అనుమానం పెద్ద రోగం అంటారు పెద్దలు. ఒకసారి అది మనసులోకి వచ్చిందంటే పాత రోగంలా ఓ పట్టాన వదలదు. అనుమానం ఉన్నవాళ్లు సంతోషంగా ఉండలేరు. అంతేకాదు ఇతరులు సంతోషంగా ఉన్నా భరించలేరు. నేటి పరిస్థితుల్లో మారిన జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. దీని వల్ల కూడా అనేక అనుమానాలు రావడం సహజం. అయితే పొసెసివ్ వేరు, అనుమానం వేరు. రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. పొసెసివ్ అంటే ఒక వ్యక్తికానీ, వస్తువుకానీ నాకు మాత్రమే సొంతం అనుకోవడం. కానీ అనుమానం అలా కాదు. తన జీవిత భాగస్వామి ఎవరితోనో ప్రేమలో ఉన్నారు, వేరే వారితో సంబంధం పెట్టుకున్నారని బాధ పడుతూ తాము ఇబ్బంది పడుతూ, భాగస్వామినీ ఇబ్బంది పెట్టడమే అనుమానం. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
దివ్యకు 30 ఏండ్లు ఉంటాయి. ఆమెకు 32 ఏండ్ల రమేష్‌తో పెండ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్ ప్రభుత్వ ఉద్యోగి. దివ్య ప్రయివేటు స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేస్తుంది. పిల్లలు ఇద్దరూ స్కూల్‌కి వెళుతున్నారు. దివ్యకు అత్తమామలు లేరు. ఇద్దరూ చనిపోయారు. ఒక ఆడపడుచు ఉంది. ఆమె కూడా ఏడాదికి ఒకసారి ఇంటికి వస్తుంది. రాఖీ రోజు రాఖి కట్టి వెళ్లిపోతుంది. రమేష్‌కు ఎక్కువగా బంధువులు ఎవరూ లేరు. ఉన్న కొద్ది మంది కూడా ఏదైనా పెండ్లి, ఫంక్షన్లు ఉంటేనే వచ్చి వెళ్లిపోతారు. అయితే రమేష్ మంచి మాటకారి. అందరితో కలివిడిగా ఉంటాడు. కొత్త పాత అనే భేదం లేకుండా అందరితో మాట్లాడుతూనే ఉంటాడు.
ఆఫీసు స్నేహితులతో కూడా బాగా మాట్లాడుతుంటాడు. దివ్యకు రమేష్ అలా అందరితో మాట్లాడడం ఇష్టం ఉండదు. నా భర్త నాతో మాత్రమే మాట్లాడాలి, నాకే సొంతం అనుకుంటూ ఇతరులు ఎవరితో మాట్లాడినా భరించలేకపోయేది. అంతే కాదు అనుమానించి గొడవ పెట్టుకునేది. ఎవరైనా ఫోన్ చేసినా ఎవరితో, ఎందుకు ఇంత సేపు మాట్లాడుతున్నావు, ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత మాట్లాడుకోవచ్చు కదా! ఇంట్లో ఉన్నంత సేపు నాతో మాట్లాడవచ్చు కదా! ఇప్పుడు కూడా వారితోనే మాట్లాడాలా అంటుంది.
