కరువులు దేశాభివృధ్ధికి అడ్డంకిగా నిలుస్తున్నాయి. అడవుల నిర్మూలన, వాతావరణ ప్రతికూలతలు, మానవ చర్యలు వెరసి, సారవంతవైన, బంజరు భూములు కూడా ఎడారులుగా తయారవుతున్నాయి! సహజంగా ఒక ప్రాంతంలో ఎక్కువ కాలం వర్షాలు కురవక రావాల్సినంత పంట దిగుబడి రాకపోతే దాన్ని కరువు అంటారు. భారత వాతావరణ శాఖ తెలిపినట్టు ఏ ప్రదేశంలోనైనా సరే సగటు వార్షిక వర్షపాతం 25 శాతం కంటే తక్కువగా ఉంటే ఆ ప్రాంతం కరువులో ఉన్నట్టే లెక్క. సగటున ఇండియా 118 సెం.మీ వార్షిక వర్షపాతాన్ని పొందుతున్నది. సగటు స్థాయి కంటే 25 నుండి 50శాతం మధ్య వర్షపాతం ఉంటే మితమైన కరువు, సగటు కంటే 50శాతం ఎక్కువ వర్షపాతం తగ్గినప్పుడు తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. చాలాకాలం పాటు తగినంత వర్షపాతం లేనప్పుడు వాతావరణ కరువు, నేలలో తేమ, వర్షపాతం లేనప్పుడు వ్యవసాయ కరువు సంభవిస్తాయి. నదులు, సరస్సులు, జలాశయాలు, వివిధ రిజర్వాయర్లు లేదా నిల్వలలో ఉండాల్సిన నీటి మట్టం కంటే దిగువకు పడిపోయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు దాపురిస్తాయి. నీటి కొరత వల్ల జలకరువు, తగినంత నీటి సరఫరా లేని కారణంగా సహజ పర్యావరణ వ్యవస్థ ఉత్పాదకత తక్కువగా ఉన్నట్లయితే పర్యావరణ కరువులు ఏర్పడతాయి.
స్వాతంత్య్రం తరువాత మనదేశం 1965 -67, 1972 -73, 1979-80, 1985-88 ఏండ్లలో పెద్ద కరువులను ఎదుర్కొన్నది. మన వ్యవసాయం ఎక్కువగా రుతుపవనాల వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ యోగ్యమైన భూమిలో దాదాపు మూడింట రెండు వంతులు వర్షాధారమే. మొత్తం భౌగోళిక ప్రాంతం 32.872 కోట్ల హెక్టార్లలో 29.7 శాతం అంటే సుమారు 9.785 కోట్లు హెక్టార్ల విస్తీర్ణం భూక్షీణతకు గురైంది. మొత్తం విస్తీర్ణంలో 16 శాతం, జనాభాలో 12 శాతం మంది కరువు బారిన పడుతున్నారు. సగటు కరువు పీడిత ప్రాంతం 10 లక్షల చదరపు కి.మీ లేదా దేశంలోని మొత్తం భూభాగంలో మూడింట ఒక వంతుగా ఉండొచ్చని నిపుణుల అంచనా. భారత్‌లో మొత్తం 29 రాష్ట్రాలకుగాను 26 రాష్ట్రాల్లో గత పదేళ్లలో ఎడారి ప్రాంతం బాగా పెరిగింది. రాజస్థాన్, ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రోజురోజుకీ సారవంతమైన భూములు తగ్గిపోతున్నాయి. మిజోరంలో లంగ్లే ప్రాంతంలో అధికంగా నేల పెలుసుబారుతున్నది. 2003 నుండి 2011 మధ్యలో అత్యధికంగా18 లక్షల హెక్టార్ల భూమి ఎందుకూ పనికిరాకుండా పోయింది. తెలంగాణలో 31.40 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 14.35 శాతం భూములు నిరుపయోగంగా మారాయి. ఉమ్మడి అనంతపురం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికంగా ఎడారీకరణ జరుగుతోంది.
దీనివల్ల వచ్చే నష్టాల్ని గమనిస్తే గనుక..ఈ కరువుల వలన వృక్ష సంపద నాశనమవుతుంది. నేలకోతకు గురవుతుంది. నీరు కలుషితం అవుతుంది. కొన్నిరకాల జాతులు నశించి జీవవైవిధ్యం దెబ్బతింటుంది. ఈ కరువు సమాజంలోని బలహీన వర్గాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పేదరికం పెరుగుతుంది. కరువు ఫలితంగా సాగు విస్తీర్ణం తగ్గి వ్యవసాయోత్పత్తి తగ్గుతుంది. ప్రజల కొనుగోలుశక్తి మందగిస్తుంది. వ్యవసాయ కార్మికులకు ఉపాధి ఉండదు, తాగునీరు, పశుగ్రాసం, ఆహార కొరత ఏర్పడుతుంది.ప్రజలు పోషకాహార లోపానికి గురవుతారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టాల్సి వస్తుంది. ఆహార భద్రత సమస్యలు ఏర్పడతాయి. ఇది మొత్తంగా దేశ జీడీపీ మీద ప్రభావం చూపి ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. అయితే దీనికి పరిష్కార మార్గాలను ప్రభుత్వాలు అన్వేషించాలి. నదులను అనుసంధానం చేసి, మరిన్ని రిజర్వాయర్లు, ఆనకట్టల నిర్మాణానికి రూపకల్పన జరగాలి. కరువు నిరోధక పంటలను ప్రోత్సహించాలి. అడవులను కాపాడుకుంటూనే, వృక్షాలను పెంచి పచ్చదనం పెంపుచేయాలి. నీటి సంరక్షణలో భాగంగా వర్షపు నీరు నదులు, సముద్రాలలో కలసిపోకుండా చెక్ డ్యామ్‌లను నిర్మించాలి. నేల స్థిరీకరణ కోసం షెల్టర్ బెల్టలను, వుడ్‌లాట్‌లను ఉపయోగించాలి. వుడ్‌లాట్ అనేది చెట్ల చిన్న ప్రాంతం. వుడ్‌లాట్‌లు నేల కోతను నిరోధించడం లో స్థానిక వాతావరణాన్ని మెరుగుపరచడంలోను, గాలిని శుద్ధి చేయడంలోనూ సహాయపడతాయి. భూసార పరిరక్షణ, జీవ వైవిధ్యం పెంపుతో పాటుగా వ్యవసాయ భూముల్లో గృహాలు, పెద్ద పెద్ద భవనాలు నిర్మాణాలు చేయకూడదు. పరిమితికి మించి వ్యవసాయ బోర్లు తవ్వకూడదు. అలాగే నివాసాల్లో మంచి నీటి బోర్లను అవసరానికి మాత్రమే వేసుకోవాలి.ఇలా చేస్తేనే కరువు నుంచి దేశాన్ని కాపాడుకోగలం.
– జనక మోహన రావు దుంగ, 8247045230