
– అందుబాటులో పరికరాలు..ఏర్పాటులో అలసత్వం
– అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు..
నవతెలంగాణ – బెజ్జంకి
గత ప్రభుత్వం ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనే లక్ష్యంతో లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అధికారులు వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. మండల పరిధిలోని గూడెం గ్రామంలో ఓపెన్ జిమ్ పరికరాలు గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారాయి. సంబంధిత అధికారులు ఓపెన్ జిమ్ పరికరాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల ఏర్పాటు చేయడంలో అలసత్వం వహించడం వల్లే సామూహిక భవనంలో గత కొన్నేళ్లుగా మూలన మూలుగుతున్నాయని వ్యాయామం చేసేదెలా అంటూ సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు అలసత్వాన్ని వీడి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని గ్రామంలోని యువత విజ్ఞప్తి చేస్తున్నారు.
వినియోగంలోకి తీసుకురండి..
ఓపెన్ జిమ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పరికరాలు ఉన్నప్పటికీ జిమ్ సెంటర్ ను ఏర్పాటు చేయకుండా అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నిరుపయోగంగా మూలన మూలుగుతున్న జిమ్ పరికరాలను పరిశీలించి వెంటనే స్థల పరిశీలన పూర్తిచేసి గ్రామంలో ఓపెన్ జిమ్ సెంటర్ ను తక్షణమే ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకువచ్చేల అధికారులు చర్యలు చేపట్టాలి – గ్రామ యువకులు, గూడెం