గొప్పే. అని దేవుని పటాల కేసి చూసి మూతి తిప్పుకొని వంట గదిలోకి వెళ్ళింది. అందరి ఆడవాళ్ళలాగే పైకి గునుక్కుంటూ మనసులో తన సంసారానికి సంతృప్తి చెందుతూ.
ఉదయం 11 గంటలకి మధ్యలో భాస్కర్ శిరీషకు షాప్ నుంచి ఫోన్ చేసి ఇంకా ఏమైనా ఐటమ్స్ తేవాలా అని అడిగితే ఇంకేమీ అక్కర్లేదు అని శిరీష సమాధానం ఇవ్వగా సరే అని ఫోన్ పెట్టేసి షాప్ కట్టేసి ఫాన్సీ స్టోర్ ఉన్న కాలనీ వైపు బైక్ మీద వెళ్లాడు. భాస్కర్‌ది సహజంగానే మధ్యతరగతి మనస్తత్వం, కలుపుగోలుతనం. స్నేహించే హృదయం కలవాడు కనుక ఫ్యాన్సీ షాప్ దగ్గరలో రోజు వచ్చే వాటర్ ట్యాంక్‌తో ఉన్న ట్రాక్టర్ దగ్గర మహిళలు నీళ్లు పట్టుకుంటుంటే ఎండను చూసి తట్టుకోలేక వారందరికీ గబగబా బిందెలతో నీళ్లు పట్టిస్తూనే పక్కనే కిల్లి కొట్టు దగ్గర కూర్చున్న ఆ కాలనీ ప్రెసిడెంట్ చారి గారిని పలకరించాడు. వెంటనే భాస్కర్ ని ఉద్దేశించి ప్రెసిడెంట్ ‘ఏం భాస్కర్ పండగ అంతా నీ సంసారంలోనే ఉన్నట్టుంది’ అనగానే భాస్కర్ మనసులో ఇప్పుడేం పండగ ఉందబ్బా దగ్గరలో అని అనుకున్నాడు. వెంటనే పక్క నుంచి బిందె పట్టుకుని వెళుతూ భాస్కర్ సంసారం ఎరిగిన అదే వీధిలోని పెద్దావిడ ‘అవునండి భాస్కర్ అదృష్టవంతుడండి’ అనుకుంటూ వెళ్ళింది. భాస్కర్ కి అర్థం కాక చిరునవ్వుతో బదిలిచ్చి మళ్ళీ బైక్ స్టార్ట్ చేశాడు ఇంటికని.
వీధి మలుపులో వరుసకు మరదలు అయ్యే ప్రభావతి ఎదురుపడి సిగ్గుగా నవ్వి పక్కకు తప్పుకుంది. భాస్కర్ మరోసారి అయోమయంలో పడ్డాడు. ఏమైంది వీళ్ళందరికీ…… ఎందుకు ఏదోలా ప్రవర్తిస్తున్నారు అని ఒక నిమిషం ఆకాశానికేసి చూశాడు. బాగా ఎండగా అనిపించి ముందుకు సాగాడు. ఇంకో రెండు వందల మీటర్లు దాటితే ఇంటికి చేరుతాడు అనే లోపు బాల్యమిత్రుడు ఆర్.కె.రావు సెలూన్‌లో నుంచి బయటకు వస్తూ కనిపించాడు. భాస్కర్ ఎక్కడి నుంచి అని అడిగాడు. దానికి బదులుగా భాస్కర్ ‘ఫాన్సీ స్టోర్ నుంచి… మేడం…. ఐటమ్స్ తెమ్మని చెబుతాను’ అన్నాడు రావుగారితో పరధ్యానంగా. అదేంటి భాస్కర్ అంత పరధ్యానంలో ఉన్నావు అని రావుగారు మరొకసారి అడిగాడు. భాస్కర్ ఏమీ లేదు రావుగారు… నేను షాప్ నుంచి వస్తుంటే మన కాలనీ ప్రెసిడెంట్, మా మరదలు నాతో ఏదోలాగా ప్రవర్తించారు. అంటే ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు. రావు కూడా నవ్వబోతుంటే, ఆపరా బాబు నవ్వకు. నువ్వెందుకు నవ్వుతున్నావో చెబితే నేను నవ్వుతాను కదా అన్నాడు భాస్కర్. దానికి సమాధానంగా భాస్కర్ భుజాన్ని తడుతూ పిల్లల్ని స్కూల్ నుంచి లంచ్ కి తీసుకొచ్చే టైం అయింది సాయంకాలం కలుద్దాం అంటూ రావు వెళ్లిపోయాడు. భాస్కర్ కూడా ఇంటికి చేరాడు. శిరీష చెప్పినట్టుగానే కాటుక, జాకెట్ ముక్క, మల్లెపూలు, పిల్లలు తింటారని పండ్లు చాక్లెట్లు వగైరా పట్టుకొచ్చాడు.
