”మహిళల భద్రత ఎంతో ముఖ్యమైనది. మహిళలపై నేరాలు క్షమించరానివని ప్రతి రాష్ట్రానికి చెబుతున్నా. నేరస్థులు ఎవ్వరైనా సరే.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మహిళలపై నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత పటిష్ఠ పరుస్తున్నాం” ఇవి సాక్షాత్తు మన ప్రధానమంత్రి మోడీ చెప్పిన మాటలు. మహారాష్ట్రలోని లఖ్‌పతి దీదీ కార్యక్ర మంలో ప్రధానమంత్రిపై వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలోనే గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఇవిగో అంటూ ఒక జాబితా చెక్కర్లు కొట్టింది. ఆ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంటడం ఆందోళన కలిగిస్తోంది. కోల్‌కతా దారుణ లైంగికదాడి ఘటనో లేదంటే.. ఇటీవల కాలంలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాల వల్లనో స్పష్టమైన కారణం తెలీదు కానీ, ప్రధాని మాట్లాడుతున్న తరుణంలోనే ఇది జరగడం విశేషం.
అయితే ప్రధాని వ్యాఖ్యలు ఆహ్వా నించదగినవే గానీ, ఆచరణలో వారి ప్రభుత్వ తీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతుండటం గమ నార్హం. ఉన్నావో లైంగికదాడి నిందితుల విషయంలో గానీ, బిల్కిస్ బానో ఘటనకు సంబంధించిన నిందితులకు గానీ జైలు నుంచి ఘనస్వాగతం పలికి బయటకు తీసుకు వచ్చిందెవరు? అలాంటి వారిపై తీసుకున్న చర్యలేమిటి? ఇప్పటికీ రావణకాష్టంలా మండుతున్న మణిపూర్ దురాగతంలో వెలుగు చూసిన దారుణాలెన్ని? వాటిలో ఎన్నింటిపై మీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది? మీపార్టీ ఎంపీ మాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు మహాప్రభో కాపాడండన్న మహిళా మల్లయోధులకు వీరు చేసిన న్యాయమేమిటి? ఇలాంటి ప్రశ్నలు ప్రధాని మాటల్లోని చిత్తశుద్ధిని ఎత్తి చూపుతున్నాయి. సంఘటన ఏదైనా నిందితులను కాపాడటానికి పాలకులే ప్రయత్నించడం అత్యంత హేయం. పైగా డ్రెస్సింగ్ విధానమే ఈ దాడులకు కారణమనే ప్రవచనాలు వింటున్నాం. చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో మహిళల భద్రత గురించి ప్రధాని మాటలు కేవలం కంటితుడుపు చర్య అనే అభిప్రాయాలు సర్వసాధారణం.
సమాజంలో తలెత్తుతున్న కొన్ని సహించలేని ఘటనలు ఆవేదన కలిగిస్తాయి. చట్టాలెన్నున్నా ఆగకుండా సాగుతున్న ఆకృత్యాలపై ఏమీ చేయలేమా అన్న ఆక్రోశం రగిలిస్తాయి. ప్రకటనలు, ప్రచారార్బాటాలు తప్ప అఘాయిత్యాలపై పాలకులు ఏనాడూ నోరు మెదపడం లేదు. లేకపోతే నెలల చిన్నారులపై సైతం మృగాళ్ల అఘాయిత్యాలు ఎందుకు జరుగుతు న్నాయి? ‘ఈ దుశ్శాసన పర్వానికి ముగింపు ఎప్పుడు? పైగా అన్యాయం జరిగిందని గొంతెత్తి అరుస్తున్నా స్పందించని నేలపైన న్యాయం ఊసెత్తటమే అన్యాయమై పోతున్నది. దుష్ట సంస్కృతీ వారసత్వం నేటికీ సమాజాన కొనసాగుతూనే ఉన్నది. నాడు ‘భారతా’న ఒక్క దుశ్శాసనుడే ఉన్నాడు. నేడు వీధికొక్కడు కనపడుతున్నాడు. ఆధిపత్య పర్వంలో విహరిస్తున్నారు. ‘బేటీ పడావ్ బేటీ బచావ్’ నినాదం నేడు దేశపు నడి వీధిలో అణచివేయబడి హాహాకారాలు చేస్తున్నది. స్త్రీలను శక్తులుగా కొలిచే దేశం మనదని గొప్పలు చెప్పుకునే సాంస్కృతిక ప్రచార పటాటోపంలో ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అని నొక్కి వక్కాణిస్తున్న తీరుకు కించిత్ విచారమూ ప్రకటించము. పాలకులే ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల పేరుతో స్త్రీని సొంతఆస్తిగా, బానిసగా చూస్తోంటే… ఈ దుష్టత్వానికి అంతమెప్పుడు!
లైంగికదాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు హర్యానాలో ఎన్నికల వేళ పదేపదే పెరోల్ ఇస్తూ పోతుంటాం. గత నాలు గేండ్లలో ఆయన 234రోజులు జైలు బయటే ఉన్నారు. మైనర్ బాలిక లైంగికదాడి కేసులో జీవిత ఖైదులో ఉన్న మరో బాబా ఆశా రామ్ బాపూను ఆయుర్వేద చికిత్సకై తాజాగా బయటకు వదులుతాం. అన్ని వ్యవస్థలనూ నీరుగార్చి, అధికారం సహా అనేక బలహీనతలతో పాలకులు చేసే ఈ పాపాలన్నీ బాధి తులకు శాపాలు కాక మరేమవుతాయి? ఇంత జరుగుతున్నా స్పందించని మన ప్రధాని ‘మహిళలపై దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టం’ అని ఢంకా బజాయించి మరీ చెబు తున్నారు. మాట్లాడే మాటలకు, చేతలకూ ఉన్న వ్యత్యాసం అనేకసార్లు తెటతెల్లం అవుతూనే ఉంది. నీతులు, ధర్మాలు వల్లించేవారి నిజస్వరూపమేమిటో బయటపెడుతూనే ఉంది.
2012 నాటి ‘నిర్భయ’ ఘటన తర్వాత కఠినచట్టాలు చేసినా పరిస్థితులు మారలేదంటే లోపం ఎక్కడున్నట్టు? వావి వరుసలు లేవు, వయసులో చిన్నాపెద్దా విచక్షణ లేదు. చట్టం పట్ల భయభక్తులు అసలే లేవు. ఇలా ఉచ్చం నీచం మరిచి, చివ రకు చిన్నారులపైనా మనుషులు మృగాలుగా మారడానికి దారి తీస్తున్న సాంఘిక, మానసిక పరిస్థితుల్ని లోతుగా అధ్య యనం చేయా ల్సిన అవసరం ఉంది. మన వెనకాలే ఊడలు దిగుతున్న ఈ వికృత ధోర ణిని పెంచి పోషిస్తున్న మన వినోద, వినిమయ సంస్కృతులు, వైయక్తిక ప్రవర్తనల్ని సమీక్షించుకోవాల్సి ఉంది. ఈ భూతాన్ని ఆపేదెలా అని సత్వరమే ఆలోచించాల్సి ఉంది.