మాగుంట కుటుంబానికి టీడీపీ ఎంపీ టిక్కెట్టు ఎలా ఇచ్చింది?

– ఆయన గురించి ప్రధాని మోడీ, పార్టీ ప్రచారం : ఆప్‌ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవ్‌ రెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ నిలబెట్టడాన్ని ఆప్‌ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ప్రశ్నించారు. శనివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ప్రధాన సాక్షిగా ఉన్న వ్యక్తి కోసం ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన పార్టీ ప్రచారం చేస్తుందని అన్నారు. ‘శరత్‌ చంద్రారెడ్డికి బీజేపీతో ఉన్న సంబంధాల గురించి చెప్పాం. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై బీజేపీకి విరాళాలు ఇచ్చాడు. వైసీపీ మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం. ఎన్టీఏ పక్షం టీడీపీ ఆయనని (మాగుంట రెడ్డి) లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించింది. దీని అర్థం (ఢిల్లీ సీఎం) అరవింద్‌ కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా ప్రధాన సాక్షిగా ఉన్న వ్యక్తికి ఇప్పుడు ప్రధాని మోడీ, మొత్తం బీజేపీ ఓట్లు వేస్తాయి” అని ఆయన అన్నారు.
లిక్కర్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీలో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం ఢిల్లీలోని రూస్‌ అవెన్యూ కోర్టుకు సమర్పించిన సమయంలో ఆ వ్యక్తి పేరును వెల్లడించారు.కేజ్రీవాల్‌ తన కార్యాలయం అప్పటి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని పది రోజుల తరువాత కలవడానికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చిందని చెప్పారు. ”ఢిల్లీలో మా కుటుంబానికి చెందిన చారిటబుల్‌ ట్రస్ట్‌ను తెరవాలనుకుంటున్నానని ఆయన వచ్చి చెప్పాడు. భూమి మా కిందకు రాదని, అది లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జి) కిందకు వస్తుందని నేను ఆయనతో చెప్పాను” అని ఢిల్లీ సీఎం కోర్టులో చెప్పారు. అనంతరం ఈడీ ఆయనకు సంబంధించిన కంపెనీలు, కార్యాలయాల్లో సోదాలు చేసిందని, ఆయన కుమారుడిని అరెస్టు చేసిందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ”తన కుమారుడు ఐదు నెలల పాటు అరెస్టై జైల్లో ఉన్నప్పుడు, తండ్రి తన స్టేట్‌మెంట్‌ను 2023 జూలై 16న మార్చాడు. ఆయన కుమారుడు జూలై 18న విడుదలయ్యాడు. మిషన్‌ పూర్తయింది. అంటే ఈడీ ఏకైక లక్ష్యం నన్ను పొందడం”అని ఆయన అన్నారు.కేజ్రీవాల్‌ చెప్పిన దాని ప్రకారం మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి ఏజెన్సీకి మూడు వాంగ్మూలాలు ఇచ్చారని, అయితే ఒకటి మాత్రమే పరిగణనలోకి తీసుకోబడింది. ”25 వేల పేజీల ఈడీ నివేదికలో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క ప్రకటనను ఎందుకు చేర్చారు. మిగిలిన రెండు స్టేట్‌మెంట్‌లను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ఈ మూడు వాంగ్మూలాలను కోర్టు దృష్టికి తీసుకురావాలి. తద్వారా అది నిజం నిర్ణయించబడుతుంది” అని కేజ్రీవాల్‌ అన్నారు.