శిరీష టేబుల్ మీద వంటకాలు సర్ది భర్తను ‘అన్నం వడ్డిస్తాను రండి’ అంటూ బాల్కనీలో నిలబడి వీధిలోకి చూస్తుంది. భాస్కర్ భార్య కళ్ళభాషణ గమనిస్తూ ‘నేను వచ్చాగా ఇంకా ఎవరి కోసం నీ చూపులు వీధికి ఎక్కాయి డియర్ అంటూనే అంతగా ఎదురుచూపులు చూసే చూపుకి కళ్ళు వేడెక్కుతాయి. రా కాటుకదిద్దుకుందువు’ . అని చేతికి కాటుక ఇవ్వబోయాడు. శిరీష భాస్కర్‌ని ‘ఆగండి భార్య కళ్ళకు కాటుక పెట్టుకునే సమయంలో భర్త భార్యను చూడవద్దని శాస్త్రం చెబుతుంది’ అని ఆపింది. శిరీష అద్దంలో చూసుకుంటూ తన కళ్ళకు అందంగా కాటుకదిద్దుకుంది. భర్తకు అన్నం వడ్డించింది. భాస్కర్ తినేముందు ఇద్దరు పిల్లలను గుర్తు చేసుకొని ‘లంచ్ బాక్స్ పంపించావా’ అని అడిగిన దానికి బదులుగా శిరీష ఆ అని తలూపింది. డైనింగ్ హాల్ లో ఉన్న కిటికీ నుంచి వీధిలోకి చూస్తూ. భాస్కర్ తినడం అయ్యాక బయట బాల్కనీలో ఉన్న చెక్కబల్లా మీద రెండు మెత్తని దిండ్లు ఒకదానిమీద ఒకటి పేర్చి మెడ కింద కాస్త ఎత్తుగా ఉండేలా సరిచేసుకొని ఒరిగాడు. ఒక నిమిషకాలం శిరీషను చూస్తూనే ‘ఇందాక బయట మా చిన్నాన్న కోడలు అదే మా మరదలు ప్రభావతి కనిపించింది నేను చిరునవ్వు ఇచ్చేలోపే తను కాస్త సిగ్గుతో నవ్వినట్టుగా తప్పుకుంది. ఎందుకంటావ్?’ అన్నాడు. శిరీష కళ్ళ భాష మాత్రం వీధికే అంకితం చేసింది. ‘శిరీషా… ఆ కొట్టే సైట్ ఏదో నాకు కొడితే బాగుంటుంది’ అన్నాడు భాస్కర్. ‘రామచంద్ర… అవేం మాటలు’ అని శిరీష అనగానే, భాస్కర్ ‘అంతే కదా… మరి నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో ఆలోచిస్తుంటే ఇలానే అంటారు మరి’ అన్నాడు. ‘సారీ అండీ’ అంటూ భాస్కర్ కి దగ్గరగా కూర్చుంది శిరీష భర్త మాటలు ఆలకిస్తున్నట్టుగా.
