బడిలో టీచర్లు లేకపోతే పిల్లలను ఎలా పంపించేది అని విద్యార్థుల తల్లి దండ్రులు ఉపాధ్యాయులను తల్లి దండ్రుల సమావేశంలో ప్రశ్నించిన సంఘటన వీర్నపల్లి మండలం గర్జనపల్లి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లి దండ్రులు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత విషయంలో ఒక్కరు ఇద్దరు టీచర్లు ఉంటే ఎలా? అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో పూర్తి స్థాయి టీచర్లను నియమించాలని కోరారు.గత సంవత్సరం నుండి పాఠశాలలో గణిత, ఆంగ్ల, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు లేరని, ఆ కారణంతో చాలా మంది విద్యార్థులు ఇతర పాఠశాలల్లో చేరారని అన్నారు. తమ పిల్లల్ని దూర ప్రాంతంలో చదివించడం ఇష్టం లేదని, వెంటనే పాఠశాలలో గణిత, ఆంగ్ల ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. పాఠశాల ప్రారంభం అయ్యి 2 నెలలు కావస్తున్నా 10 వ తరగతి విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో పాఠాలు ఇంకా మొదలు కాలేదని, ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు ఎంతో నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉపాధ్యాయులు దసరా వరకు వస్తారని ఉపాధ్యాయులు సర్ది చెప్పినప్పటికీ, తల్లిదండ్రులు సంతృప్తి చెందలేదు. విద్యార్థులు నష్ట పోకుండా తాత్కాలిక సర్దుబాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు ప్రేమ్ సాగర్, ఉమారాణి , మంజుల ,తల్లిదండ్రులు సత్తవ్వ , భారతవ్వ , పద్మ, నర్సవ్వ , తదితరులు పాల్గొన్నారు.