ఐఆర్బీ సంస్థకు టెండర్‌ ఎలా ఇస్తారు..?

 నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆ సంస్థకే వంత పాడుతున్న కేటీఆర్‌ : రేవంత్‌  రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”ఓఆర్‌ఆర్‌ టెండర్‌ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ ఇచ్చిన 30 రోజుల్లో..టెండర్‌ మొత్తంలో 10 శాతం అడ్వా న్స్‌డ్‌గా చెల్లించాలి. ఆ ప్రకారం ఐఆర్బీ సంస్థ రూ. 7,388 కోట్లలో రూ.738 కోట్లను30 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే చెల్లించాల్సిన 10 శాతం చెల్లించకుండా ఇంకా సమయం కోరుతున్నది.. ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థపై చర్యలు తీసుకోకుండా దానికి అనుకూలంగా ఉండేలా అధికారులపై కేటీఆర్‌ ఒత్తిడి తీసుకువస్తున్నారు ” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నిబంధనల మేరకు 10 శాతం నిధులు కూడా చెల్లించలేని ఐఆర్బీ సంస్థకు టెండర్‌ ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు. తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలి అని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం రేవంత్‌ రెడ్డి సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సంపద అయిన ఓఆర్‌ఆర్‌ను ముంబయికి చెందిన ఐఆర్బీ డెవలప్‌మెంట్‌ సంస్థకు కేసీఆర్‌, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్‌, మున్సిపల్‌ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, అప్పటి సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ పర్యవేక్షణలో తెగనమ్మారని ఆరోపించారు. టెండర్‌ ప్రక్రియ మొదలు పెట్టినప్పటి నుంచి టెండర్‌కు సంబంధించిన లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ ఇచ్చేంత వరకు జరిగిన దోపిడీని, దీని వెనుకాల ఉన్న పెద్దల ఆలోచనను పదే పదే కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు వివరిస్తూ వచ్చిందని గుర్తుచేశారు.
”ఏప్రిల్‌ 27న హెచ్‌ఎండీఏ ఐఆర్బీ సంస్థకు లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మే 26లోపు ఐఆర్బీ సంస్థ 738 కోట్లను చెల్లించాలి. లక్ష కోట్ల రూపాయల విలువైన ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టును రూ.7 వేల కోట్లకే దక్కించుకున్నా.. కేటీఆర్‌, ఐఆర్బీ, సోమేశ్‌ కుమార్‌, అర్వింద్‌ కుమార్‌ ధనదాహం తీరలేదు. ఒప్పందాన్ని ఉల్లంఘించి చెల్లించాల్సిన 10 శాతం చెల్లించకుండా ఇంకా సమయం కావాలని ఐఆర్బీ సంస్థ అడుగుతున్నది. మా దగ్గర నిధులు లేవు. ఇంకో 120 రోజుల సమయం కావాలని ఐఆర్బీ సంస్థ హెచ్‌ఎండీఏకు ఉత్తరం రాసింది. అయినా ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై కేటీఆర్‌ ఒత్తిడి తెస్తున్నారు…. ” అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.
”సంస్థ ఫైనాన్షియల్‌ స్టేటస్‌, ఆస్తుల విలువను చూసిన తర్వాతే ఐఆర్బీ సంస్థకు టెండర్‌ కట్టబెట్టామని కేటీఆర్‌, కేసీఆర్‌ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు హడావుడిగా వాయిదాల పద్దతిలో చెల్లించేలా ఐఆర్బీ సంస్థకు వెసులుబాటు ఇచ్చేలా అధికారులపై కేటీఆర్‌ ఒత్తిడి తెస్తున్నారు అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఇటీవలి కాలంలో వివిధ నిర్ణయాలు విమర్శలపాలు కావటంతో అర్వింద్‌ కుమార్‌ సంతకాలు పెట్టడానికి సంశయిస్తుంటే..ఐఏఎస్‌ అధికారి సంతోష్‌ స్థానంలో హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌గా పని చేసి రిటైర్‌ అయిన బీఎల్‌ఎన్‌ రెడ్డిని హెచ్‌జీసీఎల్‌ (హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌) ఎండీగా హడావుడిగా తీసుకొచ్చి అవసరమైన సంతకాలు చేయించారు. గతంలో ఇదే అధికారి తెల్లాపూర్లో రూ.10 వేల కోట్ల విలువ చేసే 400 ఎకరాల భూమిని ఒక ప్రయివేటు సంస్థకు నింబంధనలకు విరుద్ధంగా కేటాయింటారు. అప్పటి నుంచి కేటీఆర్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి మధ్య బంధం బలపడింది. ఐఏఎస్‌ అధికారి సంతోష్‌ను బదిలీ చేసినప్పుడు..టీఎస్పీఎస్సీలో పరీక్షల నిర్వహణకు మంచి అధికారి ఉండాలి…అని బదిలీ చేశామని చెప్పారు. మరీ మంచి అధికారి హెజీసీఎల్‌కు అవసరం లేదా అని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఐఏఎస్‌ అధికారి నిర్వహించాల్సిన బాధ్యతలను ఎప్పుడో పదేండ్ల క్రితం పదవీ విరమణ తీసుకున్న బీఎల్‌ఎన్‌ రెడ్డికి ఎందుకు అప్పజెప్పారు…. ” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బండి మౌనమెందుకు?…
భారీ స్థాయిలో దారిదోపిడీ జరుగుతున్నా బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి ఎందుకు ఫిర్యాదు చేయరు? బండి సంజయ్ ఓఆర్‌ఆర్‌ అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదు? బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఉన్న అవగాహన ఏమిటి? అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్‌ టెండర్‌ ముసుగులో జరుగుతున్న దోపీడీని ప్రజాక్షేత్రంలో, చట్టపరమై చర్యల ద్వారా కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటుందని రేవంత్‌ రెడ్డి తెలిపారు.