రమేష్ అక్క కూతురి పెండ్లి ఈ మధ్యనే జరిగింది. దానికి రమేష్ వాళ్ల బంధువులు అందరూ వచ్చారు. అయితే అందరూ వాళ్ల అక్క ఇంటికే వచ్చారు. కానీ రమేష్ మామయ్య కూతురు రమ్య. ఆమెకు పెండ్లి అయ్యి ముగ్గురు పిల్లలున్నారు. రమేష్, ఆమే ఒకే వయసు వారు కావడంతో పెండ్లి కాక ముందు నుండి చనువుగా మాట్లాడుకునేవారు. పెండ్లిలో చాలా ఏండ్ల తర్వాత కలవడంతో ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అది చూసి దివ్యకు చాలా కోపం వచ్చింది. పెండ్లిలో నన్ను కాదని ఆమెతో మీకేంటి మాటలు అంటూ గొడవ చేసింది. దానికి రమేష్ ‘మా ఇద్దరి మధ్య నువ్వు అనుకున్నట్టుగా ఏమీ లేదు’ అని ఎంతగా చెప్పినా దివ్య వినిపించుకోలేదు. చాలా పెద్ద గొడవ చేసింది. ఆ విషయం రమేష్ మరదలికి తెలిసింది. ‘నా వల్ల మీకు గొడవలు రావడం దేనికీ’ అని ఆమె రమేష్‌తో మాట్లాడడం మానేసింది. ఆ రోజు నుండి రమేష్ కూడా అందరితో మాట్లాడడం తగ్గించేశాడు. అంతకు ముందులా సరదాగా ఉండడం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత అన్నం పెడితే తింటున్నాడు లేకపోతే లేదు. రమేష్‌కి నచ్చని కూర వండినా కనీసం అడగడం లేదు. మూడీగా ఉంటున్నాడు. ఇలా అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అతన్ని ఎలాగైనా తిరిగి మామూలు మనిషిని చేయాలని దివ్య చాలా ప్రయత్నించింది. కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఇదంతా జరిగి ఇప్పటికి రెండేండ్లు అవుతుంది. కానీ ఆయనలో ఎలాంటి మార్పూ లేదు. దాంతో దివ్యకు మరింత అనుమానం వచ్చింది. ‘మరదలితో ఏదో ప్రేమ వ్యవహారం ఉండే ఉంటుంది, ఆమెతో మాట్లాడవద్దన్నందుకు అతను ఇలా బాధ పడుతున్నాడు’ అనే అభిప్రాయానికి వచ్చి ‘ఎలాగైనా నాకు న్యాయం చేయండి, నేను చేసిన దాంట్లో తప్పేముంది. వాళ్ల మరదలితో మాట్లాడవద్దని గొడవ చేశాను’ అంటూ ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి తన సమస్య చెప్పుకుంది.
మేము రమేష్‌కు ఫోన్ చేసి పిలిపించాము. దివ్య చెప్పిన విషయాల గురించి అడిగితే ‘దివ్యకు అనుమానం ఎక్కువ. నేను ఎవరితో మాట్లాడినా ఆమెకు నచ్చదు. వారితో నాకు ఏదో సంబంధం ఉందని అనుకుంటుంది. ఆమె వల్లనే నేను నా బంధువులకు దూరంగా ఉంటున్నాను. స్నేహితులు కూడా రావడం లేదు. చాలా ఏండ్ల తర్వాత ఈ మధ్య మా అక్క కూతురి పెండ్లిలో అందరం కలిసి మాట్లాడుకున్నాం. చాలా సంతోషంగా అనిపించింది. మా మామయ్య కూతురు అయితే దాదాపు పదేండ్ల తర్వాత కలిసింది. మేము చిన్నప్పటి నుండి కలిసి ఆడుకున్నాము. నేను అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లడం, ఆమె మా ఇంటికి రావడం చేస్తుండేవాళ్లం. ఇద్దరిదీ దాదాపు ఒక్కటే వయసు. అందుకే మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. అలాంటిది ఆమె పెండ్లి అయిన తర్వాత కలవడం బాగా తగ్గిపోయింది. 10 ఏండ్ల తర్వాత కలిస్తే పది నిమిషాలు మాట్లాడినందుకు దివ్య అంత పెద్ద గొడవ చేసింది. మేము ఇద్దరం భార్యాభర్తలం కదా ఆమెకు తెలియదా నా గురించి. అయినా ప్రతి సారి అలాగే గొడవ చేస్తుంది. పదేండ్ల తర్వాత కలిసిన అమ్మాయిని తన అనుమానంతో బాధపెట్టింది.
