గుర్తించడమిలా…!

గుర్తించడమిలా...!మార్కెట్‌ అంతా కల్తీమయమయిపోయింది. ఏది స్వచ్ఛమైనదో.. ఏది కల్తీనో తెలియడం లేదు. మన దేశంలో తయారయ్యే తేనెలో ప్రముఖ బ్రాండ్లు కల్తీకి పాల్పడుతున్నాయట. సహజ ఔషధ గుణాలున్న తేనె.. మనకు ఎంతో అవసరం. స్వచ్ఛమైన తేనె ఎన్ని రోజులైనా పాడవదు. అంతేకాక అందులో ఉండే ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. కానీ కల్తీ తేనెలు వాడటం మూలాన అవి త్వరగా పాడవడం అటుంచితే దాని ద్వారా ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఇటువంటి నేపథ్యంలో స్వచ్ఛమైన తేనెను గుర్తించడానికి పలు మార్గాలున్నాయి. దీనిని మన ఇంటిలోనే చేసుకోవచ్చు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మన వంటింట్లో లభ్యమయ్యే వాటితోనే తేనెను చెక్‌ చేసుకోవచ్చు.
వెనిగర్‌ టెస్ట్‌ : తేనె అసలుదో నకిలిదో గుర్తించాలంటే వెనిగర్‌ ద్వారా ఇట్టే పట్టేయచ్చు. మీ ఇంట్లో మార్కెట్‌ నుంచి తీసుకొచ్చిన తేనె డబ్బాలోని రెండు, మూడు చుక్కల తేనెను వెనిగర్‌ నీటిలో వేయండి. అందులో నురుగులు వస్తే మాత్రం అది కచ్చితంగా కలుషితమైనదే.
నీటి పరీక్ష : తేనె స్వచ్ఛతను గుర్తించడానికి ఇది మరొక పరీక్ష. స్వచ్ఛమైన తేనె నీటిలో కరగదు. దీని కోసం తేనెను.. నీటిని కలపండి. నీటిలో కరిగితే మాత్రం అది చక్కెర ద్రావణమే. అసలైన తేనె నీటిలో వేసినా దానికుండే సహజ గుణాలను కోల్పోదు.
వేడి పరీక్ష : వేడి నీటి పరీక్ష ద్వారా కూడా తేనె కలుషితమైందో లేదో తెలుసుకోవచ్చు. తేనె డబ్బాలో ఒక అగ్గిపెట్టెను గానీ.. దూది ముక్కను గాని వేయండి. అనంతరం దానిని వెలిగించండి. మీరు మంటను చూడగలిగితే అది స్వచ్ఛమైన తేనె. అలా కాకుండా మండీ మండకుండా ఉంటే అది కలుషితమైంది.