అప్పుడు వెంటనే నెల క్రితం దింపిన పిల్లలిద్దరి ఫోటోలను ఫ్రేమ్ చేసి తీసుకొచ్చాడు ఫోటోగ్రాఫర్. రెండింటికి 500 రూపాయలు బిల్లు ఇచ్చేసాడు భాస్కర్. ఫోటోల వంక చూస్తూ ‘మనిద్దరమ్మాయిల కళ్ళు ఎంత చక్కగా ఉన్నాయి అచ్చు మా అమ్మ కళ్ళలాగే’ అని భాస్కర్ అమ్మని గుర్తు చేసుకున్నాడు. ‘అవును మీరు నడిపే చిన్న జిరాక్స్ సెంటర్ కి మీ చుట్టూ 12 కళ్ళు చేరాయి సరిపోలేదు కదూ. 14 అయితే బావుండు. అవును మీ అమ్మగారు కూడా ఉండాల్సింది’ అని నవ్వుతూనే వెటకారంగా అన్నది .తన కళ్ళని కాకుండా తన అత్తగారి కళ్ళను కూతుళ్ళ కళ్ళతో పోల్చి మెచ్చుకునేసరికి.
భాస్కర్ కూడా నవ్వుతూనే ‘సగటు కోడలు, సగటు మహిళవు అనిపించుకున్నావులే’ అన్నాడు. ‘అంతే కదా… నెలకో పండగొచ్చినప్పుడల్లా వారం రోజులు ఇక్కడే ఉండే మీ అక్కలు మేనకోడల్లు వాడే కాటుక ఖరీదు భరించగలమా. వాళ్లకేంటి అదృష్టవంతులు. ముగ్గురికి లోటు లేదనకుండా వాళ్లు వీళ్లు పుట్టారు’ అని కాస్త వాడిగానే అన్నది శిరీష.
‘సర్లెండి నా మాటలకేం కానీ కాసేపు పడుకోండి’ అని ఇంట్లో కెళ్ళి పనిలో పడింది శిరీష. అలా మధ్యాహ్నం మూడు గంటలు అయింది. పిల్లలను తీసుకొచ్చే టైం అయిందని భాస్కర్ స్కూల్ కెళ్ళి కూతుళ్లను తీసుకొచ్చాడు. భార్యాభర్తలిద్దరూ ఇంటి పని పిల్లల పనిలో పడిపోయారు. సాయంకాలం ఐదు గంటల సమయంలో టీ తాగుతూ శిరీషతో భాస్కర్ మరొకసారి ‘ప్రెసిడెంట్ చారి, బాల్యమిత్రుడు రావుగారు ఎందుకు నవ్వారంటావు’ అన్నాడు. శిరీష మళ్ళీ ఏమీ పట్టనట్టుగా ఫ్రిడ్జ్ సర్దుకుంటూ ‘మీరేంటండి… పూలు మూరెడు అంటే మూరెడు తెచ్చారు. అయినా మీ మగవారికి మా అవసరాలు ఎలా చెబితే అర్థం అవుతాయో’ అని గునుక్కుంది. ‘ఏమిటో నీ తీరు’ అనుకుంటూ భాస్కర్ జిరాక్స్ సెంటర్ కి వెళ్ళాడు.
పిల్లలిద్దరూ బాల్కనీలో ఆడుకుంటుండగా సుమారు 6 గంటల సాయంకాల సమయంలో శిరీష ఎదురుచూపులు చాలించేందుకు వీలుగా శిరీష అమ్మ, అక్క, ముగ్గురు ఆడపడుచులు వారి పిల్లలతో భాస్కర్ ఇంటికి చేరారు. రేపటి ఏర్పాట్లకు తలా ఒక చెయ్యి వేసి కొన్ని పిండి వంటలు చేశారు. షాపు కట్టేసి భాస్కర్ ఇంటికి వచ్చి చూడగా పిండి వంటల వాసన, డోర్ చాటు నుంచి మామయ్య… అంటూ దోబూచులాటలా కేరింతలు. ఒక్కసారిగా షాక్‌కి లోనయ్యి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ఏంటా అని ఆరా తీసేలోపే… వంట గదిలో నుంచి ‘అల్లుడూ మన ఇంటికి ఇంకో 4,5 నెలల్లో 2 ఆల్చిప్పలంత కళ్ళు రాబోతున్నాయి. ఆ కళ్ళకు నా కూతురు పెట్టుకునే ఐదు రూపాయల ఐటెక్స్ కాటుక సరిపోదు. కాజల్ ఐకానికో, లాక్మీ షాడో పెన్సిలో పెట్టాలి. జేబు తడుముకో మరి’ అంది అత్తగారు. భాస్కర్ పట్టరాని సంతోషంతో ‘ఇందుకా ఇరుగుపొరుగు వాళ్ళ ఏకాసెకాలు’ అంటూ శిరీష కళ్ళలోకి చూడసాగాడు.