మా అమ్మకు, నాన్నకు రమ్య అంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడూ తనను ఒక్క మాట కూడా అనేవాళ్లం కాదు. పైగా మా అమ్మ ఎప్పుడూ ‘రమ్యలో మా అమ్మను చూసుకుంటున్నా’ అనేది. అలాంటి రమ్యకు నా వల్ల ఎప్పుడూ బాధ కలగకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు దివ్య వల్ల ఆమె బాధపడింది. పెండ్లిలోనే అందరి ముందు నన్నూ ఆమెను తిట్టింది. అది కూడా మాటల్లో చెప్పలేని పదాలు వాడింది. దివ్య మాటలకు రమ్య ఏడ్చేసింది. కానీ దివ్యను గానీ నన్ను గానీ ఒక్క మాట కూడా అనలేదు. అక్కడి నుండి వెళ్లిపోయింది. ఈమెకు వున్న అనుమానంతో రమ్యను బాధ పెట్టింది. పెండ్లిలో గొడవ చేయడం వల్ల మా అక్కకు వియ్యాల వారి ముందు పరువు పోయింది. ఇక అలాంటప్పుడు నేను దివ్యతో మామూలుగా ఎలా ఉండగలను. మా బావ నన్ను పిలిచి తిట్టాడు. అప్పటి నుండి మా అక్క కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. గతంలో కనీసం రాఖీ అప్పుడైనా వచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇలా దివ్య వల్ల మా వాళ్లందరికీ దూరం అయిపోతున్నాను. అందుకే నేను అప్పటి నుండి దివ్యతోనే కాదు వేరే ఎవ్వరితోనూ మాట్లాడడం లేదు. ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూనే ఉంటుంది. లేని పోని సమస్యలు వస్తాయి. అందుకే మౌనంగా ఉంటున్నాను’ అని చెప్పి బాధపడ్డాడు.
మొత్తం విన్న తర్వాత మేము దివ్యను కూర్చోబెట్టి ‘చూడు దివ్య నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. మీ పెండ్లి జరిగి పదేండ్లు అవుతుంది. అయినా నీ భర్త గురించి నువ్వు ఇంకా తెలుసుకోకపోతే ఎలా? ఎందుకు నీకు అతనిపై అంత అనుమానం. ఇంత పిచ్చిగా ఎలా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వు రమేష్ వాళ్ల అక్క బావలను క్షమాపణ చెప్పాలి. అలాగే రమ్యకు కూడా చెప్పాలి. వారిద్దరూ చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. అలాంటి వారు కాస్త క్లోజ్‌గా ఉండడంలో తప్పేముంది. అనవసరంగా ప్రతి చిన్న విషయానికీ నీ భర్తను అనుమానించి లేని పోని సమస్యలు తెచ్చుకుంటున్నావు. నీ సంతోషాన్ని నువ్వే దూరం చేసుకుంటున్నావు. ఇలా ప్రతి చిన్న విషయానికి గొడవలు చేయడం నీ సంసారానికి మంచిది కాదు. రమేష్‌తో మంచిగా ఉండు. లేదంటే భవిష్యత్తులో నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది’ అని చెప్పాము.
రమేష్‌తో ‘మీరు తిరిగి దివ్యతో మామూలుగా ఉండేందుకు ప్రయత్నించండి. తను చేసిన పొరపాటు తెలుసుకుంటుంది. లేదంటే ఆమెలో అనుమానం మరింత పెరుగుతుంది. ఇకపై మీ మధ్య ఎలాంటి గొడవ వచ్చినా మా దగ్గరకు రండి. దివ్య కచ్చితంగా మారుతుంది. దీనికి మీ సహకారం కూడా అవసరం. అప్పుడే మీ ఇద్దరూ సంతోషంగా ఉంటారు. లేదంటే ఈ ప్రభావం మీ పిల్లలపై కూడా పడుతుంది. తర్వాత మీ ఇష్టం’ అని చెప్పి పంపించాము.
– వై వరలక్ష్మి,
9948794051