‘కల్తీ’ని అరికట్టేదెలా..?

రాష్ట్రంలో అహార పదార్థాల కల్తీలు పెరిగిపోయాయి. నాణ్యమైన సరుకులు, పదార్థాలు వినియోగదారులకు లభించని పరిస్థితి. ఏదైనా ఘటన జరిగినప్పుడు తప్పితే కల్తీ నియంత్రణపై ప్రభుత్వం స్పందించడం లేదు. తనిఖీలు, దాడులు కొనసాగించడం లేదు. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించినప్పుడు ఆయా ఫుడ్‌ తయారీ కేంద్రాల్లో కల్తీలు వెలుగుచూస్తున్న ఘటనలు దిన పత్రికల్లో, టీవీల్లో చూస్తున్నాం. రోడ్లపై మిర్చి బండ్ల నుంచి మొదలుకుంటే పానిపూరీ, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, పేరు మోసిన రెస్టారెంట్లలో కూడా కల్తీలు బయట పడుతున్నాయి. ఇక హోటళ్లలో అపరిశుభ్రత, నాణ్యత లేని నీరు, కల్తీ వస్తువులతో ప్రజలు అనారోగ్య సమస్యలు ‘కొని’ తెచ్చుకుంటున్నట్టే అవుతోంది. కల్తీ పదార్థాల వలన క్యాన్సర్‌ లాంటి వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోనే అహార కల్తీ నియత్రణ విభాగం ఉంది. దీని పర్యవేక్షణతో పాటు నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యపాలవుతున్నారు.
కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో మోమోస్‌ మయోనీజ్‌ తినడంతో ఒకరు చనిపోయి, పదుల సంఖ్యలో అస్వస్థతకు గురైన విషయం విదితమే. బజారులో రోజూ తినే పదార్థాలు..కల్తీయా, నాసి రకమా అనే తేడా తెలియడం లేదు. నిత్యావసరంగా ఇంట్లోకి తీసుకెళ్లే పసుపు, కారం, దనియాలు, పప్పులు, నూనెలు కూడా అంతే. ప్యాకెట్స్‌ ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయిన వాటిపై స్టిక్కర్స్‌ అతికించి దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. పెద్ద పెద్ద మార్ట్‌ల్లోనూ ఇవి దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకంగా చూస్తే తప్ప గుర్తించలేని పరిస్థితి. ఆరోగ్యం కోసం పండ్లు తినాలన్నా అనుమానమే కలుగుతోంది. కుర్‌కురే, చట్‌పట్‌, పాపడ్స్‌, చాక్లెట్లు చాలా నాసిరకంగా ఉంటున్నాయి. స్వీట్స్‌ హౌజ్‌ల్లో లడ్డూ, జిలేబీ, కేక్‌లలో విచ్చలవిడిగా కలర్స్‌ వినియోగిస్తున్నారు. దీనివల్ల క్యాన్సర్‌తో పాటు లివర్‌ సంబంధిత వ్యాధులు వస్తాయని రైతులు చెబుతున్నారు. ఇక ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో వినియోగించే ఆయిల్‌, కలర్స్‌, ముడి పదార్థాల గురించి వేరే చెప్పనవసరం లేదు. హోటల్స్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్స్‌, మెస్‌, కన్ఫెక్షనరీ షాపుల్లో ఎనభై శాతం ఏదో రకమైన నాసిరకం పదార్థాలు తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు.కల్తీ ఉత్పత్తులను నిగ్గుతేల్చి, వినియోగ దారులకు నాణ్యమైన పదార్థాలందేలా చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్‌ సేఫ్టీ విభాగం కళ్లుండీ చూడనట్లుగా వ్యవహరిస్తోంది.
గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో మోబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను మంజూరు చేసినప్పటికీ ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు ఏ మేరకు ఈ కల్తీని నియంత్రిస్తుందో స్పష్టతనివ్వలేదు. ఇక దుకాణాలు, హోటళ్లు, అహార ఉత్పత్తి సంస్థల రిజిస్ట్రేషన్‌, లైసెన్సుల జారీ.. ఇవన్నీ చిదంబర రహస్యాలే. అహార పదార్థాల తయారీ దారులు, హోటళ్ల యజమానులు, ఇతర దుకాణా దారుల దరఖాస్తులను జీఎఫ్‌ఐ పరిశీలించి రిజిస్ట్రేషన్‌, లైసెన్సులు జారీ చేయాల్సి ఉంది. ఆయా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేశాక, క్షేత్ర స్థాయిలో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ పరిశీలించి, అర్హతలున్నట్టు నిర్ధారించాకే, కొన్ని షరతుల మేరకు వారికి లైసెన్స్‌లు జారీ చేయాలి. కానీ, అలా జరగడం లేదనే ఆరోపణలు కోకొల్లలు. లైసెన్సుల జారీ, తనిఖీలపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అహార ఉత్పత్తులు, విక్రయ కేంద్రాలు లక్షల్లో ఉంటే రిజిస్ట్రేషన్‌, లైసెన్సుల జారీ మాత్రం వేలల్లో ఉంటున్నాయి. ఫుడ్‌ సేఫ్టీ సిబ్బందిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధి కారులు, జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణ లేకుండా పోయింది. గతంలో నెలకోసారైనా సమీక్ష నిర్వహించి కల్తీ నిర్వాహకులకు ఫైన్‌ వేయడం, సీజ్‌ చేయడం వంటి చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడా సమీక్షలు లేవు. దీంతో కల్తీ మూడు పూలు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కల్తీని అరికట్టేలా సమీక్షలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
-సిహెచ్‌. జనార్థన్‌, 8121938106