‘రేపు కాలనీలోని ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి అని ఈ పిండి వంటలు చేయించాను. మీకు నాకు కొత్త బట్టలు తీసుకొచ్చారు మా అమ్మ వాళ్లు’ అని శిరీష చెప్పబోతుంటే…
‘అవన్నీ సరే డియర్… నాకెందుకు నాలుగు నెలలుగా ఇంత మంచి విషయం చెప్పలేదు’ అని భాస్కర్ అన్నాడు.
దానికి శిరీష… ‘మనకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు’ అని కాస్త సంశయించబోతుంటే…
భాస్కర్ ‘ఇప్పుడేమైనా అమ్మాయని గాని అబ్బాయని గాని నీకు తెలిసిందా’ అని అంటూనే… ‘అయినా నేను కూతుళ్ళకే తండ్రిగా ఉండాలనుకునే నేటి తరపు మగవాన్ని’ అని అమ్మాయిల పట్ల ఎంతో స్పర్ధ ప్రకటించాడు. ‘చూడు నీకు తప్పకుండా ఈసారి నాలుగు కలువ కళ్ళ ముద్దుగుమ్మలు పుడతారు’ అని భాస్కర్ శిరీషను ఆటపట్టిస్తుంటే ఇంట్లో అక్కలు మేనకోడళ్లు, మేనళ్లుల్లతో సందడి వాతావరణం నెలకొన్నది.
‘రేపు ఉత్త వాయనాలే కాదు శ్రీమంతం చేస్తాను అంటూ శిరీష కళ్ళలోకి చూస్తూ కూతుళ్ల కళ్ళని, కళ్ళు చేసే నయనా నందకర నత్యాలను చూడటానికి మా తండ్రులు ఎప్పుడు 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటార’ని సెలవిచ్చాడు.
‘ఏం అత్తగారు సంతోషమేనా రేపు మొదటి బండికే మామయ్యను కూడా బయలుదేరమని చెబుతాను. ఇంతకీ….. మీరు చెప్పిన కొత్త రకం కాటుకల ఖరీదు ఎంత?’ అని అడగ్గా… పక్కనుంచి భాస్కర్ మేనకోడళ్ళు ‘మామయ్య… 120 రూపాయలు. లేదు 180 రూపాయలు’ అంటూ అల్లరి చేయడం మొదలు పెట్టారు.
‘కోటి రూపాయలైనా పర్వాలేదు. నా ప్రేమ ఖరీదు కన్నా వాటి ఖరీదు తక్కువే’ అనడంతో శిరీష భర్త ప్రేమకు బాధ్యతకు మంత్రముగ్ధురాలై కళ్ళు చెమర్చినదై మధ్యాహ్నం తెచ్చిన కాటుకని మరొకసారి స్వయంగా తన భర్త చేతితో దిద్దించుకుంది.
తర్వాత దేవుని పటాల దగ్గరికి వెళ్లి మనసులో నీ దొరసాని కళ్ళు మాత్రమే తేజో వంతంగా ఉండాలని కోరుకుంటున్నావు అని వక్రంగా ఆలోచించాను స్వామి. కానీ నీవు మాత్రం నాకు నా కాటుక కళ్ళు చూడకపోతే నిద్రపోలేని దేవుడు అంత మనిషిని ఇచ్చావు అని కతజ్ఞతలు చెప్పుకుంది.
– మృదుల పోరెడ్డి
6303909565